సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని, దేశానికి తెలంగాణ అన్నం పెడుతోందని ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కె.తారకరామారావు చెప్పారు. రైతులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవ డం వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలి పారు. దేశంలో రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తమదేనని, రైతులకు ఉచిత విద్యుత్ కోసం నెలకు రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్ శంషాబాద్‌లోని నోవాటెల్‌లో దేశంలోనే తొలి అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అగ్రికల్చర్ డేటా ఎక్సేంజ్ ప్రవేశపెట్టడం దేశ వ్యవసాయ చరిత్రలో కొత్త అధ్యాయమని.. అందుబాటులోకి వచ్చిన అగ్రికల్చరల్ డేటా మేనేజ్‌మెంట్ ఫ్రేమ్ వర్క్ (ఏడీఎంఎఫ్)తో పరిశ్రమలు, స్టార్టప్‌లు వ్యవసాయ డేటాను సమర్ధవంతంగా ఉపయోగించుకొని రైతులకు ప్రయోజనకారిగా ఉండాలని పిలుపునిచ్చారు.
అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి రైతులు పంటల ఎంపిక, పంట వేసే సమయం, మెరుగైన ధరలను అందించే మార్కెట్లను ఎంచుకోవడం, వాతావరణం, ప్రస్తుత తెగుళ్ల పరిస్థితులను తెలుసుకొని రైతులకు మేలు చేయాలని సూచించారు.
రాష్ట్రంలో ఐదు రకాల విప్లవాలు
ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే నాటికి వ్యవసాయ అనుబంధ ఉత్పత్తుల్లో తెలంగాణ 24వ స్థానంలో, ధాన్యం ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉండేదని.. ఇప్పుడు ఏకంగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గత తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో ఐదు విప్లవాలు సాకారమయ్యాయని కేటీఆర్ చెప్పారు. ‘‘అత్యధిక వరి ఉత్పత్తి ద్వారా ‘గ్రీన్ రెవల్యూషన్’ సాధ్యమైంది. మత్స్య సంపద ఉత్పత్తిలోనూ మొదటిస్థానంలో ఉన్నాం. తద్వారా ‘బ్లూ రెవల్యూషన్’ సాధ్యమైంది.
పాడి రైతులకు మెరుగైన ప్రోత్సాహకాలు అందించడం ద్వారా ‘వైట్ రెవల్యూషన్’ సాధ్యమైంది. కుర్మ,యాదవ కుటుంబాలకు గొర్రెలు పంపిణీతో మాంసాహార ఉత్పత్తి పెరిగి.. ‘పింక్ రెవల్యూషన్’ సాకారమైంది. ప్రస్తుతం దేశంలో ఎక్కడా లేని విధంగా ఆయిల్‌పామ్ రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. దీనిద్వారా ‘ఎల్లో రెవల్యూషన్’ సాధ్యమవుతుంది..’’ అని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీలో అగ్రగామిగా రాష్ట్రం: కేటీఆర్
శంషాబాద్: ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తోందని.. పరిశోధన, డిజైనింగ్ రంగాల్లో హైదరాబాద్ ముందజలో ఉందని మంత్రి కేటీఆర్ చెప్పారు. శుక్రవారం జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా కంపెనీకి చెందిన ఈ–పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్‌కు మంత్రి భూమి పూజ చేశారు. అనంతరం నోవాటెల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు.
అమరరాజా పరిశోధన కేంద్రం ‘విద్యుత్ నిల్వ, ఎలక్ట్రిక్ మొబిలిటీ’ రంగాల సుస్థిర వృద్ధికి బాటలు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణహిత సుస్థిరాభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పరిశ్రమలతో కలసి ముందుకు వెళుతోందని చెప్పారు. కాగా.. అభివృద్ధి చెందుతున్న ఇంధన నిల్వ అవసరాలను పరిష్కరించే దిశగా పాజిటివ్ ఎనర్జీల్యాబ్ పనిచేస్తుందని అమరరాజా సంస్థ చైర్మన్ గల్లా జయదేవ్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment