సాక్షి, గుంటూరు: సెల్ఫీ దిగితే చాలా అందంగా ఉంటాం.. కానీ జీవితం అంతకంటే అందమైనదీ, అద్భుతమైనది. ఒక్క సెల్ఫీ కోసం అలాంటి జీవితాన్ని పణంగా పెట్టకూడదు. సెల్ఫీ విషాదాలు ఎన్ని జరిగినా.. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట సెల్ఫీ విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలో 20 ఏళ్ల విద్యార్థిని జీవితం సెల్ఫీకి బలైపోయింది.
సెల్ఫీలు దిగుతూ ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో చూసి ఉంటాం.. జాగ్రత్త పడండి అంటూ వచ్చే సందేశాలు చూసి ఆ ప్రమాదం మనదాకా రాదులే అనుకుంటాం. అలా అనుకొనే గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ధనలక్ష్మి నిర్లక్ష్యంగా సెల్ఫీ దిగుతూ.. ప్రమాదవశాత్తు కాల్వలో పడి ప్రాణాలు కోల్పోయింది.
నరసరావుపేటకు చెందిన 20 ఏళ్ల ధనలక్ష్మి... గుంటూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. బంధువుల ఇంట్లోని పెళ్లి కోసం తన స్వగ్రామం వెళ్లింది. అదే రోజు కండ్లకుంటలో నివసిస్తున్న తన అక్క పుట్టినరోజు వేడుకలకు వెళ్తుండగా.. మార్గం మధ్యలో నీటితో పరవళ్లు తొక్కుతున్న గుంటూరు బ్రాంచ్ కాలువ కనిపించింది. మిగతా కుటుంబ సభ్యులతో కలిసి కాల్వ వద్ద చాలాసేపు రకరకాల సెల్ఫీ ఫోటోలు దిగారు. అందరూ తిరగి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక్క ఫోటో దిగుతానంటూ ధనలక్ష్మి మళ్లీ కాల్వ వద్దకు వెళ్లింది. అంతే సెల్ఫీకి ఫోజిచ్చే క్రమంలో కాల్వలోకి జారి పడిపోయింది. అంతా తేరుకొని చూసేసరికి సెల్ ఫోన్ మాత్రమే గట్టుమీద కనిపించింది.. సెల్ ఫోన్లోని ఫోటోలు చూశాక ఆమె నీటిలో పడిపోయిందని నిర్ధారించుకున్నారు. పది నిమిషాల్లోనే ధనలక్ష్మి నీటిపై తేలుతూ కనిపించడంతో కాల్వలోకి దిగి బయటికి తీసుకొచ్చారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే చనిపోయిందని నిర్ధారించారు.
స్మార్ట్ ఫోన్లు చేతిలోకి వచ్చాక ప్రతి జ్ఞాపకాన్నీ స్మార్ట్ గా బంధించాలనీ.. అందరితో పంచుకోవాలనీ యువత ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో జరిగే ప్రమాదాలను ఉపద్రవాలనూ గుర్తించకపోవడంవల్ల కన్నవారికి కడుపుకోత మిగులుతోంది.. సెల్ఫీ అందంగానే ఉంటుంది.. కానీ జీవితం అంతకంటే అపురూపమైనది.. !
Comments
Please login to add a commentAdd a comment