
దేశవ్యాప్తంగా గతేడాది నిర్మించిన పలు థర్మల్ ప్రాజెక్టుల యాష్ పాండ్‌లకు నిర్వహించిన వేలంలో రామగుండం ఎన్టీపీసీకి పక్కనే ఉన్న కుందనపల్లి యాష్‌కు అత్యధికంగా టన్ను బూడిదకు రూ.402 పలికింది. అందుకే ఇక్కడ గతంలో ఇటుకబట్టీ కేంద్రాల్లో రూ.5.50 చొప్పున లభించే ఇటుక అమాంతం రూ.7.50కు చేరింది. ఇది రవాణాను బట్టి మారుతుంటుంది. అదే ఢిల్లీలో టన్నుకు రూ.160, ఛత్తీస్‌గడ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టన్నుకు రూ.200లోపే పలికింది.
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఇంటిపై ఫ్లై యాష్ ఇటుక భారం పడింది. 6 నెలల్లో ఈ ఇటుక రేటు ఏకంగా రూ. 2 పెరిగింది. ఎన్టీపీసీ బూడిదకు టెండర్లు వేయడంతో రేట్లు రెండింతలయ్యాయని, దీంతో ఇటుకల రేట్లు పెరిగాయని బట్టీల వ్యాపారులు చెబుతున్నారు. 2021 సెపె్టంబర్‌కు ముందు టన్ను బూడిద ధర రూ. 23 ఉండగా ఇప్పుడు అది అమాంతం రూ. 400కు పెరిగిందని అంటున్నారు. బూడిద రేట్ల ప్రభావం ఇటుక ధరలపై పడటంతో ఇళ్ల నిర్మాణ భారం రూ. 30 వేల నుంచి రూ. లక్షల్లో పెరిగింది.
ఎన్టీపీసీ బూడిదే బంగారమాయేనా!
రాష్ట్ర నిర్మాణ రంగానికి కావాల్సిన 50% ఇటుకలు ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల నుంచే ఉత్పత్తి అవుతాయి. జిల్లాలో ఉత్పత్తి అయ్యే 50% ఇటుకల్లోనూ 60 శాతం పెద్దపల్లి జిల్లా నుంచే వస్తుంటాయి. గోదావరి తీరం, ఎన్టీపీసీ బూడిద, మట్టి నిక్షేపాలు మెండుగా ఉండటమే దీనికి కారణం. అయితే మొన్నటిదాకా ఎవరికీ పట్టని ఎన్టీపీసీ బూడిద ఇపుడు బంగారమైంది. 2021 సెపె్టంబర్ ముందు వరకు ఎన్టీపీసీ బూడిద ధర 30 టన్నుల లారీకి రూ.700గా ఉండేది. అంటే టన్నుకు రూ.23.30, క్వింటాలుకు రూ.2.3 గాను. కిలో రూ.0.023 (పైసలు)గా ఉండేది. కానీ.. టెండర్లు వేశాక అదే 30 టన్నుల లారీకి రూ.12,000 వరకు వసూలు చేస్తున్నారు. బూడిద ప్రియమవడంతో దాని ఆధారంగా తయారయ్యే ఇటుకల ధరలూ అమాంతం పెరిగాయి. దీంతో రాష్ట్రంలో భవనాల నిర్మాణ వ్యయం కనీసం రూ.30 వేల నుంచి రూ.లక్షల్లో పెరిగింది.
సాక్షి కథనాలపై సీఎం కార్యాలయం ఆరా!
ఎన్టీపీసీ బూడిద వ్యవహారంలో ‘సాక్షి’కొంతకాలంగా ప్రచురిస్తున్న వరుస కథనాలపై సీఎం కార్యాలయం ఆరా తీసినట్లు తెలిసింది. కొందరు నేతల సాయంతో రోజూ రూ.లక్షల విలువైన బూడిదను అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలపై ఇటీవల ప్రచురితమైన కథనాలపై స్థానిక అధికారులతో నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకునేందుకు ఏ అధికారి కూడా ముందుకు రాకపోవడం స్థానికంగా ప్రజాప్రతినిధుల ఒత్తిడికి అద్దం పడుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఈ విక్రయాల్లో పారదర్శకత ఉండేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
2021 సెప్టెంబర్ ముందు బూడిద ధరలు
30 టన్నుల బూడిద లారీ రూ.700
టన్ను బూడిద రూ.23.30
కిలో బూడిద రూ.0.023
2021సెప్టెంబర్ తరువాత ధరలు
30 టన్నుల బూడిద లారీ ధర రూ.12,000
టన్ను బూడిద ధర రూ.400
కిలో బూడిద ధర రూ.0.4
Comments
Please login to add a commentAdd a comment