
ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ స్థలంలో అంబేడ్కర్ విగ్రహ పనులను పరిశీలిస్తున్న బండి
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేస్తా మని చెప్పి ఆరేళ్లు అయినా ఇంతవరకూ ఎందుకు నెలకొల్పలేదని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ నిలదీశారు. విగ్రహం ఏర్పాటుతోపాటు దళితులకిచ్చిన హామీలన్నింటినీ అమలు చేయనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ తరపున పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
నగరంలోని ఐమాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసే చోట పనులను పరిశీలించిన సంజయ్ అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సీఎం పదవి చేపట్టాక మొట్టమొదటగా మోసం చేసింది దళితులనేనని, తెలంగాణ ఏర్పడితే దళితుడే మొదటి సీఎం అని హామీ ఇచ్చి దగా చేశారని ఆరోపించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తిరగరాయాలని కేసీఆర్ చెబుతున్నారంటే ఎంత బరితెగించి మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. ‘కేసీఆర్.. రాజ్యాంగాన్ని తిరగరాయడం కాదు కదా.
ఒక్క పేజీ కూడా మార్చలేవ్. దమ్ముంటే ముట్టుకుని చూడు. మసైపోతవ్’అని హెచ్చరించారు. కేసీఆర్ ప్రగతిభవన్‌ను ఏడాదిలో నిర్మించు కుని విలాసాలు అనుభవిస్తున్నారని, కొత్త సెక్రటేరియట్ నిర్మాణ పనులపై ఎప్పటికప్పడు రివ్యూ చేస్తూ 4, 5 సార్లు సందర్శించారని, మరి, ఆరేళ్లయినా అంబేడ్కర్ విగ్రహ పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. సంజయ్ వెంట బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్.గౌతంరావు, శ్యాంసుందర్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
దేశమే ముందు.. ఆ తర్వాతే..: ‘‘దేశం ముందు.. పార్టీ తర్వాత.. కుటుంబం చివరన’’ఇదే బీజేపీ సిద్ధాంతమని బండి సంజయ్ అన్నారు. అయో ధ్యలో రామమందిర నిర్మాణానికి అవస రమైన విరాళాల సేకరణలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు. ఆదివారం బీజేపీ నేతలతో సూక్ష్మ విరాళాలపై సంజయ్ వర్చువల్ సమావేశం నిర్వ హించారు. సంజయ్ మాట్లాడుతూ ‘కొన్ని రాజకీ య పార్టీల మాదిరిగా బ్లాక్‌మెయిల్, అవినీతికి పాల్పడి పార్టీకి నిధులు సమీకరించాల్సిన అవసరం బీజేపీకి లేదు.
పార్టీ బలోపేతంలో నా భాగస్వా మ్యం ఉందనే భావన కార్యకర్తలందరిలో కలిగించేందుకే మైక్రో డొనేషన్స్ కార్యక్రమాన్ని చేపట్టాం’అన్నారు. మైక్రో డొనేషన్స్ జాతీయ ఇన్‌చార్జి సునీల్ దేవధర్ మాట్లాడుతూ సూక్ష్మ విరాళాల సేకరణ ద్వారా ఎంత డబ్బు సమకూరిందన్నది ముఖ్యం కాదు. కార్యకర్తల భాగస్వామ్యం మనకు అత్యంత ప్రధానమన్నారు. కార్యక్రమంలో దక్షిణాది విభా గం ఇన్‌చార్జి నిర్మల్ సురానా, రాష్ట్ర ఇన్‌చార్జి చింతల రామచంద్రారెడ్డి, సహ ఇన్‌చార్జి భండారు శాంతికుమార్, పాపారావు ఈ భేటీలో పాల్గొన్నారు.