
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని, ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. మరో రూ.లక్ష అదనంగా ఇచ్చే ఆలోచన కూడా చేస్తున్నామని వెల్లడించింది. రాష్ట్రంలో సంభవించిన వరద నష్టాలపై శాసనసభలో గురువారం జరిగిన లఘు చర్చలో సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి బదులిచ్చారు. మృతుల్లో రైతులు ఉంటే రూ.4 లక్షల పరిహారంతో పాటు, తక్షణమే రూ.5 లక్షల రైతు బీమా అందుతుందని తెలిపారు.
రాష్ట్రంలో 139 గ్రామాల్లో వర్షాల వల్ల నష్టం జరిగిందని మంత్రి వివరించారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న 7,870 ఇళ్లకు చెందిన 27 వేల మందిని 157 పునరావాస కేంద్రాలకు తరలించిన ట్టు తెలిపారు. 419 ఇళ్లు కూలిపోయాయని, 7,505 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పూర్తిగా కూలిన ఇళ్లను గృహలక్ష్మి పథకంలో చేర్చి కట్టించాలని సీఎం కేసీ ఆర్ ఆదేశించినట్టు చెప్పారు. పంటల నష్టాలపై అంచనాలు వేస్తున్నామని, వివరాలు వచ్చాక ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి వేముల హామీనిచ్చారు. వరద సాయం చేయమని కోరితే కేంద్రం ప్రతిసారీ కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ పార్టీ సభ్యుల వాకౌట్
వరదల నష్టాన్ని నివారించేందుకు ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలమైందని, నష్టపోయిన ప్రజలను ఆదుకోవడంలో అలక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ శాసనసభలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. చర్చలో పాల్గొన్న ఆ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ, తాము లేవనెత్తిన సందేహాలకు, ప్రజలను ఆదుకోమని చేసిన విజ్ఞప్తికి మంత్రి సరైన సమాధానం చెప్పలేదని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు.