
సాక్షి, హైదరాబాద్: పోడు దరఖాస్తుల స్వీకరణకు జిల్లాల స్థాయిలో కాకుండా రాష్ట్రం మొత్తానికి వర్తించేలా ఒకే నోటిఫికేషన్ జారీ చేయాలని, అర్హులైన పోడుదారులందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారంఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. పోడు సాగుదారుల హక్కులను గుర్తించేందుకు నవంబర్ 8 నుంచి డిసెంబర్ 8 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని ప్రకటించడాన్ని హర్షిస్తున్నట్లు తెలిపారు.
అయితే ఇందుకోసం రాష్ట్రం మొత్తం వర్తించేలా నోటిఫికేషన్ ఇస్తేనే పోడుదారులకు న్యాయం జరుగుతుందన్నారు. అలా కాకుండా కేవలం కొన్ని జిల్లాలకే ఇవ్వాలనుకోవడం సరికాదన్నారు. ఈ విషయంలో గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని కోరారు. అడవి మధ్యలో పోడు చేస్తున్నవారికి సైతం అక్కడే హక్కులు కల్పించాలని, అటవీ హక్కుల గుర్తింపు చట్టంలో ఈ అంశం స్పష్టంగా ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఇంకా 7 లక్షలకు పైగా ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాల్సి ఉందని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారని గుర్తు చేశారు. కానీ ఇటీవల జరిగిన అధికారుల సమావేశంలో 3.3 లక్షల ఎకరాలకు మాత్రమే హక్కులు కల్పించనున్నట్లు చెప్పారని, ఇది పోడు సాగుదారులను మోసం చేయడమేనని తమ్మినేని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అటవీ రక్షణ పేరుతో గిరిజనులు, పేదలకు దక్కాల్సిన హక్కులను నిరాకరించడం సరైంది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment