సాక్షి, హైదరాబాద్/ సాక్షి, రంగారెడ్డి జిల్లా/ శంషాబాద్/ శంషాబాద్ రూరల్: వేదమంత్రోచ్చారణ, శ్రీమన్నారాయణుడి శరణు ఘోషతో రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని ముచ్చింతల్ ప్రాంతం మార్మోగిపోయిది. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల కోసం ముస్తాబైన సమతా స్ఫూర్తి కేంద్రం గురువారం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. లక్ష్మీనారాయణుడి సుప్రభాత సేవతో గురువారం కార్యక్రమాలు మొదలయ్యాయి. దుష్ట నివారణ కోసం శ్రీ సుదర్శనేష్టి, సర్వాభీష్ట సిద్ధికి వాసుదేవేష్టి అష్టోత్తర శతనామ పూజను నిర్వహించారు.
ఆరాధన, విష్వక్సేనుడి పూజ, ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా గరుడ పతాకాన్ని అవిష్కరించారు. గరుడుడి ద్వారా యాగశాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఆ తర్వాత అగ్నిమథన కార్యక్రమంతో లక్ష్మీనారాయణ మహాయాగం ప్రారంభమైంది. సహజ పద్ధతిలో (శమీ దండం, రావి దండం కర్రలతో మథించి) అగ్నిని పుట్టించిన అనంతరం.. ఆ అగ్నిని యాగశాలలకు వితరణ చేసి కుండాలలో నిక్షిప్తం చేసిన రుత్వికులు అత్యంత వైభవంగా యాగాన్ని ప్రారంభించారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
ఆచార్య ఆరాధన...
సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రవచన మండపంలో చిన జీయర్ స్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీప ప్రజ్వలనతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది భక్తులు క్యూలైన్లలో ఆసీనులయ్యారు. ఆచార్య స్మరణ అనంతరం చిన జీయర్‌స్వామితో పాటు మైహోం సంస్థల అధినేత జె.రామేశ్వరరావు భక్తుల చెంతకు వచ్చి భగవంతుడి ప్రతిమతో కూడిన డాలర్లను పంపిణీ చేశారు. అనంతరం భక్తులు వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించారు.
ఈ సమయంలో చిన జీయర్ స్వామి భక్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని అందరూ పఠించారు. అదే సమయంలో చిన్న జీయర్ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను, స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహామహోపాధ్యాయ డాక్టర్ సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్ నుంచి విచ్చేసిన శ్రీమాన్ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.
అలరించిన కార్యక్రమాలు
ఓ వైపు హోమాలు, మరో వైపు కనువిందు చేసే నృత్యాలు, ఇంకోవైపు వినసొంపైన సంప్రదాయ సంగీతం, భక్తి భజనలతో శ్రీరామనగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. యాగశాలలో రుత్వికులు వేద మంత్రోచ్ఛారణ చేస్తుండగా.. ప్రవచన మండపంలో గాయని సురేఖ బృందం సంప్రదాయ సంగీతంతో వినసొంపైన గానాన్ని ఆలపించారు. శ్రీపాద రమాదేవి శిష్య బృందం ‘వాసుదేవాజ్మజ, నారాయణ.. శ్రీమన్నారాయణ’కీర్తనలకు కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు.
నవవిధ భక్తి మార్గాల్లో భజన కూడా ఒకటి.. అలాంటి రంగంలో ప్రముఖ కళాకారుడుగా గుర్తింపు పొందిన నర్సింగరావు తన బృందంతో కలిసి ‘హరే కృష్ణ.. హరే కృష్ణ’భజనకీర్తనలు ఆలపించారు. అలివేలు మంగనాథుడు గోవిందా అంటూ ఓ చిన్నారి ఆలపించిన భక్తి గీతం అలరించింది. జిమ్స్ మెడికల్ విద్యార్థులు నాటకాన్ని ప్రదర్శించారు. పావని, మాధవపెద్ది బృందం ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది.
భక్తుల సుఖసంతోషాలే
భగవంతుడి అభిలాష
– చినజీయర్ స్వామి ప్రవచనం
ప్రతి వ్యక్తి తనకు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే సన్మార్గంలో ప్రయాణించినట్లేనని త్రిదండి చినజీయర్ స్వామి బోధించారు. ఆచార్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా పూజలో పాల్గొన్న భక్తులనుద్దేశించి ఆయన ప్రవచనాలు చేశారు. దేవతారాధనపై చాలామందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నారు. తాము చేసే తప్పుల నుంచి కాపాడమని కొందరు పూజలు చేస్తారని తెలిపారు. తమపై భగవంతుడు కోపోద్రిక్తుడు కాకుండా ఉండేందుకు పూజలు చేస్తామని కొందరు చెబుతారన్నారు. అయితే స్వచ్ఛమైన ప్రేమకు కేంద్రం భగవంతుడని, భక్తులను సుఖసంతోషాల్లో ఉంచడమే భగవంతుడి అభిలాష అని చినజీయర్ పేర్కొన్నారు. అన్ని మతాల సారం కూడా ఇదేనన్నారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు ఏవిధంగా ఉంటారో భగవంతుడి ప్రేమ కూడా అదే విధంగా ఉంటుందన్నారు.
యాగంతో సమస్త మానవాళికి మేలు
లక్ష్మీనారాయణుడి యాగశాలను పవిత్ర దేవాలయంగా త్రిదండి చినజీయర్ స్వామి అభివర్ణించారు. మహాయాగం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. యాగశాలకు దేవతలను ఆహ్వానించి పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతమంతా ఒక దేవాలయమేనని, ప్రతి ఒక్కరు భగవంతుడి ధ్యానంలో మునిగిపోవాలని సూచించారు. నిష్టతో ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయన్నారు. ఈ యాగశాలలోని 1,035 కుండాల ద్వారా చేసే యాగంతో వెలువడే పొగ, పరిమళాలతో వాతావరణంలో ఉన్న చెడు అంతరించిపోతుందని, వైరస్ లాంటి కణాలు నశించిపోతాయని చెప్పారు. సమస్త మానవాళికి మేలు జరుగుతుందని అన్నారు.
నేటి కార్యక్రమాలు
సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు యాగశాలలో హోమ, పూజా కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఐశ్వర్య ప్రాప్తికై శ్రీ లక్ష్మీ నారాయణేష్టి, సత్‌సంతానానికై వైనతేయేష్టి సహా శ్రీ లక్ష్మీ నారాయణ అష్టోత్తర శతనామపూజ, ప్రవచనాలు ఉంటాయి.
అగ్ని మథనం ఇలా..
లక్ష్మీనారాయణ యాగంలో అగ్నిమథనాన్ని వేదంలో పేర్కొన్నట్లుగా సృష్టించారు. వేదంలో ‘శమీగర్భాదగ్నమ్ మంథతి’అనే వాక్యంలో చెప్పినట్లుగా.. జమ్మిచెట్టు కర్ర (శమీ దండం)పైన రావి కర్రను (రావి దండం) ఉంచి, వేడి రగులుకుని నిప్పు రవ్వ పుట్టే వరకు రాపిడి ప్రక్రియను కొనసాగించారు. సరిగ్గా తొమ్మిది నిమిషాల రాపిడి తర్వాత నిప్పు రవ్వ జ్వలించింది. అలా పుట్టిన నిప్పురవ్వలను పాత్రలోకి తీసుకుని ఆ అగ్నిని యాగశాలలోని అన్ని కుండాలలోకి వితరణ చేశారు. తొలిరోజు పుట్టించిన అగ్నిని యాగం పూర్తయే వరకు ఆరకుండా కొనసాగిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment