సాక్షి, హైదరాబాద్: దేశ జీడీపీలో బొగ్గు, పెట్రోలియం మినహా ఇతర ఖనిజాల వాటాను 2030 నాటికి 2.5 శాతానికి చేర్చడమే లక్ష్యంగా పనిచేయాలని కేంద్ర బొగ్గు, గనులు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. హైదరాబాద్‌లో 9, 10 తేదీల్లో రెండు రోజులపాటు జరిగే రాష్ట్రాల గనుల శాఖ మంత్రుల జాతీయ సదస్సును శుక్రవారం ప్రహ్లాద్‌జోషి ప్రారంభించారు.
ఖనిజ రంగాన్ని ఆత్మనిర్భర్‌గా మార్చేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. ‘ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత ఆర్థికరంగంలో భూగర్భ వనరుల రంగం పాత్ర చాలా తక్కువ. పెట్రోలియం, బొగ్గును కూడా కలుపుకుంటే దేశ జీడీపీలో మైనింగ్ రంగం వాటా సుమారు రెండు శాతంగా ఉంది. పెట్రోలియం, బొగ్గును మినహాయిస్తే ఒక శాతానికి అటూ ఇటూగా ఉంది’అని జోషి వెల్లడించారు.
వేలం ఆదాయం రాష్ట్రాలకే ఇస్తున్నాం
‘బొగ్గు గనుల వేలం కోసం కేంద్రం ఎన్నో ప్రయాసలకోర్చినా, వచ్చిన ఆదాయం మాత్రం రాష్ట్రాలకే ఇస్తున్నాం. ఈ విధానం ద్వారా రాష్ట్రాల్లో ఉద్యోగాల కల్పనతోపాటు ఆర్థిక రంగానికి ఊతం లభిస్తోంది. నామినేషన్ పద్ధతికి స్వస్తి పలుకుతూ 2015లో తెచ్చిన సంస్కరణల ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేశాం. ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇప్పటికే వంద శాతం ఖనిజాన్వేషణ పూర్తయినా భారత్‌లో మాత్రం పది శాతంగానే ఉంది. ఖనిజాన్వేషనలో నిబంధనలు సరళీకృతం చేసి, అనుమతుల జారీలో లంచగొండితనాన్ని రూపుమాపాం’అని జోషి ప్రకటించారు.
‘లీజు పునరుద్ధరణ, బిడ్డింగ్ నిబంధనల సడలింపుతోపాటు సకాలంలో మైనింగ్ ప్రారంభించే సంస్థలకు ప్రోత్సాహకాలు ఇస్తుండటంతో ఒడిషాసహా పలు రాష్ట్రాలు మైనింగ్ ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నాయి. నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్టు (ఎన్‌మెట్)కు రూ.4,050 కోట్లు సమకూరగా, ఖనిజాన్వేషణ కోసం రాష్ట్రాలకు ఇందులో నుంచి నిధులు ఇస్తున్నాం’అని కేంద్రమంత్రి ప్రకటించారు. 2047 నాటికి మైనింగ్ రంగానికి సంబంధించి అమృత్ కాల్ లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. గనుల మంత్రిత్వ శాఖ పథకాలు, కార్యక్రమాలను వివరించే ‘ది మైనింగ్ ఎరీనా’డిజిటల్ వేదికను మంత్రి ప్రారంభించారు.
ఏపీ సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరు
గనులశాఖ మంత్రుల సదస్సుకు ఏపీ గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా 11 రాష్ట్రాల మంత్రులు హాజరయ్యారు. 19 రాష్ట్రాల అధికారులు, కేంద్రం బొగ్గు, గనులు, స్టీల్ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కర్ణాటక, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ వంటి ఏడు రాష్ట్రాలు తమ రాష్ట్రాలలో ఖనిజ లభ్యత సంభావ్యత, మైనింగ్ రంగంలోని సవాళ్లను వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment