సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది ఫిబ్రవరి 4న సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్ శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కోటగిరి నాగరాజు (34) మరణం.. జూన్ 6న నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గాం చెరువులో అక్కాచెల్లెళ్లు, సమీప బంధువైన ఎల్మె స్మిత (17), ఎల్మె వైశాలి (14), లహుబందే అంజలి (16) మృతి.. సెప్టెంబర్ 5న వికారాబాద్ జిల్లా పరిగి సమీపంలోని లక్నాపూర్ ప్రాజెక్ట్ అలుగు వద్ద వీరరాజు (25), మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం దుందుబీవాగు పరిధిలోని చెక్‌డ్యాం వద్ద కుందేళ్ల శివప్రసాద్ (23) అసువులుబాయడం..
ఇదేనెలలో సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలోని మోయతుమ్మెద వాగులో మామ అల్లుళ్లు మ్యాదరి రాజు(27), చెంచల రుషి (11) తిరిగిరాని లోకాలకు వెళ్లడం.. ఇలా సెల్ఫీలు ‘కిల్ఫీ’లుగా మారుతున్నాయి. విహారయాత్రలను విషాదంతో నింపిన ఈ ఏడాది ఉదంతాలివి. స్టేటస్‌లు, ప్రొఫైల్ పిక్ తదితరాలకు సెల్ఫీల కోసం ప్రత్యేక సెల్‌ఫోన్లు, స్టిక్స్‌తో పాటు కోర్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ నాణానికి ఒకవైపు మాత్రమే. మరోవైపు అత్యంత దారుణమైన అంశాలూ దాగి ఉంటున్నాయి. ఈ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నాల్లో అనేక మంది ప్రమాదాల బారినపడి అశువులుబాస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరుగురు సెల్పీ మరణాలకు లోనుకాగా... వీటిలో రెండు మరణాలు ఇటీవల ఒక్కరోజే జరిగాయి.
యువతలో ఈ ధోరణి ఎక్కువ...
సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన చాలాకాలం తర్వాత ఈ సెల్ఫీల యుగం ప్రారంభమైంది. ప్రధానంగా ఫ్రంట్ కెమెరా సౌకర్యం ఉన్న సెల్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చాక, నానాటికీ వాటి రెజుల్యూషన్ పెరగడంతో ఈ క్రేజ్ మొదలైంది. అనేక మంది ప్రముఖులు సైతం బహిరంగంగా సెల్ఫీ తీసుకుంటున్న సందర్భాలు అనేకం. సెల్ఫీ మోజులో ఉంటున్న వారిలో ఎక్కువ మంది యువతే. తామున్న ప్రాంతం, పరిస్థితులు, ప్రభావాలను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడానికి ఆరాటపడుతున్నారు. ఈ ధోరణితోనే ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు.
ఎక్కువగా సోషల్‌మీడియా కోసమే...
సోషల్ మీడియాలు ప్రాచుర్యం పొందిన తర్వాత సెల్ఫీలు దిగే అలవాటు మరింత ఎక్కువైంది. ఒకప్పుడు కేవలం తమ, తాము తీసిన ఫొటోలనే వీటిలో పెట్టేవాళ్లు. సెల్ఫీలు తీయడం ఎక్కువైన తరవాత సోషల్ మీడియాల్లో ఎవరి ప్రొఫైల్ పిక్ చూసినా, అప్‌లోడ్ చేసిన ఫొటోలు పరిశీలించినా సగానికి సగం సెల్ఫీలే కనిపిస్తున్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు, ఒకరి ప్రొఫైల్స్ చూసి ఇంకొకరు... ఇలా అంతా సెల్ఫీ బాటపడుతున్నారు. ఈ ధోరణి వారితో పాటు ఇతరులకూ ఇబ్బందికరంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
సెల్ఫీ అడిక్షన్ పెరుగుతోంది...
దినదినాభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నో ఉపయోగాలు ఉంటున్నాయి. అదే సమయంలో కొన్ని అనర్థాలు తప్పట్లేదు. అలాంటి వాటిలో సెల్ఫీ అడిక్షన్ ప్రధానమైంది. ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ 2013లో సెల్ఫీ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా పరిగణించింది. లైక్స్, కామెంట్స్ కోసం ఆరాటపడుతూ సొంతంగా తీసుకున్న చిత్రాలను సోషల్ మీడియాల్లో పోస్టు చేసే విధానం నానాటికీ పెరిగిపోతోంది. ఇందులో భాగంగా ఎదుటి వారిని ఆకర్షించే, ఆశ్చర్యపరిచే సెల్ఫీ తీసుకోవడానికి ప్రయతి్నస్తూ ప్రమాదాలు కొనితెచ్చుకుంటున్నారు. వీలున్నంత వరకు గ్రూప్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం, కౌన్సిలింగ్ పొందడం, యువతపై పెద్దల పర్యవేక్షణ ద్వారా ఈ సెల్ఫీ అడెక్షన్ నుంచి బయటపడవచ్చు.
– డాక్టర్ అనిత రాయిరాల, ప్రొఫెసర్, ఎర్రగడ్డ మానసిక వైద్యశాల
సేఫ్టీ కోసం ‘సప్త ప్రశ్నలు’...
యూత్‌కు లేటెస్ట్ క్రేజ్‌గా మారిపోయిన ఈ సెల్ఫీ ప్రమాదభరితం కాకూడదంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు. సెల్ఫీ తీసుకోవడానికి ఉపక్రమించే ప్రతి ఒక్కరూ... దానికి ముందు ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలని కోరుతున్నారు. ఎవరి వారు వేసుకోవాల్సిన ప్రశ్నలు, అవి వర్తించే ప్రాంతాల్లో కొన్ని ఇలా...
1. సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న ప్రాంతాల్లో అసలు ఫొటోగ్రఫీకి అనుమతి ఉందా?
(మ్యూజియాలు, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు, విద్యా సంబంధ వ్యవహారాల్లో)
2. సెల్ఫీ కారణంగా నాకు, నా చుట్టు పక్కల వాళ్లకు ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందా?
(జూ పార్కులు, థీమ్ పార్కులు, జనసమర్థ ప్రాంతాలు, మాల్స్, సబ్‌వేస్, విమానాశ్రయాలు, వాహనాలు నడుపుతూ)
3. సెల్ఫీ తీసుకుంటూ ఎదుటివారు చూస్తున్న వాటికి నేను అడ్డం వస్తున్నానా? ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్నానా?
(థీమ్ పార్కులు, సినిమా హాళ్లు, సందర్శనీయ ప్రాంతాలు, కొన్ని కార్యక్రమాలు)
4. సెల్ఫీ తీసుకునే ప్రయత్నాల్లో మరో వర్గానికి చెందిన వారి మనోభావాలు దెబ్బతీస్తున్నామా?
(మత సంబంధ ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు)
5. సెల్ఫీ తీసుకుంటున్న ప్రాంతంలో కంటికి కనిపించని ముప్పు పొంచి ఉందా?
(జూ పార్క్‌లు, జాతీయ పార్కులు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎత్తైన భవనాలు/ప్రాంతాలు, ఓడలు, సబ్ వేస్, కదులుతున్న వాహనాలు, రహదారులు)
6. సెల్ఫీ తీసుకోవడం సమంజసమేనా?
(ప్రమాదం జరిగిన ప్రాంతాలు, అంతిమయాత్రలు)
7. నేను తీసుకుంటున్న సెల్ఫీ
ఇతరులకు అభ్యంతరకరం అవుతుందా?
(పార్టీలు, రెస్ట్‌రూమ్స్ సమీపంలో, బీచ్‌ల్లో)
ఆ రెండు చోట్లా ‘నో సెల్ఫీ’...
యువతలో మితిమీరిపోతున్న ఈ సెల్ఫీ ఆసక్తి ప్రభుత్వ విభాగాలకూ కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఈ నేపథ్యంలోనే ‘నో పార్కింగ్’ప్రాంతాల తరహాలో ‘నో సెల్ఫీ ప్రాంతాలు అమలులోకి వస్తున్నాయి. 2015లో మహారాష్ట్ర నాసిక్‌లో జరిగిన కుంభ్‌మేళాలో సెల్ఫీ ప్రియులతో అనేక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో కుంభమే ళాను అధికారులు ‘నో సెల్ఫీ జోన్’గా ప్రకటించాల్సి వచ్చింది. వీటి వల్ల జరిగే ప్రమాదాలను నిరోధించడం కోసం ముంబై పోలీసులు ఆ నగరంలోని 29 ప్రాంతాలను ‘నో సెల్ఫీ జోన్స్’గా ప్రకటించారు. కొన్నాళ్ల క్రితం గోవా అధికార యంత్రాంగం సైతం అక్కడి 23 ప్రాంతాలను ఇలానే ప్రకటించింది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక గస్తీ సైతం ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment