చిన్నారుల ఆరోగ్యంపై ఫీవర్‌ సర్వేలో ఆరా..బాగుంటేనే బడి.. | Starting Educational Institutions In Telangana Based On Fever Survey | Sakshi
Sakshi News home page

చిన్నారుల ఆరోగ్యంపై ఫీవర్‌ సర్వేలో ఆరా..బాగుంటేనే బడి..

Published Sat, Jan 22 2022 1:36 AM | Last Updated on Sat, Jan 22 2022 8:26 AM

Starting Educational Institutions In Telangana Based On Fever Survey - Sakshi

శుక్రవారం హైదరాబాద్‌లోని బాలానగర్‌లో ఇంటింటి ఫీవర్‌ సర్వే

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఓ అంచనాకు వచ్చిన తర్వాతే విద్యా సంస్థల రీ ఓపెనింగ్‌పై స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి ప్రారంభించిన ‘ఇంటింటి జ్వర సర్వే’ని ప్రామాణికంగా తీసుకోవాలని భావిస్తోంది. సర్వేలో భాగంగా ప్రభుత్వ సిబ్బం ది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీయనున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సర్వేకి సంబంధించి 4,5 రోజుల డేటా ఆధారంగా..విద్యార్థుల లెక్కను విడిగా తీయాలని అధికారులకు ప్రభుత్వం ఆదే శించినట్టు తెలిసింది. సర్వేకి వచ్చిన కార్యకర్తలు కూడా చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై స్పష్టమైన ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం విశేషం. సంక్రాంతిని పుర స్కరించుకుని 4 రోజులు ముందుగానే ఈ నెల 8 నుంచి అన్ని రకాల విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కరోనా పరిస్థితుల్లో సెలవులు పొడిగిం చింది. అన్నీ బాగుంటే ఈ నెల 31 నుంచి విద్యా సంస్థలను పునఃప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించింది. అయితే కోవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పునరా లోచనలో పడింది. స్కూళ్ళు తెరిచినా చిన్నారు లను పంపేందుకు తల్లిదండ్రులు ఇష్టపడతారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేప థ్యంలోనే ఇంటింటి సర్వే ఆధారంగా నిర్ణయం తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. 

సర్వేలో తేలే అంశాలే కీలకం
ప్రధానంగా 15 ఏళ్ళలోపు విద్యార్థుల ఆరోగ్య డేటాను పరిశీలించే ఆలోచనలో అధికారులు న్నారు. రాష్ట్రంలో 26,067 ప్రభుత్వ స్కూళ్లున్నా యి. మరో 12 వేల ప్రైవేటు స్కూళ్ళున్నాయి. వీటిల్లో 1–10 తరగతుల విద్యార్థులు 69 లక్షల మంది వరకు ఉంటారు. వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ సర్వేలో వెల్లడయ్యే అంశాలనే కీలకంగా తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఎంత మందికి అనారోగ్య పరిస్థితులున్నాయి? ఎంత మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది? వారిలో తీవ్రత ఎంత? క్వారంటైన్‌లో ఉంటు న్నారా? ఇలాంటి వివరాలను సర్వేలో అడిగి తెలుసుకుంటున్నారు. ఈ మేరకు అందిన సమాచారం ఆధారంగా చిన్నారుల ఆరోగ్య పరిస్థితి, కరోనా తీవ్రతపై ఓ అంచనాకు వచ్చే వీలుందని అధికారవర్గాలు తెలిపాయి.  30 శాతం మందిలో అనారోగ్య లక్షణాలు (జలుబు, దగ్గు, జ్వరం) ఉంటే.. వారు స్కూళ్ళకు వెళ్తే వారి వల్ల మరో 20 శాతం మందికి వ్యాప్తి జరిగే వీలుందని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో వ్యాధి లక్షణాల తీవ్రత కూడా గమనించాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. గతంలో మాదిరి కరోనా ఈసారి పెద్దగా ప్రభావం చూపడం లేదనే వాదనల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ సలహాలు తీసుకునే వీలుందని అధికారులు అంటున్నారు.

తల్లిదండ్రులు పంపుతారా?
    సెకెండ్‌ వేవ్‌ తర్వాత సెప్టెంబర్‌లో ప్రత్యక్ష బోధన చేపట్టారు. అయితే దాదాపు రెండు వారాల పాటు 22 శాతానికి మించి విద్యార్థుల హాజరు కన్పించలేదు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఆన్‌లైన్‌ విధానం అందుబాటులో ఉండటంతో ఈ శాతం ఇంకా తక్కువే నమోదయ్యింది. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 31 నుంచి స్కూళ్ళు తెరిచినా, కరోనా ఉధృతి ఇదేవిధంగా సాగితే తల్లిదండ్రులు పిల్లల్ని పాఠశాలలకు పంపుతారా? అనే సంశయం వెంటాడుతోంది. అన్ని కోణాల్లోనూ వివరాలు సేకరిస్తున్నామని, ఇవన్నీ ప్రభుత్వానికి నివేదిస్తామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. 

శానిటైజేషన్‌ కూడా సమస్యే
    కరోనా థర్డ్‌వేవ్‌ విజృంభించే సమయంలో అతి కీలకమైన అంశం శానిటైజేషన్‌. సెకెండ్‌ వేవ్‌లో దీని అమలు విద్యాశాఖకు తలనొప్పి తెచ్చిపెట్టింది. శానిటైజేషన్‌ బాధ్యతను పాఠశాల హెచ్‌ఎంలకు అప్పగించారు. స్కూళ్ళకు ప్రత్యేకంగా సిబ్బంది లేకపోవడంతో పంచాయతీల పరిధిలోని పారిశుధ్య సిబ్బందినే వాడుకోవాల్సి వచ్చింది. అయితే చాలాచోట్ల పంచాయతీ సిబ్బంది ఇందుకు నిరాకరించారు. ఇప్పుడు కూడా  ఇదే పరిస్థితి తలెత్తే వీలుందని, స్కూలు ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్ల శానిటైజేషన్‌ సమస్యగా మారవచ్చని విద్యాశాఖలో ఆందోళన వ్యక్తమవుతోంది. శానిటైజేషన్‌ ప్రక్రియకు అదనపు నిధులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాలని భావిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement