అక్రమ ట్యాపింగ్ కేసులో విచిత్ర పరిస్థితి
ఇప్పటిదాకా చెప్పింది ప్రభాకర్‌రావు పేరే
భవిష్యత్తులో ఉన్నతాధికారులకూ వ్యవహారం తెలుసంటే విచారణ తప్పని వైనం
ప్రధాన ఇంటెలిజెన్స్‌లో భాగంగానే ఎస్‌ఐబీ
‘వసూళ్ల విభాగాలు’ కమిషనర్ల అదీనంలోనే..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా క్రిమినల్ కేసుల దర్యాప్తులో నిందితుల భవిష్యత్తు పోలీసుల చేతు ల్లో ఉంటుంది. ఎవరెవరిని నిందితులుగా చేర్చాలి? వారిపై ఏఏ సెక్షన్ల కింద అభియోగాలు మోపాలి? అనేది కేసుల దర్యాప్తు ఆధారంగా వీళ్లే నిర్ణయిస్తారు. అయితే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ ఐబీ) లోని స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ) కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొందరు పోలీసు ఉన్నతాధికారుల భవిత ఈ కేసులో నిందితులుగా ఉన్న పోలీసుల చేతిలో ఉండటం ఆసక్తి కలిగిస్తోంది.
వీళ్లు చెప్పే అంశాలపై డీజీ పీ, అదనపు డీజీ స్థాయి అధికారులకు నోటీసులు ఇవ్వాలా? వద్దా? అనేది ఆధారపడి ఉందని అంటున్నారు. ఇలావుండగా ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావును ఈ నెల 10 వరకు పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోలీసు కస్టడీ పూర్తయి, జ్యుడీషియల్ రిమాండ్‌కు వెళ్లిన అదనపు ఎస్పీ నాయిని భుజంగరావును అదనపు కస్టడీకి కోరుతూ పంజగుట్ట పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు.
ప్రభాకర్‌రావు దగ్గరే ఆగిన కేసు
ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన అంశాలు, నిందితులుగా ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాలను బట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావు నేతృత్వంలో సాగింది. దర్యాప్తు అధికారులు కూడా ప్రస్తుతానికి ఇంతవరకే పరిమితం అవుతున్నారు. అయితే ఎస్‌ఐబీకి ఓఎస్డీ హోదాలో ప్రభాకర్‌రావే నేతృత్వం వహించినప్పటికీ.. ఈ విభాగం కూడా ప్రధాన ఇంటెలిజెన్స్‌లో అంతర్భాగమే. దీనికి అదనపు డీజీపీ లేదా ఐజీ స్థాయి అధికారులు బాస్‌లుగా ఉంటారు.
విదేశాలనుంచి ఎలాంటి నిఘా ఉపకరణాలు ఖరీదు చేయాలన్నా కచ్చితంగా నిఘా విభాగాధిపతితో పాటు డీజీపీ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అరెస్టు అయిన పోలీసులతో పాటు అరెస్టు కాబోయే వారు, విదేశాల్లో ఉన్న ప్రభాకర్‌రావు పట్టుబడిన తర్వాత.. ఉన్నతాధికారులకు తెలిసే ఈ వ్యవహారం జరిగిందని వారు చెప్తే వారికీ నోటీసులు ఇవ్వక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సిట్ అదుపులో వేణుగోపాల్‌రావు
పోలీసులు ఇచ్చిన నోటీసుల ఆధారంగా బంజారాహిల్స్ ఠాణాకు వచ్చిన ఎస్‌ఐబీ మాజీ ఓఎస్డీ వేణుగోపాల్‌రావును బుధవారం సిట్ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఎస్‌ఐబీలోని ఎస్‌ఓటీలో కీలకంగా వ్యవహరించిన నలుగురు అధికారుల్లో ఓఎస్డీ హోదాలో పని చేసిన ఈయన కూడా ఒకరు. అదనపు ఎస్పీగా పదవీ విరమణ చేసిన అనంతరం ప్రభాకర్‌రావు సూచనల మేరకు ఓఎస్డీగా పని చేశారు.
ప్రత్యేక విభాగాలు కమిషనర్ల అదీనంలో
టార్గెట్ చేసిన ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు తదితరులపై సాంకేతిక నిఘా ఉంచడం, వారి ఫోన్లు ట్యాప్ చేయడం ఎస్‌ఐబీ అ«దీనంలో ఎస్‌ఓటీ చేసింది. అయితే వారిని పట్టుకోవడం, నగదు స్వాదీనం చేసుకోవడం, వసూళ్లకు పాల్పడటం ఫీల్డ్ ఆపరేషన్లు మాత్రం రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఉన్న ప్రత్యేక విభాగాలు చేశాయి. దీంతో ఇప్పటివరకు జరిగిన అక్రమ ఆపరేషన్లు ఆ విభాగాలకు నేతృత్వం వహించిన కమిషనర్లకు తెలియకుండానే జరిగాయా? అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఈ విషయాలపై నిందితులు ఏదైనా చెబితే ఆయా ఉన్నతాధికారులకూ నోటీసులు ఇచ్చి విచారించడం అనివార్యంగా మారుతుంది. దీనిపై ఓ రిటైర్డ్ అధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఆయా ఉన్నతాధికారులు కేసులో నిందితులు కాకపోయినా, వారి పర్యవేక్షణ లోపం కచ్చితంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వాళ్లు క్రిమినల్ చర్యలకు కాకపోయినా..డిపార్ట్‌మెంటల్ యాక్షన్‌కు అర్హులే’అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment