'28 నెలల్లో ప్లాంట్ల నిర్మాణం పూర్తి'
Published Mon, Feb 6 2017 7:36 PM | Last Updated on Thu, Aug 9 2018 2:42 PM
న్యూఢిల్లీ :
వ్యర్థ పదార్థాల నుంచి విద్యుత్ను ఉత్పత్తిచేసేందుకు విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒప్పంద తేదీ నుంచి 28 నెలల్లో పూర్తవుతుందని అంచనావేస్తున్నట్టు కేంద్ర విద్యుత్ శాఖా మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. దీనిపై విశాఖపట్నం గ్రేటర్ మున్సిపల్ కార్పరేషన్, వ్యర్థాలను సరఫరా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. డెవలపర్ కూడా పవర్ పర్చేస్ అగ్రిమెంట్లోకి వచ్చినట్టు చెప్పారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్లాంట్ సామర్థ్యం 15 మెగావాట్లేనని మంత్రి స్పష్టంచేశారు. దీంతో పాటు 47 మెగావాట్ల సామర్థ్యమున్న మరో ఎనిమిది ప్లాంట్లకు నూతన, పునరుత్పాదకత ఇంధన అభివృద్ధి కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆమోదం తెలిపిందని పీయూష్ గోయల్ తెలిపారు. దీనికి సంబంధించి సంబంధిత అర్బన్ లోకల్ బాడీస్తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు.
వీటిని కూడా అగ్రిమెంట్ తేదీ నుంచి 28 నెలల లోపల ఈ ఫ్లాంట్లను పూర్తిచేస్తామని అంచనావేస్తున్నట్టు చెప్పారు. విశాఖపట్నంలో వ్యర్థాల నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రతిపాదిత ప్లాంట్ల నిర్మాణంపై వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానంగా కేంద్రమంత్రి ఈ మేరకు సమాధానాన్ని లిఖిత పూర్వకంగా అందజేశారు. విశాఖపట్నంలో నిర్మిస్తున్న ప్లాంట్ సామర్థ్యం 15 మెగావాట్లేనా? అని విజయసాయిరెడ్డి అడిగారు. ఆ ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చింది, ఎప్పటివరకు పూర్తయితాయనే దానిపై పలు ప్రశ్నలు సంధించారు.
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు:
పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు అంచనావ్యయం 2010-11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లని కేంద్ర నీటి వనరుల శాఖ సహాయ మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ పేర్కొన్నారు. 2005-06 ధర ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయం రూ.10,151.04 కోట్లని చెప్పారు. ఇంకా సమీక్షించిన ప్రాజెక్టు ఖర్చు వివరాలు అందలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అసలు వ్యయంపై విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి ఈ విషయం చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ ప్రాజెక్టు అంచనావ‍్యయం రూ.40,200 కోట్లకు పెంచిన విషయంపై విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు.
Advertisement