బస్సు నుంచి ప్రయాణికులను దింపుతున్న స్థానికులు
బీబీనగర్: వరంగల్–1 డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్లపొదల్లోకి దూసుకెళ్లింది. శనివారం హైదరా బాద్ నుంచి వరంగల్‌కు వెళుతున్న సూపర్ లగ్జరీ బస్సు యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని ఎయిమ్స్ సమీపంలోకి రాగానే ఒక్కసారి అదుపుతప్పి రహదారి పక్కన గల గుంతలో చెట్లపొదల్లోకి దూసుకెళ్లి ఆగిపోయింది. దాదాపు 200 మీటర్లు దూరం వరకు బస్సు అలా ముందుకు వెళ్లిపోయింది.
ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ప్రమాదానికి గురికాగానే స్థానికులు వెంటనే వచ్చి ప్రయాణికులను బయటకు తీశారు. కాగా, బస్సులో 20 మంది పైగా ఎస్సై పరీక్షకు హాజరు కావాల్సిన అభ్యర్థులు ఉన్నారు. ఆదివారం పరీక్ష ఉండగా వారు ఒక రోజు ముందుగానే వరంగల్‌కు బయలుదేరారు. వీరంతా హైదరాబాద్‌లోని వివిధ ప్రాతాలకు చెందిన వారని తెలిసింది.
స్టీరింగ్ లాక్ కావడంవల్లే: డ్రైవర్ రాజన్న
ఈ ప్రమాదంపై డ్రైవర్ రాజన్న మాట్లాడుతూ.. ఎయిమ్స్ సమీపంలోకి రాగానే స్టీరింగ్ లాక్ కావడంతో బస్సు ఎడమ వైపు దూసుకెళ్లిందని, వెంటనే బ్రేక్ వేశానని, అయినా కొంతదూరం చెట్లపొదల్లోకి వెళ్లి నిలిచిపోయిందని చెప్పారు. అనంతరం ప్రయాణికులను ఇతర డిపోలకు చెందిన బస్సులలో ఎక్కించి పంపించారు. ఇదిలా ఉండగా బస్సు చెట్లను ఢీకొని ఆగిపోవడంతోనే తమ ప్రాణాలు దక్కాయని ప్రయాణికులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment