
సుల్తాన్‌బజార్ (హైదరాబాద్): గణేష్ ఉత్సవాల్లో ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు కాసేపు సరదాగా చిందులు వేసి ఆ శాఖ ఉద్యోగుల్లో జోష్ నింపారు. టీఎన్‌జీవోస్ డీఎంహెచ్‌ఎస్ విభాగం అధ్యక్షుడు మామిడి ప్రభాకర్ ఆధ్వర్యంలో వైద్య,ఆరోగ్యశాఖ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవాలకు మంగళవారం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ఆడిపాడారు.
అయితే కరోనా నేపథ్యంలో భౌతికదూరం పాటించాలని, మాస్క్ ధరించాలని ప్రజలకు జాగ్రత్తలు చెబుతోన్న ఆయనే మాస్కు లేకుండా డ్యాన్సులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా తెలంగాణలో మంగళవారం నిర్వహించిన 76,481 కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 336 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,62,202కి చేరింది. ఒకరోజులో కరోనాతో ఒకరు మృతిచెందారు.