సాక్షి, హైదరాబాద్: మూలధన వ్యయంతో చేపట్టే సివిల్ పనులకు వరుసగా రెండో ఏడాది కూడా బడ్జెట్‌లో స్థానం దక్కే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పనుల విషయంలో పారదర్శకత అవసరమని, కచ్చితంగా ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి తీసుకున్న తర్వాతే సివిల్ ప్రతిపాదనలు చేయాల్సి ఉంటుందని, అప్పుడే నిధులు మంజూరవుతాయని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020–2021 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శని వారం అన్ని శాఖల విభాగాధిపతులతో సమా వేశం నిర్వహించారు. ఇందులో భాగంగా ఆయా శాఖలు బడ్జెట్ ప్రతిపాదనలు చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అధికారులకు వివరించారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో సివిల్ పనులకు ప్రతిపాదనలు చేయవద్దని ఆయన సూచించినట్టు తెలిసింది.
ఏ అంశమైనా ఆ కార్యక్రమాల తర్వాతే..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకే బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యత ఉండాలని, మిగి లిన ఏ అంశమైనా ఈ కార్యక్రమాల తర్వాతేనని సోమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం కొనసాగుతోందని, ఈ ప్రభావం కొన్నాళ్ల పాటు రాష్ట్రంపై కూడా ఉండే నేపథ్యంలో బడ్జెట్ ప్రతిపాదనల తయారీలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను, ఇతర ఖర్చులను సమన్వయం చేసుకుంటూ నిర్వహణ పద్దులు ప్రతిపాదించాలని కోరారు. బడ్జెట్ ప్రతిపాదనల్లో మితిమీరిన అంచనాలకు వెళ్లవద్దని సోమేశ్ సూచించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులపై స్పష్టత లేదని, కేంద్ర ప్రాయోజిత పథకాలపై ఇటీవల ముంబైలో జరిగిన సమావేశంలో కూడా కేంద్రం నుంచి ఎంత నిధులు వస్తాయన్నది స్పష్టంగా చెప్పలేదని వివరించారు.
నిర్వహణ ఖర్చులు తగ్గించండి..
ఇక కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద దరఖాస్తులు పెద్ద మొత్తంలో పెండింగ్ ఉండడంతో వీటి పరిష్కారంతో పాటు వచ్చే ఏడాది అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనార్టీ సంక్షేమ శాఖలకు సీఎస్ సూచించినట్లు తెలిసింది. అలాగే ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాలకు రెగ్యులర్ ప్రతిపాదనలు ఇవ్వాలని పేర్కొంటూ.. నిర్వహణ వ్యయాన్ని భారీగా తగ్గించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం. గురుకుల పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు పెద్ద సంఖ్యలో ఉండగా.. వీటికి ఏటా మరమ్మతులు, మౌలిక వసతుల కింద పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. వీటిని భారీగా కుదించాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్న వాటికి మాత్రం బిల్లులు చెల్లించాలని, న్యాయపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పడాలని సూచించినట్లు సమాచారం. ఇటు కార్యాలయాల నిర్వహణ వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని స్పష్టం చేసిన నేప«థ్యంలో బడ్జెట్ ప్రతిపాదనల రూపకల్పనపై సంక్షేమ శాఖలు కార్యాచరణకు ఉపక్రమిస్తున్నాయి. ముందుగా ప్రాధాన్యతల వారీగా అవసరాలను గుర్తించిన తర్వాత ప్రతిపాదనలు చేపట్టాలని, ఈమేరకు ఒకట్రెండు రోజుల్లో జిల్లా అధికారులతో సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.
కేంద్ర నిధులపై ఆశల్లేవు..
ఈ ఆర్థిక సంవత్సరంలోని చివరి త్రైమాసికం తో పాటు వచ్చే ఏడాది తొలి త్రైమాసికం కూడా కేంద్ర నిధులపై అంచనాలు పెట్టుకోవద్దని సీఎస్ తెలిపారు. రాష్ట్రం లోని గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల కరెంటు బిల్లులు ఆయా సంస్థలే కట్టుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎస్‌ఎఫ్‌సీ నిధులు ఇస్తున్నందున కరెంటు బిల్లుల ఖర్చులను కూడా ఆయా శాఖల బడ్జెట్‌లోనే పొందుపర్చాలని సూచిం చారు. మొత్తంమీద ప్రభుత్వ పథకాలు సజావుగా అమలు జరగడంతో పాటు ఆస్తుల కల్పన దిశలో మూలధన వ్యయం జరిగేలా అన్ని శాఖలు జాగ్రత్తగా ప్రతిపాదనలు తయారు చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం అనుబంధ శాఖల వారీగా మరోసారి భేటీ అవుతామని తెలిపారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావుతో పాటు ఆర్థిక శాఖ ముఖ్య అధికారులు, అన్ని శాఖల విభాగాధిపతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment