సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పర్యటన కోసం శనివారం హైదరాబాద్‌కు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించే, వీడ్కోలు చెప్పే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ బాధ్యతలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు అప్పగిస్తున్నట్టు సీఎం కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని మోదీకి.. గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం కేసీఆర్ తదితరులు స్వాగతం పలకాల్సి ఉంది.
ప్రధాని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివార్లలోని ఇక్రిశాట్ (అంతర్జాతీయ మెట్ట పంటల పరిశోధన కేంద్రం)కు చేరుకుని సంస్థ స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. స్వాగత కార్యక్రమానికి సీఎం దూరంగా ఉండటంతో ప్రధాని వెంట గవర్నర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఇక్రిశాట్‌కు వెళ్లే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక్రిశాట్ వేడుకల తర్వాత ప్రధాని మోదీ ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల ప్రాంగణానికి వస్తారు. ఇక్కడ కార్యక్రమాలు పూర్తయ్యాక శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లి ఢిల్లీకి బయలుదేరుతారు. ఇందులో స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలతోపాటు ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు కూడా కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ముచ్చింతల్‌లో జరిగే రామానుజుల సహస్రాబ్ది వేడుకల్లో మాత్రం ప్రధానితో కలిసి పాల్గొంటారు.
ఎంపీ కుమారుడి వివాహానికి హాజరై..
శనివారం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కుమారుడి వివాహం శంషాబాద్ విమానాశ్రయం సమీపంలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆ వివాహ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముచ్చింతల్‌కు రానున్నారు. అయితే ప్రధాని స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలు, పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ప్రభుత్వ సీఎస్‌ను సీఎం ఆదేశించినట్టు తెలిసింది.
కేంద్రంపై పోరు నేపథ్యంలో..
వరి ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంపై ప్రత్యక్ష మొదలుపెట్టిన సీఎం కేసీఆర్.. ఇటీవల కేంద్రం, బీజేపీ తీరుపై వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రధాని మోదీపైనా మండిపడుతున్నారు. తాజాగా నాలుగు రోజుల క్రితం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి నిధులు కేటాయించకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతూ.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ వైఫల్యాలను ఆయన ఎదురుగానే ఎత్తిచూపుతానని, తాను ఎవరికీ భయపడే రకం కాదనీ ప్రకటించారు. ఇలా ఘాటుగా విమర్శలు చేస్తూనే.. రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానికి ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలుకుతానని ప్రకటించారు.
కానీ శనివారం ప్రధాని పర్యటనలో స్వాగత బాధ్యతలను మంత్రి తలసానికి అప్పగించారు. మరోవైపు.. గవర్నర్ నివాసం రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు సీఎం కేసీఆర్ సహా మంత్రులెవరూ హాజరుకాకపోవడంతో.. గవర్నర్‌తో విభేదాలు ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాని స్వాగత, వీడ్కోలు కార్యక్రమాలకు సీఎం దూరంగా ఉండనుండటం, అదే సమయంలో రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో సుమారు మూడు గంటల పాటు వేదికను పంచుకోబోవడం ఆసక్తిగా మారాయి.
దాదాపు ఆరేళ్ల తర్వాత..
ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ ఒకే వేదిక పంచుకుని దాదాపు ఆరేళ్లు అవుతోంది. చివరిసారిగా 2016లో గజ్వేల్‌లో మిషన్ భగీరథ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇరువురూ పాల్గొన్నారు. కేంద్రంలో ప్రధానిగా మోదీ, రాష్ట్రంలో సీఎంగా కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక.. 2020 నవంబర్‌లో మోదీ హైదరాబాద్‌కు వచ్చారు. కానీ కరోనా వ్యాప్తి, ఇతర పరిస్థితుల నేపథ్యంలో.. గవర్నర్‌గానీ, సీఎంగానీ ఎవరూ రావాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయం నుంచి ప్రత్యేక సమాచారం పంపించారు. హాకీంపేట ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో విమా నం దిగిన మోదీ.. నేరుగా భారత్ బయోటెక్ పరిశ్రమకు వెళ్లారు. కోవిడ్ వ్యాక్సిన్ల తయారీకి సంబంధించి శాస్త్రవేత్తలతో మాట్లాడి అట్నుంచే తిరిగి వెళ్లిపోయారు.
మోదీ షెడ్యూల్ ఇదీ..
► ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2:10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడినుంచి నేరుగా హెలికాప్టర్‌లో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని ఇక్రిశాట్‌కు వెళతారు. సాయంత్రం 4:15 వరకు స్వర్ణోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రసంగిస్తారు. ఇక్రిశాట్ నూతన లోగోను ఆవిష్కరిస్తారు. తర్వాత శనగ వంగడాల క్షేత్రాన్ని పరిశీలిస్తారు.
► సాయంత్రం 5 గంటలకు ముచ్చింతల్‌లోని శ్రీరామనగరానికి చేరుకుంటారు. కొంతసేపు విశ్రాంతి తీసుకున్నాక.. యాగశాలలో పూర్ణాహుతి, విశ్వక్సేన ఇష్టి హోమంలో పాల్గొంటారు. తర్వాత దివ్యక్షేత్రాలను, రామానుజుల బంగారు విగ్రహం ప్రతిష్టాపన స్థలాన్ని పరిశీలిస్తారు. సాయంత్రం 6.15 గంటల నుంచి రామానుజుల భారీ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేసి, ఆవిష్కరిస్తారు. సుమారు 7 గంటల సమయంలో ప్రసంగం చేస్తారు. అనంతరం రుత్విక్కుల నుంచి వేదాశీర్వచనం, చినజీయర్ స్వామి నుంచి మహా ప్రసాదాన్ని అందుకుంటారు. రాత్రి 8:25 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
Comments
Please login to add a commentAdd a comment