తాండూరులోని ప్రభుత్వ నంబర్ –1 పాఠశాల
సాక్షి, వికారాబాద్: పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు ఉపాధ్యాయులు యథేచ్ఛగా వినియోగిస్తుండగా విద్యార్థులు సైతం బడికి తీసుకొస్తున్నారు. సెల్‌ఫోన్ తెచ్చిన వివాదంతో ఓ విద్యార్థిని కనిపించకుండా పోయింది. బాలిక ఫోన్ ఆపహరించిందని ఉపాధ్యాయులు నిందించడంతో మనోవేదనకు గురై అదృశ్యమైంది. ఆమె ఇల్లు విడిచి వెళ్లి నాలుగు రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జాడ లేకుండా పోయింది. ఈ విషయమై బాధితురాలి తల్లిదండ్రులు తాండూరు పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాండూరు మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో నివాసం ఉంటున్న రమేష్ కూతురు సాయిపూర్ ప్రాంతంలోని నెంబర్–1 ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలలో సెల్‌ఫోన్ వినియోగించొద్దనే నిబంధనలు ఉన్నా ఉపాధ్యాయులు, కొందరు విద్యార్థులు సైతం కొంతకాలంగా సెల్‌ఫోన్లు బడికి తీసుకొస్తున్నారు. ఈక్రమంలో గత నెల 25న ప్రభుత్వ నెంబర్– 1 పాఠశాలలో ఓ విద్యార్థి సెల్‌ఫోన్ తీసుకొచ్చింది. అది పోయింది. ఈ విషయమై బాలిక ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఉపాధ్యాయులు 9వ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో విచారించారు.
ఫోన్ ఎవరు తీసుకున్నా వెంటనే తిరిగి ఇచ్చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులు గాలించగా సెల్‌ఫోన్ బాత్రూంలో లభించింది. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌ను ఓ బాలిక దొంగిలించిందని ఆమెపై చోరీ నింద వేశారు. విద్యార్థుల ఎదుటే ఆమెకు చివాట్లు పెట్టారు. అనంతరం సదరు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి చోరీ విషయం చెప్పారు. అనంతరం ఇంటికెళ్లిన బాలికను తల్లిదండ్రులు దండించారు. తాను దొంగతనం చేయలేదని బాలిక చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆమె కోసం రెండు రోజుల పాటు కుటుంబసభ్యులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మిస్సింగ్ కేసు నమోదు..
ప్రభుత్వ నంబర్– 1 పాఠశాలలో జరిగిన సెల్‌ఫోన్ చోరీ వివాదం బాలిక కనిపించకుండా పోయేందుకు కారణమైంది. బాలిక తండ్రి రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ బాలిక మిస్సింగ్ కేసును త్వరగా ఛేదించాలని పట్టణ సీఐ రాజేందర్‌రెడ్డిని ఆదేశించారు. బాలిక ఎవరైనా తమ బంధువుల ఇంట్లో తలదాచుకుందా.. లేదా ఇతర ప్రాంతాలకు రైలులో ఏమైనా వెళ్లిందా అనే కోణాల్లోనూ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment