అగ్నిప్రతిష్ట ప్రారంభ సూచికగా సమతామూర్తి విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన మహాగంటను మోగిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో సీఎం సతీమణి శోభ, త్రిదండి చినజీయర్ స్వామి, మైం హోం రామేశ్వరరావు, ఏపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రోజా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భక్తి ఉద్యమంలో రామానుజాచార్యులు గొప్ప విప్లవం తీసుకొచ్చారని, మానవులంతా సమానమంటూ.. సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు. భగవంతుని దృష్టిలో మనుషులంతా సమానమేనని చాటిచెప్పిన శ్రీరామానుజాచార్యుల విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం హైదరాబాద్‌కే కాదు దేశానికే గర్వకారణమని చెప్పారు. చినజీయర్ స్వామి వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకోసం మహాద్భు త కృషి చేశారని కొనియాడారు. జీయర్ బోధనలకు తెలంగాణ కేంద్రం కావడం గొప్ప విషయమని అన్నారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ శ్రీరామనగరం వేదికగా ప్రారంభమైన శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలకు గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి హాజరయ్యారు. 5వ తేదీన ఇక్కడికి ప్రధాని మోదీ వస్తున్న సందర్భంగా అక్కడ భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
సామాజిక సమతను కొనసాగిస్తాం
ప్రతిష్టాత్మకమైన ఈ దేవాలయం భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. కేవలం పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతతను కోరుకునే వారికి ఇది ప్రశాంత నిలయంగా మారుతుందని అన్నారు. ఆ మహామూర్తి బోధనలు వెయ్యేళ్ల తర్వాత మళ్లీ ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేళ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమన్నారు.
అనతి కాలంలోనే ఈ ప్రాంతం ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందు తుందన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సంస్కృతీ సంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను కొనసాగిస్తామని చెప్పారు. చినజీయర్ స్వామి బోధనలను ప్రతి ఒక్కరు అనుసరించాలని సూచించారు. ఈ మహా ఉత్సవానికి హాజరయ్యే భక్తులకు తమ కుటుంబం తరఫున పండ్లు, ఫలాల ప్రసాదాన్ని అందజేస్తామని తెలిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షు ఉన్నారు.
కుటీరానికి ఆహ్వానించి..ఆశీర్వదించి
శ్రీరామనగరం సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతులను త్రిదండి చినజీయర్ స్వామి తన కుటీరానికి ఆహ్వానించారు. ఆశీర్వచనాలు అందజేశారు. ప్రస్తుతం ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రికి చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సక్రమంగా చూసుకుంటోందని తెలిపారు. సమారోహానికి వస్తున్న భక్తులకు స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీరు అందుతోందని చెప్పారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షురావును చినజీయర్ స్వామి అభినందించారు. ‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మిక భక్తి ప్రపత్తులను పుణికి పుచ్చుకున్నావు..’ అంటూ ప్రశంసించారు.
సీఎం పర్యటనలో ముఖ్యాంశాలివే
– సాయంత్రం 4 గంటలకు సీఎం శ్రీరామనగరం చేరుకున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించారు.
– భద్రవేదికపై ఆశీనులైన భగవత్‌రామానుజుల వారి విరాట్ సమతామూర్తి విగ్రహాన్ని సందర్శించారు. చిన జీయర్‌తో కలిసి ప్రదక్షిణలు చేశారు.
– అగ్ని ప్రతిష్ట, హోమాలు ప్రారంభమైన నేపథ్యంలో అగ్ని ప్రతిష్ట ప్రారంభ సూచికగా 1,260 కేజీల బరువుతో, నాలుగున్నర అడుగుల ఎత్తుతో ఏర్పాటు చేసిన మహాగంటను మోగించి గంటానాదం చేశారు.
– రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరించబోయే బంగారు ప్రతిమ ప్రతిష్ట స్థలాన్ని పరిశీలించి, రామానుజ జీవిత చరిత్రను తెలియజేసే పెయింటింగ్స్‌ను తిలకించారు. 108 దివ్య దేశాల సమూహం, వాటి ప్రాముఖ్యతను సీఎంకు చినజీయర్ వివరించారు.
– రామానుజుల జీవిత చరిత్రను తెలియజేస్తూ రూపొందించిన లఘుచిత్రాన్ని సీఎం వీక్షించారు.
– మైహోం అధినేత జూపూడి రామేశ్వరరావు, ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు, ఏపీ ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తదితరులు కూడా సీఎం వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment