energy plants
-
సింగరేణి సిగలో అద్భుతం: వేడినీటి బుగ్గతో విద్యుత్
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి తన జియో థర్మల్ ప్లాంట్‌ను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పగిడేరు గ్రామ పరిధిలో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాంతంలో కొన్నేళ్లుగా భూమి(బుగ్గ) నుంచి వేడినీరు ఉబికి వస్తోంది. సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ విభాగం బొగ్గు నిక్షేపాలను అన్వేషిస్తుండగా ఈ విషయం బయటపడింది. మోటార్ల సాయం లేకుండా ఏళ్ల తరబడి వేడినీరు వందల అడుగుల నుంచి వస్తుండటంతో నీటి ఆవిరి ద్వారా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇంధనం అవసరం లేకుండా కాలుష్యరహితంగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు 20 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన (ఒక గ్రామానికి సరిపడే విద్యుత్) ప్లాంటు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం కేంద్ర బొగ్గు శాఖ రూ.1.72 కోట్లు మంజూరు చేసింది. ఉత్పత్తి చేసిన విద్యుత్‌లో కొంతభాగాన్ని పరిసర గ్రామాల్లోని పంట భూముల కోసం ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించింది. ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ ద్వారా విద్యుదుత్పత్తి వేడినీటి ఆవిరి యంత్రం ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయటమే జియోథర్మల్. ఇందుకు ఆర్గానిక్ ర్యాంకైన్ సైకిల్ (ఏఆర్సీ) అనే సాంకేతిక ద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తకుండా విద్యుదుత్పత్తి చేసేందుకు మొదటిసారిగా సింగరేణి చరిత్ర పుటల్లోకి ఎక్కేందుకు ముందుకు వెళ్తోంది. ఈ పక్రియతో నిరంతరం విద్యుదుత్పత్తి చేయొచ్చని సింగరేణి ఎక్స్‌ప్లోరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఉన్నతాధికారులు 2018–19లో సర్వే నిర్వహించారు. రెండేళ్ల కింద కుదిరిన ఒప్పందం.. 480 మీటర్ల లోతులో దాదాపు 51 డిగ్రీల ఉష్ణోగ్రతతో ఉన్న ఈ వేడి నీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటును సింగరేణి సంస్థ శ్రీరామ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ సంస్థతో 2019లో ఒప్పందం కుదుర్చుకుంది. త్వరలో ప్లాంట్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా, 1989లో అప్పటి సింగరేణి చీఫ్ జియాలజిస్ట్ ఎ. వెంకటేశ్వరరావు పగిడేరులో ఓ రైతు వేసిన మంచినీటి బోరులో వేడి నీరు వస్తోందనే విషయం తెలుసుకుని నీటిని పరిశీలించారు. ఎండాకాలం కావడంతో బోరులోని నీరు వేడెక్కి ఉంటుందని భావించారు. తర్వాత ఆ విషయాన్ని అధికారులు విస్మరించారు. అయితే ఈ విషయం మళ్లీ ప్రాచుర్యం పొందడంతో ఎక్స్‌ప్లోరేషన్ అధికారులు నీటిని, నీటి నుంచి వెలువడే ఆవిరిని పరిశీలించి జీఎస్ఐకి పంపారు. దీంతో ఆ సంస్థ సర్వే చేసి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జియోథర్మల్ ప్లాంట్‌కు బీజం పడింది. -
'28 నెలల్లో ప్లాంట్ల నిర్మాణం పూర్తి'
న్యూఢిల్లీ : వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తిచేసేందుకు విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒప్పంద తేదీ నుంచి 28 నెలల్లో పూర్తవుతుందని అంచనావేస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనిపై విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పరేషన్, వ్యర్థాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. డెవలపర్ కూడా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లోకి వచ్చినట్టు చెప్పారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్లాంట్ సామర్థ్యం 15 మెగావాట్లేనని మంత్రి స్పష్టంచేశారు. దీంతో పాటు 47 మెగావాట్ల సామర్థ్యమున్న మరో ఎనిమిది ప్లాంట్లకు నూతన, పునరుత్పాదకత ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపిందని పీయూష్ గోయల్ తెలిపారు. దీనికి సంబంధించి సంబంధిత అర్బన్ లోకల్ బాడీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. వీటిని కూడా అగ్రిమెంట్ తేదీ నుంచి 28 నెలల లోపల ఈ ఫ్లాంట్లను పూర్తిచేస్తామని అంచనావేస్తున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదిత ప్లాంట్ల నిర్మాణంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానాన్ని లిఖిత పూర్వకంగా అందజేశారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్లాంట్ సామర్థ్యం 15 మెగావాట్లేనా? అని విజయసాయిరెడ్డి అడిగారు. ఆ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎప్పటివరకు పూర్తయితాయనే దానిపై పలు ప్రశ్నలు సంధించారు. పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు: పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అంచనావ్యయం 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లని కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పేర్కొన్నారు. 2005-06 ధర ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.10,151.04 కోట్లని చెప్పారు. ఇంకా సమీక్షించిన ప్రాజెక్టు ఖర్చు వివరాలు అందలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అసలు వ్యయంపై విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి ఈ విషయం చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రాజెక్టు అంచనావ్యయం రూ.40,200 కోట్లకు పెంచిన విషయంపై విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు.