రామానుజాచార్యుల విగ్రహావిష్కరణ సభ మరో రకంగానూ ప్రాధాన్యం సంతరించుకుంది. మోదీతో కేసీఆర్ వేదిక పంచుకోకపోవడం కొత్త రాజకీయాలకు తెరలేపిందా? బీజేపీ మీద నిరసన తెలపడానికి దీన్నొక ఆయుధంగా చేసుకున్నారా, నిత్యం విమర్శిస్తూ మళ్లీ ప్రధాని వెంట వెళ్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయని అనుకున్నారా... వీటికంటే కూడా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటునకు సన్నద్ధం అవుతున్నారా అన్నదే మరింత రసవత్తరంగా ఉంది. తద్వారా బీజేపీకి ప్రత్యామ్నాయంగా కూటమిని కట్టడమూ, వ్యూహచతురుడిగా దానికి సారథ్యం వహించడమూ, ఇంకా కలిసొస్తే మోదీని ఢీకొట్టగలిగే నేత తానేనన్న సంకేతాలు దేశవ్యాప్తంగా పంపడమూ... ఇంత కథ ఉంది. ఈ కొత్త రాజకీయ చక్రం మున్ముందు ఎలా తిరుగుతుందన్నది ఎదురుచూడదగిన పరిణామం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమానికి గైర్హాజరవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొద్ది రోజుల క్రితం మీడియా సమా వేశంలో మాట్లాడుతూ, తాను తప్పక ప్రధాని మోదీతో రామాను జాచార్యుల విగ్రహావిష్కరణ సభలో వేదిక పంచుకుంటానని చెప్పారు. ఆ తర్వాత ఏం జరిగిందో గానీ ఆయన మోదీతో పాటు ఆ కార్యక్రమంలో లేరు. కేసీఆర్‌కు జ్వరం వచ్చిందని ముఖ్యమంత్రి కార్యాలయం వివరణ ఇచ్చినా, దానిని రాజకీయ వర్గాలు అంతగా విశ్వసించడం లేదు. అంతకు ముందురోజే కేసీఆర్ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి ఆశ్రమానికి వెళ్లి, విగ్రహ ఏర్పాటు తదితర విశేషాలను పరిశీలించి వచ్చారు. ప్రధాని వెళ్లిపోయిన మరుసటి రోజు యాదాద్రిపై సమీక్ష చేశారు. అపర హిందూ భక్తుడిగా తనను తాను అభివర్ణించుకునే కేసీఆర్ ఇంత పెద్ద కార్యక్రమానికి, అందులోనూ ప్రధాని పాల్గొన్న సభకు రాకుండా ఉంటారని అను కోలేదు. ఇందులో వ్యక్తిగత విషయాలు ఉన్నాయా, రాజకీయ కోణాలు ఉన్నాయా అన్న చర్చ సహజంగానే ముందుకు వస్తుంది.
గతంలో ప్రధాని అపాయింట్‌మెంట్ కోసం రోజుల తరబడి వేచి ఉండవలసిన సందర్భాలు ఆయనకు చీకాకు కలిగించి ఉండవచ్చు. అదే సమయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్‌ఎస్ నేతలంతా బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మోదీతో వేదిక పంచుకోవడానికి కేసీఆర్‌కు మొహం చెల్లలేదా అన్న ప్రశ్న కూడా వస్తుంది. నిజంగానే ఆయనకు జ్వరం వచ్చివుంటే, దాన్ని తప్పు పట్టజాలం. ప్రధాని ఒక రాష్ట్రానికి వస్తున్నప్పుడు ఆయనకు స్వాగతం పలకడం, ఆ తర్వాత ఆయనతో కలిసి కార్యక్రమాలలో పాల్గొనడం ప్రోటోకాల్‌గానే కాకుండా, ప్రివిలేజ్‌గా కూడా పరిగణి స్తారు. కానీ నిత్యం బీజేపీని విమర్శిస్తూ, తీరా మోదీ వెంట వెళ్తే తప్పుడు సంకేతాలు వెళతాయని ఆయన అనుమానించి ఉండవచ్చు. దీనిని నిరసన తెలపడానికి ఒక అవకాశంగా భావించి ఉండవచ్చు.
మరో రాజకీయ కోణం కూడా ఉందన్న ప్రచారం ఉంది. కేసీఆర్ వచ్చే రెండేళ్లలో తాను ఊహించిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నద్ధం అవ్వవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల అధినేతలతో రాజకీయ సంబంధాలు పెట్టుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తదితరులతో సంప్రదింపులు జరిపారు. అవి కార్యాచరణలోకి ఇప్పటికిప్పుడు వస్తాయని అనుకోలేకపోయినప్పటికీ, ఆ దిశగా పయనించడానికి కేసీఆర్ సిద్ధమవుతున్నారు.
వేరొక ప్రచారం కూడా లేకపోలేదు. ప్రాంతీయ పార్టీల నేతలలో కేసీఆర్‌కు ఉన్న వ్యూహ రచనా పటిమ ఇతరులకు ఆ స్థాయిలో లేదనీ, అలాగే మూడు, నాలుగు భాషలలో ప్రావీణ్యం కలిగిన నేతగా గుర్తింపు పొందారనీ, వీటి ఆధారంగా ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పడితే దానికి తాను సార«థ్యం వహించాలని ఆశిస్తుండవచ్చనీ అంటున్నారు. అవసరమైతే, అవకాశం వస్తే మోదీకి తాను ప్రత్యా మ్నాయంగా కనిపించాలన్న ఆలోచన చేస్తుండవచ్చని అంటున్నారు. కొన్నేళ్ల క్రితమే టీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్‌ను భావి ప్రధాని అని చెప్పేవారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వస్తే కేసీఆర్ చక్రం తిప్పడం ఆరంభం కావచ్చని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నాయకత్వ లేమితో ఇబ్బంది పడుతోందనీ, బీజేపీని అడ్డుకోవడానికి ప్రాంతీయ పార్టీల కూటమికి ఆ పార్టీ కూడా మద్దతు ఇవ్వక తప్పని స్థితి వస్తుందనీ కొందరి అంచనా. అదే జరిగితే 1996లో యునైటెడ్ ఫ్రంట్ మాదిరిగా ఈసారి ఫెడరల్ ఫ్రంట్ ప్రయోగం జరగవచ్చనీ, అప్పట్లో దేవెగౌడ, ఐకె గుజ్రాల్‌లకు ప్రధాని అవకాశం వచ్చినట్లు ప్రాంతీయ పార్టీల నేతలలో ఎవరో ఒకరికి ఆ ఛాన్స్ తగలవచ్చనీ, ఆ రేసులో ముందంజలో ఉండటానికి కేసీఆర్ వ్యూహరచన చేస్తుండవచ్చనీ ఒక నేత అభిప్రాయపడ్డారు.
వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మోదీతో పాటు వేదిక పంచు కుని ఉండకపోవచ్చు. తద్వారా మోదీని తాను ఢీకొట్టగలనన్న అభిప్రా యాన్ని దేశవ్యాప్తంగా పంపడానికి దీనిని వాడుకుని ఉండవచ్చు. ఇలా ప్రధాని కార్యక్రమానికి హాజరు కాని ముఖ్యమంత్రులలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఉన్నారు. ఆమె ప్రధాని రేసులో లేకపోతే ఆ అవకాశం కేసీఆర్‌కు రావచ్చని కొందరు భావిస్తు న్నారు. మరో సీనియర్ నేత, ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తన రాష్ట్రం వదలి రాకపోవచ్చు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వ్యూహరచనలో భాగంగానే కేసీఆర్ ఈ ప్లాన్ అమలు చేసి ఉంటారని ప్రచారం జరుగుతోంది.
కాగా కేసీఆర్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అన్న ప్రశ్న కూడా వస్తుంది. మోదీని కేసీఆర్ అవమానించారని బీజేపీ నేతలు వ్యాఖ్యా నిస్తున్నారు. మోదీని చూస్తే కేసీఆర్‌కు చలి జ్వరమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఇందులో కొంత రిస్కు కూడా ఉంటుంది. ఒకవేళ యూపీలో బీజేపీ గెలిచి, సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీయే తిరిగి అధికారం లోకి వస్తే, అప్పుడు టీఆర్‌ఎస్‌కు కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు. కాకపోతే ఈలోగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయి. ఈ ఎన్నికలలో టీఆర్‌ఎస్ తిరిగి విజయం సాధిస్తే కేసీఆర్ దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తారు. అయినా కేంద్రంలో తమకు వ్యతిరేకమైన బీజేపీ అధికారంలోకి వస్తే, కేంద్ర, రాష్ట్రాల మధ్య, అలాగే మోదీ కేసీఆర్ మధ్య వ్యక్తిగత సంబంధాలపై కూడా ప్రభావం చూపవచ్చు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి రాకపోతే మాత్రం కేసీఆర్ కొత్త రాజకీయం ఆరంభించవచ్చు.
మరో మాట కూడా చెబుతున్నారు. కేసీఆర్‌కు ఎలాంటి రాజకీయ వాతావరణాన్ని అయినా ఎదుర్కునే తెలివితేటలు ఉన్నాయనీ, దానిని తనకు అనుకూలంగా మార్చుకోగల సత్తా, నేర్పు ఉన్న నేత అనీ, అందువల్ల మోదీ మళ్లీ ప్రధాని అయినా, ఆయనతో సఖ్యతగా ఉండగల చతురత ఆయనకు ఉందనీ మరికొందరు విశ్లేషిస్తున్నారు. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తానే తెచ్చినట్లు ప్రజలలో విశ్వాసం పొందిన నేతగా కేసీఆర్ గుర్తింపు పొందడం ఇందుకు ఒక ఉదాహ రణగా చెబుతున్నారు. ఒకటి మాత్రం వాస్తవం. ఏదైనా రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రధానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలక పోవడం అంత మంచి సంప్రదాయం కాదు. గత ఎన్నికలకు ముందు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రధాని మోదీ ఏపీకి వచ్చినప్పుడు తాను స్వాగతం పలకకపోగా, కనీసం మంత్రులను కూడా పంపించలేదు.
పైగా నల్లజెండాలు, బెలూన్లు ఎగరేసి నిరసన తెలిపారు. అది మోదీకి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఆ నేపథ్యంలోనే చంద్రబాబు ఓటమి తర్వాత బీజేపీతో రాజీ కుదుర్చుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నా, ఇప్పటి వరకూ సఫలం కాలేకపోయారు. టీడీపీ ఎంపీలను బీజేపీలోకి పంపినా ప్రయోజనం కలగలేదు. రాజకీయాలలో ఇలాంటి సీరియస్ ఘట్టాలు కూడా ఉంటాయి. వాటిని కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడే కేసీఆర్ ఈ వ్యూహంలోకి వెళ్లి ఉండవచ్చు. కానీ కేసీఆర్ ఒక జాగ్రత్త తీసు కున్నారు. ఎక్కడా ప్రోటోకాల్ మిస్ కాకుండా ప్రధానికి తన మంత్రు లతో స్వాగతం చెప్పించారు. నిరసన జెండాలు ఎగుర వేయడం వంటి పిచ్చి పనులు చేయలేదు. అది కొంతలో కొంత తెలివైన వ్యవహారమే! రాష్ట్ర బీజేపీ నేతలతో టీఆర్‌ఎస్ నేతలు ట్విట్టర్‌లో వాదప్రతివాదాలు చేస్తూ సందడిగా ఉన్నప్పటికీ కేసీఆర్ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మోదీని ఢీకొడుతున్నానన్న సంకేతం ఇచ్చారు. ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా పండుతాయో భవిష్యత్తులో చూడాల్సిందే!
కొమ్మినేని శ్రీనివాసరావు, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment