కంటోన్మెంట్‌ విలీనంపై.. తేలేదెప్పుడు? | Secunderabad Cantonment Board and GHMC Merger Issues | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ విలీనంపై.. తేలేదెప్పుడు?

Published Tue, Aug 16 2022 2:24 AM | Last Updated on Tue, Aug 16 2022 10:03 AM

Secunderabad Cantonment Board and GHMC Merger Issues - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  ఆర్మీ నియంత్రణలో ఉన్న సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌లోని జనావాసాల ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే అంశం ముందుకు కదలడం లేదు. ఏళ్లుగా ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ వచ్చిన కేంద్ర రక్షణ శాఖ.. ఇటీవల దీనికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినా అడుగు ముందు కుపడట్లేదు. కంటోన్మెంట్‌ వల్ల ఎన్నో ఇబ్బందు లు వస్తున్నాయని, ఆ ప్రాంతాలను విలీనం చే యాలని చాలాసార్లు కోరిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం.. ఇప్పుడు దీనిపై స్పందించడం లేదన్న వి మర్శలున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే తమ సమస్యలు తప్పుతాయని కంటోన్మెంట్‌ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. 

చాలా ఏళ్లుగా డిమాండ్‌ 
నిజాం పాలన సమయంలో బ్రిటిష్‌ సైనిక స్థావ రంగా ఉన్న కంటోన్మెంట్‌ ప్రాంతం.. ఆ తర్వా త కూడా రాష్ట్రంలో పూర్తి అంతర్భాగంగా మారలేదు. పాక్షికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజ మాయిషీలో ఉంటూ.. స్వయం ప్రతిపత్తి హోదాలో డీమ్డ్‌ మున్సిపాలిటీగా కొనసాగుతోంది. కంటోన్మెంట్‌ పరిధిలో ఉంటున్న ప్రజ లు పలు అంశాల్లో ఇబ్బందిపడాల్సి వచ్చింది.

ఈ క్రమంలో కంటోన్మెంట్‌లోని పౌరుల నివాస ప్రాంతాలను హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కలపాలనే ప్రతిపాదన 1999లోనే తెరపైకి వచ్చింది. దీనిపై అప్పటి సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. దానిపై స్పందించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్‌ బోర్డును సంప్రదించి తీర్మానించడం ద్వారా విలీన ప్రక్రియ చేపట్టవచ్చని సూచించింది. నాడు కంటోన్మెంట్‌ బోర్డు సభ్యులు తిరస్కరించడంతో విలీన ప్రతిపాదనకు చుక్కెదురైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కంటోన్మెంట్‌లోని జనావాస ప్రాంతాలను తమ పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ ఒత్తిడి తెచ్చింది.

రహదారులు, వంతెనల నిర్మాణం, విస్తరణకు కంటోన్మెంట్‌ బో ర్డు అడ్డుపడుతోందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మంత్రి కేటీఆర్‌ కూడా పలు సందర్భాల్లో విమర్శించారు. మరోవైపు కంటోన్మెంట్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సుమిత్‌ బోస్‌ కమిటీ.. పరిపాలనా సంస్కరణ ల కోసం పౌర నివాస ప్రాంతాలను కంటోన్మెంట్ల నుంచి వేరు చేయాలని సూచించింది.

దాన్ని పరిగణనలోకి తీసుకున్న రక్షణశాఖ.. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్లలోని జనావాసాలను సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. గత మేలో రాష్ట్రాలకు లేఖలు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.రాష్ట్రప్రభుత్వం స్పందిస్తే బోర్డు రద్ద యి పౌర నివాస ప్రాంతాలు జీహెచ్‌ఎంసీలో విలీనమవుతాయని అధికారులు అంటున్నారు. 

దేశంలోనే అతి పెద్దదిగా.. 
1798లో నిజాం నవాబు, ఈస్టిండియా కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం మేరకు.. హుస్సేన్‌ సాగర్‌కు తూర్పున ఉన్న 13 గ్రామాలను బ్రిటిషర్లకు అప్పగించారు. అందులో ఈస్టిండియా కంపెనీ సైన్యాలతో కంటోన్మెంట్‌ ఏర్పాటు చేసుకుంది. 1806లో ఆ ప్రాంతానికి సికింద్రాబాద్‌గా పేరు పెట్టారు. 1945లో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాలను వేరుచేసి సికింద్రాబాద్‌ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.

1995లో అది హైదరాబాద్‌ మున్సిపాలిటీలో విలీనమైంది. కంటోన్మెంట్‌ మాత్రం య«థాతథంగా కొనసాగుతోంది. దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్లలో 2.18 లక్షల జనాభాతో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ దేశంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. దీని పరిధిలో 400కుపైగా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డీమ్డ్‌ మున్సిపాలిటీగా ఉన్న కంటోన్మెంట్‌లో నిధులు సరిగా లేక అభివృద్ధి పనులు సరిగా జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్మీ ఆంక్షల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. 

విలీనమైతే సమస్యలు తీరుతాయి 
కంటోన్మెంట్‌లో ఇప్పటికీ బ్రిటిష్‌కాలం నాటి చట్టాల ఆధారంగానే పాలన జరుగుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మార్పులు, అభివృద్ధి జరగడం లేదు. అడుగడుగునా మిలటరీ ఆంక్షలతో సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో కంటోన్మెంట్‌ వికాస్‌ మంచ్‌ (సీవీఎం) ఏర్పాటు చేసి పోరాడుతున్నాం. కేంద్రం సానుకూలంగా స్పందించడం 
సంతోషం. ప్రజల సమస్యలు తీరనున్నాయి. 
– సంకి రవీందర్, సీవీఎం ప్రధాన కార్యదర్శి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement