Soumya Swaminathan: వ్యాక్సినే పరమౌషధం! | Soumya Swaminathan Says Vaccination Is Compulsory | Sakshi
Sakshi News home page

Soumya Swaminathan: వ్యాక్సినే పరమౌషధం!

Published Tue, May 18 2021 2:22 AM | Last Updated on Tue, May 18 2021 9:33 AM

Soumya Swaminathan Says Vaccination Is Compulsory - Sakshi

ఇది సంక్లిష్ట దశ..
భారతదేశంలో ప్రస్తుతం సంక్లిష్ట దశ కొనసాగుతోంది. రానున్న 6 నుంచి 18 నెలల పాటు ఈ వైరస్‌తో మనం చేసే పోరాటమే కీలకమైనది. వైరస్‌ను అంతం చేయాలా లేదా నిరోధానికి మాత్రమే పరిమితం కావాలా అన్నది ఈ పోరాటం మీదే ఆధారపడి ఉంటుంది. అయితే ఈ వైరస్‌ ప్రభావం ఎంత కాలం ఉంటుందన్నది ఊహించడం ఇప్పుడు కష్టం. కానీ ఏదో దశలో ఈ వైరస్‌ అంతంకాక తప్పదు’

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణకు వ్యాక్సినేషనే కీలకమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ పేర్కొన్నారు. రానున్న 6 నుంచి 18 నెలల కాలంలో తీసుకునే చర్యలను బట్టి కోవిడ్‌పై ఆయా దేశాలు చేస్తున్న పోరాటం ఆధారపడి ఉంటుందని అంటున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచంలోని 30 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తవుతుందని అంచనా వేశారు. ఆ తర్వాతే కరోనా మరణాల సంఖ్యలో తగ్గుదల ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది (2022) పూర్తిగా కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కోసమే కేటాయించాల్సి ఉంటుందని, వచ్చే సంవత్సరంలో 70–80 శాతం మందికి వ్యాక్సినేషన్‌ పూర్తి కావాల్సి ఉందని జాతీయ మీడియాతో చెప్పారు ‘ఈ వైరస్‌ వ్యాప్తికి ఎక్కడో ఒక దగ్గర అంతం ఉంది. అయితే వైరస్‌ పరిణామ క్రమాన్ని పరిశీలిస్తూ వ్యాక్సిన్ల సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ల వ్యాధి నిరోధకత ఎంత కాలం ఉంటుందన్నది కీలకం’అని వెల్లడించారు. ఆమె వెల్లడించిన ముఖ్యాంశాలు..

వేరియంట్‌ ప్రధానం కాదు
‘ఇప్పుడు దేశంలో ఏ వేరియంట్‌ ఉంది.. ఎంత కా లం ఉంటుందన్నది ముఖ్యం కాదు. ఏ వేరియంట్‌ అయినా వ్యాప్తి చెంది రోగ లక్షణాలకు కారణమవు తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు గుర్తించాల్సింది.. గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే.. మాస్కు ధరించాలి. జన సమూహాల్లోకి వెళ్లవద్దు. ఇరుకు ప్రదేశాల్లో కలవద్దు. వెంటిలేషన్‌ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. భౌతిక దూరం పాటిస్తూ తగినంత శుభ్రంగా ఉండాలి’

మన వ్యాక్సిన్లు చాలా సమర్థవంతమైనవి
‘నాకు తెలిసినంత వరకు ప్రస్తుతం భారతదేశంలో ఇస్తున్న వ్యాక్సిన్లు కరోనా వైరస్‌ వేరియంట్‌పై సమర్థవంతంగా పనిచేయగలిగిన సామర్థ్యం ఉన్నవి. వ్యాక్సిన్‌ 2 డోసులు తీసుకున్న వారు కూడా కరోనా బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్న సంఘ టనలున్నాయి. కానీ అది సాధారణం. ఎందుకంటే ఏ వ్యాక్సిన్‌ కూడా 100 శాతం భద్రత ఇవ్వదు. కానీ, రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో రోగ లక్షణాలు తీవ్రమై ఐసీయూ వరకు వెళ్లే పరిస్థితి రాదు. అందుకే వ్యాక్సినేషన్‌ తప్పనిసరి’

చికిత్సలో ప్రొటోకాల్‌ పాటించాలి..
కోవిడ్‌ చికిత్స విషయంలో ప్రొటోకాల్‌ కీలకం. ఎందుకంటే సరైన సమయంలో రోగికి సరైన మందు ఇవ్వకుండా వేరే మందు ఇస్తే అది మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది. ప్రస్తుతం స్టెరాయిడ్‌ మాత్రం ఆస్పత్రిలో ఆక్సిజన్‌ తీసుకుంటున్న వారికి పనిచేస్తోంది. ఏ మందు ఎప్పుడు ఇవ్వాలన్న దానిపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రొటోకాల్‌ పాటించాలి. అయితే కోవిడ్‌ చికిత్స విషయంలో డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాలు స్పష్టం గా ఉన్నాయి. ఏ దేశానికి ఆ దేశంలో సొంత చికిత్స విధానాలు రూపొందించుకోవాలి. అధ్యయనాల ఆధారంగా అప్‌గ్రేడ్‌ అవుతూ రోగలక్షణాలకు అనుగుణంగా ఈ చికిత్సా పద్ధతులుండాలి’అని సౌమ్యా స్వామినాథన్‌ స్పష్టం చేశారు. 

50 దేశాల్లో బి.1.617 వేరియంట్‌
‘భారత్‌లో ప్రస్తుతం కనిపిస్తున్న కరోనా వైరస్‌కు చెందిన బి.1.617 వేరియంట్‌ ఎక్కువగా సంక్రమణ చెందడానికి అవకాశం ఉంది. యూకేలో గుర్తించిన బి.1.1.7 వేరియంట్‌కు కూడా సంక్రమణ చెందే సామర్థ్యం ఉంది. ఒకానొక సమయంలో ఈ వేరియంట్‌ భారత్‌లో ఎక్కువగా కనిపించింది. కానీ ప్రస్తుతం ఉన్న బి.1.617 వేరియంట్‌ వైరస్‌ 50 దేశాల్లో విస్తరించి ఉంది. ఈ వేరియంట్‌ పలు స్ట్రెయిన్లుగా విడిపోతోంది’ ఏ వేరియంట్‌కు చెందిన ఏ స్ట్రెయిన్‌.. ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న దానిపై పూర్తి స్థాయి అధ్యయనాలు, డేటా అందుబాటులో లేవు. అయితే కోవాగ్జిన్‌ అయినా కోవిషీల్డ్‌ అయినా.. వ్యాక్సిన్‌ ఏదైనా యాంటీబాడీలను అప్రమత్తం చేసి వ్యాధి తీవ్రతను తగ్గించే అవకాశం మాత్రం ఉంది. ఇప్పుడు మరిన్ని అధ్యయనాలు జరగడం అత్యవసరం. రోగుల ఆరోగ్య చరిత్ర, వ్యాధి తీవ్రత, సంక్రమణ చెందిన విధానాన్ని పరిశీలించాల్సి ఉంది’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement