సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తుండడం, పలు ప్రాంతాలను వరదలు పోటెత్తుతున్న నేపథ్యంలో ఎవరికైనా ఎలాంటి కష్టం ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నంబర్ 040–23450624కు కాల్ చేయవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమైతే తక్షణమే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై శనివారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి బీఆర్‌కేఆర్ భవన్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు ప్రస్తుత పరిస్థితిని పర్యవేక్షించడానికి తమ కార్యాలయాల్లో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లా అధికారులందరూ జిల్లా కేంద్రంలోనే అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలని ఆదేశించారు. జిల్లాల్లో రైల్వే లైన్‌లకు దగ్గరగా ఉన్న చెరువులు, కుంటల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సీఎస్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment