6 dead in massive fire at Secunderabad's swapnalok complex; details - Sakshi
Sakshi News home page

Swapnalok Complex Fire Accident: అర్థాంతరంగా ముగిసిన ఆరు జీవితాలు.. మృతుల వివరాలు ఇవే!

Published Fri, Mar 17 2023 9:21 AM | Last Updated on Fri, Mar 17 2023 4:22 PM

Secunderabad Swapnalok Complex Fire Accident, Dead Person Details - Sakshi

సాక్షి సికింద్రాబాద్‌: ప్రమాదాలు జరిగినపుడు హడావుడి చేసే ప్రజాప్రతినిధులు.. అధికారులు తూతూమంత్రంగా చేపట్టే చర్యలు.. వెరసి అభాగ్యుల ఉసురు తీస్తోంది. గత జనవరిలో డెక్కన్‌ మాల్‌ అగ్ని ప్రమాదాన్ని మరువకముందే సికింద్రాబాద్‌ స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో అలాంటి ఘటనే పునరావృతమైంది. భారీ అగ్ని ప్రమాదం బతుకు దెరువు కోసం ఆ కాంప్లెక్స్‌లో పనిచేస్తున్న ఆరుగురి ప్రాణాలను అనంతవాయువుల్లో కలిపింది. నిండా పాతికేళ్లు కూడా లేని వారి జీవితాలను అర్థాంతరంగా ముగించింది. పని కోసం పట్నం వెళ్లిన తన బిడ్డలు ఎప్పుడు వస్తారా? అని ఎదురుచూసిన తల్లిదండ్రులకు తీరని శోకం మిగిల్చింది.

సికింద్రాబాద్‌లోని ప్రముఖ వ్యాపార సముదాయం స్వప్నలోక్‌ కాంప్లెక్స్‌లో గురువారం సంభవించిన భారీ అగ్ని ప్రమాదం ఆరుగురిని పొట్టనపెట్టుకుంది. అతికష్టమ్మీద గ్రిల్స్‌ తొలగించి అయిదో అంతస్తులోకి వెళ్లిన అగ్నిమాపక శాఖ అధికారులు అపస్మారక స్థితిలో ఉన్న ఆ అయిదుగురిని బయటికి తీసుకువచ్చారు. వీరికి సీపీఆర్‌ చేసి ఆస్పత్రికి తరలించారు. అయితే వీరు అప్పటికే మృతి చెందినట్లు గాంధీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అదే సమయంలో మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రశాంత్‌ సైతం కన్నుమూశాడు. ఈ ఆరుగురికి కాలిన గాయాలు లేవు. ఊపిరితిత్తుల్లో పొగ చేరడంతోనే చనిపోయారని వైద్యులు తెలిపారు.

మృతుల వివరాలు ఇవే..
►సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో  గత రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం సురేష్ నగర్ గ్రామానికి  చెందిన కె.ప్రమీల (22) మృతిచెందడంతో సురేష్ నగర్ గ్రామంలో విషాదచయలు అలుముకుంది. ప్రమీల ఈ కామర్స్‌ సంస్థలో పని చేస్తుంది.

► మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇంటికన్నె గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్ (23) అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

► వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రానికి చెందిన బానోత్ శ్రావణి(22) మృతి చెందింది. ఆమె ఈ కామర్స్‌ సంస్థలో పని చేస్తుంది.  కూతురు మరణ వార్త విని ఆ తల్లిందండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. శ్రావణి తల్లిదండ్రులు కూలీ పనులు చేస్తుంటారు.

► వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మర్రిపల్లి గ్రామానికి చెందిన వంగ వెన్నెల(22) మృతి చెందింది. స్వప్నలోక్‌ కాంప్లెక్స్ లోని ఐదవ అంతస్తులో ఉన్న కామర్స్ కాల్ సెంటర్లో వెన్నెల ఉద్యోగం చేస్తుంది.

►అగ్ని ప్రమాదంలో ఉప్పుల శివ (22) ఊపిరి ఆడక మృతి చెందాడు. చంద్రయ్యపల్లి గ్రామానికి చెందిన ఉప్పుల రాజు, రజిత కుమారుడు శివ 2 సంవత్సరాల నుంచి సికింద్రాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి రాజు వ్యవసాయం,తాపీ మేస్త్రి గా పనిచేసుకుంటున్నాడు.

►ఖమ్మం జిల్లా  నేలకొండపల్లి మండలం సుర్థేపల్లి గ్రామనికి చెందిన రామారావు కుమార్తె త్రివేణి (22) అగ్ని ప్రమాదంలో మృతి చెందింది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement