సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్థి ఎవరనే విషయంలో ఇప్పటికీ స్పష్టత ఇవ్వడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలు గడువు ఈనెల 30తో ముగియనున్న సం గతి తెలిసిందే. నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఉన్న ఓట్లను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేయడంపై టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. బీసీ సామాజికవర్గానికే టికెట్ ఖాయమనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో, నియోజక వర్గంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్న యాదవ సామాజికవర్గానికే టికెట్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. కాంగ్రెస్ మాజీ మంత్రి జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయగా, బీజేపీ తమ అభ్యర్థిపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యం లోనే చివరి నిమిషంలో అభ్యర్థిని ప్రకటించాలనే యోచనలో అధినేత కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.
రేసులో నోముల భగత్ తదితరులు
దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌తో పాటు అదే సామాజికవర్గానికి చెందిన రంజిత్ యాదవ్, గురువయ్య యాదవ్, దూది మెట్ల బాలరాజు యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన వారు టికెట్ రేసులో ఉండటంతో, ఏ ఒక్కరికి టికెట్ ఇచ్చినా మిగతా వారు చేజారకుండా టీఆర్‌ఎస్ జాగ్రత్తలు తీసుకుం టోంది. అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతల అభిప్రాయాలను కేసీఆర్ ఇప్పటికే సేకరించారు. నోముల భగత్‌కు మినహా ఎవరికి టికెట్ దక్కినా అది అనూహ్యమేనని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
ముమ్మరంగా ప్రచారం
గత ఏడాది డిసెంబర్ నుంచే స్థానికంగా పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంపై దృష్టి సారించిన టీఆర్‌ఎస్, ప్రస్తుతం అభ్యర్థిని ప్రకటించకుండానే పూర్తి స్థాయిలో ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహి స్తోంది. గత నెల 10న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు హాలియాలో బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా కేసీఆర్ టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. ప్రైవేటు సంస్థల సర్వేతో పాటు వివిధ వర్గాల నుంచి అందుతున్న నివేదికల ఆధారంగా ఆ పార్టీ ఎప్పటికప్పుడు తన ఎన్నికల ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు సుమారు మూడు నెలలుగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే మకాం వేసి పార్టీ పరిస్థితిని ఎప్పటికప్పుడు అధినేతకు వివరించడంతో పాటు, పార్టీ వ్యూహాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయడంలో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు.
15 రోజులుగా ఎమ్మెల్యేల మకాం
ఉప ఎన్నిక షెడ్యూల్ వెలువడక ముందే క్షేత్ర స్థాయిలో ప్రచారం కోసం ఇన్‌చార్జిలుగా నియమితులైన ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పదిహేను రోజులుగా సాగర్ నియోజకవర్గంలో తమకు బాధ్యతలు అప్పగించిన చోట ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, కోణప్ప, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, రవీంద్రకుమార్, కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ జీవీ రామకృష్ణారావు తమ నియోజకవర్గాలకు చెందిన నేతలు, క్రియాశీల కార్యకర్తలతో బృందాలుగా ఏర్పడి ప్రచారం చేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సైతం వీరు దూరంగా ఉండటం గమనార్హం.
సామాజికవర్గాల వారీగా సమావేశాలు
2.17 లక్షల ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ప్రధానంగా యాదవ, లంబాడీ, రెడ్డి, మాదిగ, మాల, ముస్లిం, ముదిరాజ్, గౌడ, రజక, మున్నూరుకాపు సామాజికవర్గాలకు చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్‌చార్జిలు సామాజికవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ అభ్యర్థి ఎవరనే అంశంతో సంబంధం లేకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. శుక్రవారంతో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment