సాక్షి, హైదరాబాద్: ఉప్పు వాడకం మితిమీరుతోంది. ఉప్పు దుష్ఫలితాల కారణంగా ప్రపంచంలో ప్రతీ నిమిషానికి ముగ్గురు చనిపోతున్నారని డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. అంటే ఏడాదికి 19 లక్షల మంది బలవుతున్నారు. ‘ఉప్పు వాడకం– దుష్పరిణామాలు–నియంత్రణ చర్యల’పై తాజా నివేదికలో ఈమేరకు వెల్లడించింది. ఒక మనిషి రోజుకు సగటున వివిధ రూపాల్లో 5 గ్రాములకంటే తక్కువ పరిమాణంలో ఉప్పు వాడాలి. అయితే ప్రపంచంలో పది గ్రాములు వాడుతుండగా, భారత్‌లో 11 గ్రాములు వాడుతున్నారు.
5 గ్రాముల్లోనే అయోడైజ్డ్ ఉప్పు కూడా ఉండాలి. ప్రపంచంలో 188 కోట్ల మంది అయోడిన్ లోపానికి గురయ్యే ప్రమాదంలో ఉన్నారు. దీనివల్ల ఎత్తుకు తగిన బరువు లేకపోవడం, గొంతు దగ్గర వాపు ఉంటాయి. గర్భిణీకి అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. ఉప్పు అధికంగా తినడం వల్ల బీపీ పెరుగుతుంది. దీనివల్ల గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటివి వస్తాయి. ఇతరత్రా జీవనశైలి వ్యాధులూ వచ్చే ప్రమాదముంది.
ఉప్పు నియంత్రణలో ప్రాథమిక దశలోనే..
ఉప్పు వాడకాన్ని నియంత్రించాలంటే నాలుగు దశల కార్యక్రమం అమలు చేయాలని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మొదటి దశ విధాన నిర్ణయం, రెండోది స్వచ్ఛందంగా ముందుకు రావడం, మూడోది తప్పనిసరిగా అమలు చేయడం, నాలుగోది ప్రతీ ఆహార పదార్థంలో ఎంత ఉప్పు ఉందో తెలియజెప్పేలా ఆదేశాలు జారీ చేయడం. ఇందులో భారత్ కేవలం మొదటి దశకే పరిమితంకాగా, ప్రపంచంలో 41 దేశాల్లో పై నాలుగు దశల కార్యక్రమం అమలవుతోంది. చికెన్, సూప్స్, స్నాక్స్, బ్రెడ్, నిల్వ ఉంచిన చికెన్‌లో ఉప్పుకు పరిమితి పెట్టిన దేశాలు అర్జెంటీనా, బల్గేరియా, ఇరాన్, జోర్డాన్, ఇరాక్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, బెల్జియం, స్పెయిన్, పాలస్తీనా వంటి 41 దేశాలున్నాయి. వంద గ్రాముల ఆహారపదార్థాలకు ఎంత ఉప్పు వాడాలో ఒక ప్రామాణికాన్ని అమలు చేస్తున్నాయి.
ఆదర్శమైన దేశాలు...
కొన్ని దేశాలు ఉప్పు వాడకాన్ని తగ్గించడంలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. దక్షిణాఫ్రికాలో సగటు ఉప్పు వినియోగాన్ని 0.85 గ్రాములు తగ్గించాలన్న చట్టాన్ని తేవడంతో ఏడాదికి 7,400 మరణాలు తగ్గాయి. దక్షిణ కొరియాలో 2010–14 మధ్యలో ప్రతీ ఆహార పదార్థంలో ఉప్పును తగ్గించే చర్యలు చేపట్టగా.. ఆ ఐదేళ్లలోనే ఉప్పు వినియోగాన్ని 24 శాతం తగ్గించారు. దీంతో బీపీ రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. థాయ్‌లాండ్‌లో ప్రపంచ సగటు కంటే ఎక్కువ వినియోగం ఉంది. దీంతో 25 శాతం మంది ప్రజలు బీపీ బారినపడ్డారు. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం 2025 నాటికి 30 శాతం ఉప్పు వినియోగాన్ని తగ్గించేందుకు వినూత్నమైన పద్ధతి తెచ్చింది. ప్రతీ పెద్ద వయస్సు వ్యక్తి 24 గంటల వ్యవధిలో ఎన్నిసార్లు మూత్రవిసర్జనకు వెళ్తున్నాడు? పరిమాణం ఎంత ఉంటుందన్న పరీక్షలు చేశారు. అలా బీపీని నియంత్రిస్తున్నారు.
హైదరాబాద్‌లో 40 శాతం మందికి బీపీ...
కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం హైదరాబాద్‌లో 40 శాతం మంది బీపీతో బాధపడుతున్నారు. జాతీయ ఆరోగ్య కుటుంబ సర్వే ప్రకారం తెలంగాణలో మహిళల్లో 26 శాతం, పురుషుల్లో 32 శాతం బీపీతో బాధపడుతున్నారు. పట్టణాల్లోనే బీపీ ఎక్కువగా ఉంది. లాన్సెట్ సర్వే ప్రకారం.. భారత్‌లో మరణాలకు ఐదు ప్రధాన కారణాల్లో బీపీ ఒకటని తేలింది. మిగిలినవి మధుమేహం, కాలుష్యం, పొగాకు వాడకం, పౌష్టికాహారం తీసుకోకపోవడం.
ఉప్పు నియంత్రణకు డబ్ల్యూహెచ్‌ఓ చేసిన సిఫార్సులివీ...
–దేశంలో సగటున ఎంత ఉప్పు వాడుతున్నారో పర్యవేక్షించాలి.
–ప్యాకేజ్డ్ ఆహారపదార్థాల్లో ఉప్పు ఎంతుందో లేబుల్ మీద రాయాలి.
–ప్రధానంగా ప్రాసెస్డ్ ఆహార పదార్థాల ప్రకటనలపై ప్రభుత్వ నియంత్రణ ఉండాలి. అలా ప్రజల్లో ఉప్పు తగ్గించేలా అనువైన వాతావరణాన్ని కల్పించాలి.
–సాధారణంగా బ్రెడ్డు, ప్రాసెస్డ్ ధాన్యాలు, ప్రాసెస్డ్ మీట్, డెయిరీ పదార్థాల్లో నిల్వ కోసం ఉప్పు వాడతారు. దీన్ని తగ్గించాలి.
87 శాతం ఆహారంలో వేసుకోవడం వల్లే...
అధిక ఉప్పు వాడకం వల్ల రక్తపోటు ఎక్కువగా వస్తుంది. ఇది గుండె, మెదడు, మూత్రపిండాల జబ్బులకు దారితీస్తుంది. జీవనశైలి జబ్బులను తగ్గించడానికి ఉప్పు వాడకాన్ని తగ్గించడమే ఉత్తమ మార్గం. దక్షిణ భారతదేశంలో ప్రాసెస్డ్ చికెన్, పౌల్ట్రీల ద్వారా ఏడు శాతం ఉప్పు, పాల పదార్థాల ద్వారా 3 శాతం, ఆహార పదార్థాల్లో, పెరుగు వంటి వాటిల్లో వేసుకోవడం వల్ల 87 శాతం ఉప్పు వాడకం జరుగుతోంది. ఉప్పును అదనంగా వేసుకోవడంలో మహిళలు ముందున్నారు. బాగా చదువుకున్న వారే ఉప్పును ఎక్కువగా వినియోగిస్తున్నారు.
–డాక్టర్ కిరణ్ మాదల, జాతీయ కార్యవర్గ సభ్యులు, అఖిల భారత ప్రభుత్వ వైద్య సంఘాల సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment