
సాక్షి, హైదరాబాద్: శ్రీశ్రీ అనగానే.. తెలుగు సాహిత్యంలో ఉడుకునెత్తురు కనిపిస్తుంది... దేవులపల్లి కృష్ణశాస్త్రి పేరు తలచుకోగానే సుమధుర సంగీతంలో ఓలలాడిన అమ్మభాష సాక్షాత్కరిస్తుంది... రావూరి భరద్వాజ పేరు చెబితే ‘అఆ’లలో కష్టజీవుల చెమట చుక్కలు స్ఫురిస్తాయి. వీరంతా ఓ వీధివారు కాదు, ఓ ఊరి వారూ కాదు.. కానీ వీరిని ‘రేడియో’అక్కున చేర్చుకుంది. వారి సాహిత్య పరిమళాలను తెలుగు భాషాభిమానులకు చేర్చింది. చాలామందికి ఈ విషయాలు తెలియకపోవచ్చు. కానీ, ఒకప్పుడు ఆ సాహితీమూర్తుల మాటల్లో పల్లవించిన భాషావైభవ ప్రత్యేకతలను నలుచెరగులా రేడియో చేర్చిన తీరును సాహితీ అభిమానులు కళ్లకు కట్టారు. ‘తానా’ఆధ్వర్యంలో ‘ప్రసార సాహితి’పేరుతో ఆదివారం ఆన్‌లైన్ ద్వారా రెండున్నర గంటల పాటు చర్చాకార్యక్రమం కొనసాగింది.
ఆకాశవాణిలో పనిచేస్తూ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసేందుకు కృషి చేసిన ప్రముఖుల సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. తానా కన్వీనర్ తోటకూర ప్రసాద్, అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, సమన్వయకర్త చిగురుమళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాగిన ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా, శ్రీశ్రీ , దేవులపల్లి కృష్ణశాస్త్రి, రావూరి భరద్వాజ, బాలాంత్రపు రజనీకాంతరావు, గోపీచంద్, గొల్లపూడి మారుతీరావు, జగ్గయ్య, ఆచంట జానకీరామ్, తురగా జానకి సహా 160 మంది మహనీయుల సేవలు ప్రస్తావించారు. ఆకాశవాణి విశ్రాంత వ్యాఖ్యాత మడిపల్లి దక్షిణామూర్తి అనుసంధానకర్తగా వ్యవహరించారు. అనంత పద్మనాభరావు, గోపాలకృష్ణ, సుభాన్, అనిల్‌ప్రసాద్ సహా పలువురు ఆకాశవాణి ప్రస్తుత, విశ్రాంత సిబ్బంది వివిధ దేశాల నుంచి పాల్గొన్నారు. లాక్‌డౌన్ పరిస్థితులు అన్ని ప్రాంతాల్లోనూ ఉన్న సమయంలో తెలుగు సాహిత్యానికి సంబంధించిన కార్యక్రమాలను ఆన్‌లైన్ వేదికగా తానా నిర్వహిస్తోంది. ప్రతినెలా చివరి ఆదివారం ఆన్‌లైన్ వేదికగా సాహితీ ప్రియులను అనుసంధానిస్తూ వీటిని జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment