తెలంగాణలో ఎన్నికల వేడి పెంచడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తనదైన శైలిలో యత్నించారు. హైదరాబాద్‌లో జరిగిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని బహిరంగ సభలో ఆయన ప్రసంగించిన తీరు చూస్తే, తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ఆయన కసరత్తు గట్టిగానే చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇటీవలికాలంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్ ) కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలన్నిటికీ ఒక ఉపన్యాసం ద్వారా సమాధానం ఇచ్చారని అనుకోవచ్చు.
బీఆర్‌ఎస్‌ను ఇరుకునపెట్టే యత్నం
ప్రత్యేకించి మంత్రి కేటీఆర్ ఆయా అంశాలపై కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందని, ఇది భారతదేశంలో భాగం కాదా అని ఆయన కాని ,ఇతర బీఆర్‌ఎస్ నేతలు కాని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఉన్న ఇబ్బందులను కూడా కేటీఆర్ , ఇతర మంత్రులు తెలివిగా కేంద్రంపై నెట్టివేస్తుంటే, ఇప్పుడు ప్రధాన మంత్రి వచ్చి మొత్తం రాష్ట్రంపై తోసివెళ్లారు. కేంద్రం తెలంగాణ కోసం పలు పధకాలు అమలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని మోదీ ఆరోపించారు.
విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇలాంటి రాజకీయ ఘర్షణ తప్పడం లేదు. అందులోను మంచి మాటకారిగా పేరొందిన మోదీ ఎన్నికల సమయంలో పదునైన వ్యాఖ్యలతో విపక్షాలను ఇరుకున పెడుతుంటారు. తెలంగాణలోనూ అలాగే చేశారు. ఆయన పెద్దగా ఆవేశపడకుండా సావధానంగా ప్రసంగించినట్లు కనిపించినా, ముఖ్యమంత్రి కేసీఆర్ పైన , ఆయన కుటుంబంపైన పరోక్షంగా తీవ్ర వ్యాఖ్యలే చేశారు. కుటుంబ పాలన, అవినీతి వేర్వేరు కాదని మోదీ వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్య ద్వారా అటు కాంగ్రెస్‌ను, ఇటు బీఆర్‌ఎస్ ను ఆయన ఇరుకున పెట్టడానికి యత్నించారు.తాము అవినీతిపై పోరాడుతుంటే, విపక్షాలు తమ అవినీతిని ప్రశ్నించవద్దని అంటున్నాయని, దీనిపై ఏకంగా సుప్రింకోర్టుకు కూడా వెళ్లాయని, అక్కడ కూడా వీరికి చుక్కెదురైందని ఆయన ఎద్దేవ చేశారు. ఎక్కడా కేసీఆర్ పేరు ప్రస్తావించలేదు. కేసీఆర్ కూడా కావాలనే మోదీ కార్యక్రమానికి హాజరు కాలేదు. గత కొన్ని నెలలుగా వీరి మద్య గ్యాప్ పెరిగిన నేపధ్యంలో కేసీఆర్ ప్రధాని తెలంగాణకు వచ్చినా, ఆయనను కలుసుకోవడానికి ఇష్టపడడం లేదు. పైగా ఇప్పుడు జాతీయ పార్టీని స్థాపించి బీజేపీకి పోటీ ఇవ్వాలని వ్యూహరచన చేస్తున్నారు.
విపక్షాలను ఒక తాటిపైకి తేవాలని కూడా ఆయన చూస్తున్నారు. దానికి ముందుగా తన శక్తిని నిరూపించుకునే పనిలో పడ్డారు.ఈ బాద్యత అప్పగిస్తే విపక్షాల ఎన్నికల ఖర్చు భరించడానికిసిద్దమని ఆయన అన్నట్లు ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి చెప్పడం సంచలనం అయింది. అందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది చర్చనీయాంశం. బీఆర్‌ఎస్ నేతలు మాత్రం దానిని సీరియస్ గా తీసుకోలేదు.
రాష్ట్రంలో బీజేపీ గెలుపే లక్ష్యంగా..
జాతీయ రాజకీయాలకు ముందుగా వచ్చే శాసనసభ ఎన్నికలలో మరోసారి గెలవడానికి కేసీఆర్ అవసరమైన సన్నాహాలు చేసుకుంటున్నారు. ఎలాగైనా కేసీఆర్‌ను ఓడించి బీజేపీని అధికారంలోకి తీసుకు రావడానికి ఆ పార్టీ నేతలు విశ్వయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ప్రధాని మోదీ కూడా తెలంగాణపై దృష్టి పెట్టారు. తొలుత కేంద్రం తెలంగాణకు చేసిన వివిధ అబివృద్ది పనులను ప్రస్తావించారు. సుమారు 11 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
వాటన్నిటిని సభలో వివరించడం ద్వారా తెలంగాణకు కేంద్రం మేలు చేస్తున్నదన్న భావన కల్పించడానికి ఆయన కృషి చేశారు. ఆ తర్వాత తాము చేస్తున్నవాటికి రాష్ట్రం సహకరించడం లేదని ఆరోపించారు. తదుపరి రాజకీయంగా ప్రసంగిస్తూ కుటుంబ పాలన ,అవినీతి అంశాలను నొక్కి చెప్పారు.తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఆయన ఆ రకమైన ఆరోపణలు గుప్పించారు. కాకపోతే ఎక్కడా ఎవరి పేరు చెప్పలేదు.ప్రజలకు మాత్రం అవినీతికి సంబంధించి ప్రశ్నలు వేసి వారి నుంచి సమాధానాలు రాబట్టారు.
ఎన్నికల కోసమే ఆయుధంగా వాడుతున్నారా?
మోదీ నిజంగానే అవినీతిపై పోరాడుతున్నారా? లేక ఎన్నికలలో ఒక ఆయుధంగా మాత్రమే వాడుతున్నారా? అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే బీజేపీ నేతలు తెలంగాణలో ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తుంటారు. వాటిలో ఒక్కదానికి కూడా సరైన ఆధారాలు చూపించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టలేకపోయారు. పైగా పదో పరీక్ష ప్రశ్నాపత్రాల లీకేజీలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేయడంతో ఆ పార్టీకి కొంత చికాకు అయింది. ఇందులో తెలంగాణ పోలీసులు కావాలని కేసులు పెట్టారని బీజేపీ నేతలు ఆరోపించవచ్చు. కాని కేసు అయితే అలాగే ఉంది కదా! డిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కుమార్తె కవితకు నోటీసులు ఇచ్చి దర్యాప్తు జరిపిన తీరును కూడా బీఆర్‌ఎస్ వివాదాస్పదం చేయగలిగింది. కేంద్రం ఇదంతా కక్షతో చేస్తోందని ఆరోపించగలిగింది.
ఇక్కడే కాదు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మోదీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు పోలవరం ఏటీఎమ్ మాదిరి ఉపయోగపడిందని సంచలన అభియోగం మోపారు. ఎన్నికల తర్వాత మోదీ ఆ ఊసే మర్చిపోయారు. మరో విషయం కూడా చెప్పాలి. చంద్రబాబు వ్యక్తిగత సహాయకుడి ఇంటిపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడి చేసి రెండువేల కోట్ల రూపాయల విలువైన అవకతవకలు జరిగాయని ప్రకటించారు. ఆ కేసు ఏమైందో అతీగతీ తెలియకుండా పోయింది. మరి అలాంటప్పుడు అవినీతి అన్న అంశాన్ని మోదీ రాజకీయంగా ఎన్నికల కోసమే వాడుకుంటున్నారన్న అభిప్రాయం ఏర్పడడంలో తప్పేమి ఉంటుంది?ప్రధాని మోదీ కిందటిసారి తెలంగాణలో పర్యటించినప్పుడు కేవలం అభివృద్దికి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రస్తావించారు. ఈసారి మాత్రం పేరు చెప్పకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆరోపణాస్త్రాలు సందించారు.
ఎన్నికలు దగ్గరపడే కొద్దీ మోదీ మరింత ఘాటు పెంచుతారని ఊహించుకోవచ్చు.ఇంతకాలం రాష్ట్ర నేతలు చేస్తున్న విమర్శలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ప్రధానిగా మోదీ చేసిన ఆరోపణలు మరో ఎత్తు అని చెప్పాలి. దీనివల్ల తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ ఎంత పెరుగుతుంది?అది బీఆర్‌ఎస్ ఓట్లలో చీలిక తెస్తుందా? కాంగ్రెస్ కు నష్టం చేస్తుందా? కాంగ్రెస్,బీజేపీలు సమాన స్థాయికి వస్తే, ఓట్ల చీలికతో బీఆర్‌ఎస్ గెలుపు సులువు అవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు ప్రస్తుతం ప్రజలలో ఉన్నాయి. ఒకరకమైన గందరగోళ రాజకీయ వాతావరణం తెలంగాణలో నెలకొంది. అందులో మోదీ తన వంతు పాత్ర పోషించి వెళ్లిపోయారు.డిసెంబర్ లో ఎన్నికలు జరిగే లోపు మరిన్ని సభలలో ఆయన పాల్గొని బీఆర్‌ఎస్ పై దూకుడు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి.తద్వారా తెలంగాణ ప్రజలను ఎంతవరకు తన ఉపన్యాస బలంతో మోదీ ఆకర్షించగలుగుతారన్నదానిపై అవగాహనకు రావడానికి మరికొంత సమయం పడుతుందనే చెప్పాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment