
నల్లబంగారం.. తనువెల్ల ధరించె.. తరాలే తరించె.. తరగని గనులు.. తగ్గని ఘనత.. నిలువెల్లా గాయాలె.. నిను మరువని గేయాలె.. కార్మికుల కడుపు నింపె.. కడుపున చీకటిని దాచె.. లోకానికి వెలుగులు పంచె.. చీకటి సూరీళ్లకు చిక్కటి వెలుగాయె.. సిరుల రాణి సింగరేణికి రేపటి (బుధవారం)కి వందేళ్లు...
బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.వందల కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది. జియోలాజికల్ సర్వే ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఆరు జిల్లాలో గోదావరితీరంలో 22,207 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించింది. ఇప్పటివరకు 1,500 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీశారు. మరోవైపు కాలక్రమేణా భూ గర్భగనుల తగ్గుదలు, ఓసీపీలు పెరగడం, యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతోంది. కొత్త కార్మిక చట్టాలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాలుష్య నియంత్రణలో భాగంగా థర్మల్ విద్యుత్ నియంత్రించడం తదితర కారణాలు సింగరేణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. -సాక్షి, మంచిర్యాల
తగ్గుతున్న కార్మిక భాగస్వామ్యం
కాలానుణంగా గనుల్లో తట్టా, చమ్మాస్ నుంచి అత్యాధునిక హై కెపాసిటీ లాంగ్‌వాల్ లాంటి యంత్రాల రాకతో కార్మికుల భాగస్వామ్యం తగ్గుతూ వస్తోంది. 1991లో సంస్థలో లక్షకుపైగా కార్మికులు ఉండగా ఇప్పుడా సంఖ్య 45 వేలకు పడిపోయింది. వచ్చే రెండేళ్లలో ఉద్యోగ విరమణలతో 25 వేలకు తగ్గనుంది. ఖాళీస్థానంలో కొత్త నియామకాలు జరగకపోగా, తక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి కోసం భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్‌లకే మొగ్గు చూపడంతో కార్మికులకు ఉపాధి తగ్గిపోతోంది. అదే సమయంలో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య పెరగడంతో తక్కువ జీతాలతో ఎక్కువ పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గనులపై ‘ప్రైవేటు’ పిడుగు
కొత్త చట్టాల ప్రకారం బొగ్గు గనుల ప్రైవేటీకీరణతో కొత్త బ్లాకులు సింగరేణికి దక్కుతాయా అనే సందేహం కార్మికుల్లో నెలకొంది. ఇప్పటికే దేశంలో 50 బ్లాకులను ప్రైవేట్‌వారికిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. సింగరేణిలో 27 భూగర్భ, 18 ఓసీపీల్లో ఉత్పత్తి కొనసాగుతోంది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు సింగరేణి అధీనంలో ఉంటాయా లేదా అనే అనుమానాలున్నాయి. రాబోయే కాలంలో థర్మల్ విద్యుత్‌కు పోటీగా సౌర, పవన, జల విద్యుత్ లాంటి ఉత్పాదక ఇంధనాల ప్రాధాన్యత పెరగడం బొగ్గు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపనుంది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌తో సంస్థకు మేలు జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. చదవండి: (టీఆర్‌టీ కంటే ముందే టెట్)
ప్రత్యామ్నాయంపై దృష్టి
మనుగడ కోసం ప్రత్యామ్నాయంపైనా సింగరేణి దృష్టి సారించింది. మంచిర్యాల జిల్లా జైపూర్‌లో సొంతంగా థర్మల్ విద్యుత్ రెండు ప్లాంట్లను స్థాపించింది. 2016 నుంచి ఇవి 1,200 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. సింగరేణి చెందిన ఖాళీ భూములతోపాటు మూతపడిన ఓసీపీలు, భూగర్భగనుల పరిసరాలు, నీటి ఉపరితలాలపై సౌర విద్యుత్ ఉత్పత్తికి మొదలుపెట్టింది. మూడు దశల్లో 300 మెగావాట్ల సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయదల్చింది. వీటితోపాటు గనుల నుంచి గ్యాసిఫికేషన్ వంటివి చేపట్టే యోచనలో ఉంది.
కొత్త చట్టాలతో కార్మికులకు నష్టం
కొత్త చట్టాలతో ప్రైవేటీకరణ కొనసాగితే సంస్థ భవిష్యత్తుకు, కార్మికుల జీవనోపాధికి తీరని నష్టం జరుగుతుంది. సింగరేణిని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ప్రైవేటీకరణను విరమించుకోవాలి. అలాగే కొత్త గనులు చేపట్టి కొత్త కార్మికుల నియామకాలు చేపట్టాలి. –మంద నర్సింహారావు, ప్రధానకార్యదర్శి, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్
భవిష్యత్తుపై ఆలోచించాలి
కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు కార్మికుల సంక్షేమం దృష్ట్యా భవిష్యత్తు ప్రధాన దృష్టి సారించాలి. కేవలం బొగ్గు ఉత్పత్తి కాకుండా విద్యుత్, సిమెంట్, గ్యాసిఫికేషన్, సొలార్ తదితర ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ప్రైవేటులో పోటీని తట్టుకునేలా అన్ని రకాలుగా వృద్ధి చెందాలి. –జనక్‌ప్రసాద్, సెక్రటరీ జనరల్, ఐఎన్‌టీయూసీ
ఇదీ ‘బొగ్గు చరిత్ర’
1871- బ్రిటిష్ హయాంలో జియోటాజికల్ సర్వే ఇండియాకు చెందిన డాక్టర్ కింగ్ జార్జ్ అప్పటి ఖమ్మం జిల్లా ఇల్లెందులో బొగ్గు నిల్వలను కనుగొన్నారు
1886- బ్రిటిష్ ఇండియాలోని హైదరాబాద్ (డెక్కన్) కంపెనీ లిమిటెడ్ ఇల్లెందులో బొగ్గు వెలికితీత కోసం అనుమతి పొందింది
1889- నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం
1920- డిసెంబర్ 23న ది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)గా అవతరణ
1945- హైదరాబాద్ రాష్ట్రం కంపెనీలో మెజారిటీ వాటా కొనుగోలు
1949- హైదరాబాద్ ప్రభుత్వం ఈ కంపెనీని ఇండస్ట్రీయల్ ఫండ్ ట్రస్ట్‌కు అప్పగించింది
1956- ఉమ్మడి రాష్ట్ర అవతరణ తర్వాత కంపెనీల చట్టం ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థగా మార్పు
1960- మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో కంపెనీని విస్తరించే క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈక్విటీ, రుణ సాయం పెంచుతూ భాగస్వామ్యం ప్రారంభం (కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి సంస్థగా మార్పు)
1974- కేంద్రం కంపెనీ మూల ధన వాటాను కేంద్ర బొగ్గు గనుల సంస్థకు బదిలీ. అదే ఏడాది కేంద్రం, రాష్ట్రం, సంస్థ మధ్య ఒప్పందం జరిగింది. ప్రస్తుతం సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతం, రాష్ట్ర వాటా 51 శాతం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment