సింగరేణి సిగలో అద్భుతం: వేడినీటి బుగ్గతో విద్యుత్‌ | Singareni Collieries Planning To GeoThermal Energy Plant | Sakshi
Sakshi News home page

సింగరేణి సిగలో అద్భుతం: వేడినీటి బుగ్గతో విద్యుత్‌

Published Wed, Jun 16 2021 2:44 AM | Last Updated on Wed, Jun 16 2021 2:45 AM

Singareni Collieries Planning To GeoThermal Energy Plant - Sakshi

మణుగూరు మండలం పడిగేరు వద్ద పనులు చేస్తున్న సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ సిబ్బంది

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి తన జియో థర్మల్‌ ప్లాంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పరిధిలో  ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా భూమి(బుగ్గ) నుంచి వేడినీరు ఉబికి వస్తోంది. సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తుండగా ఈ విషయం బయటపడింది. మోటార్ల సాయం లేకుండా ఏళ్ల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి వస్తుండటంతో నీటి ఆవిరి ద్వారా ఇక్కడ విద్యుత్‌ ఉత్పత్తి చేయొచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్యరహితంగా విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన (ఒక గ్రామానికి సరిపడే విద్యుత్‌) ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో కొంతభాగాన్ని పరిసర గ్రామాల్లోని పంట భూముల కోసం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది.

ఆర్గానిక్‌ ర్యాంకైన్‌ సైకిల్‌ ద్వారా విద్యుదుత్పత్తి
వేడినీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటమే జియోథర్మల్‌. ఇందుకు ఆర్గానిక్‌  ర్యాంకైన్‌ సైకిల్‌ (ఏఆర్‌సీ) అనే సాంకేతిక ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుదుత్పత్తి చేసేందుకు మొదటిసారిగా సింగరేణి చరిత్ర పుటల్లోకి ఎక్కేందుకు ముందుకు వెళ్తోంది. ఈ పక్రియతో నిరంతరం విద్యుదుత్పత్తి చేయొచ్చని సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) ఉన్నతాధికారులు 2018–19లో సర్వే నిర్వహించారు.

రెండేళ్ల కింద కుదిరిన ఒప్పందం.. 
480 మీటర్ల లోతులో దాదాపు 51 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ వేడి నీటి ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే ప్లాంటును సింగరేణి సంస్థ శ్రీరామ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, 1989లో అప్పటి సింగరేణి చీఫ్‌ జియాలజిస్ట్‌ ఎ. వెంకటేశ్వరరావు పగిడేరులో ఓ రైతు వేసిన మంచినీటి బోరులో వేడి నీరు వస్తోందనే విషయం తెలుసుకుని నీటిని పరిశీలించారు. ఎండాకాలం కావడంతో బోరులోని నీరు వేడెక్కి ఉంటుందని భావించారు. తర్వాత ఆ విషయాన్ని అధికారులు విస్మరించారు. అయితే ఈ విషయం మళ్లీ ప్రాచుర్యం పొందడంతో ఎక్స్‌ప్లోరేషన్‌ అధికారులు నీటిని, నీటి నుంచి వెలువడే ఆవిరిని పరిశీలించి జీఎస్‌ఐకి పంపారు. దీంతో ఆ సంస్థ సర్వే చేసి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో జియోథర్మల్‌ ప్లాంట్‌కు బీజం పడింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement