సాక్షి, సిద్దిపేట: ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అభివద్ధి చూసి తాము ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు పేర్కొనడం సంతోషంగా ఉందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకు నియోజకవర్గంలో మంత్రి శుక్రవారం పర్యటించారు. జిల్లాలోని రాయపోలు మండలం దుబ్బాక ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలుపుతూ గ్రామస్తులు తీసుకున్న ఏకగ్రీవ తీర్మాణ పత్రాన్ని ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్, గ్రామస్తులు మంత్రికి అందించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, అప్యాయత జీవితంలో మర్చిపోను అన్నారు. వర్షంలో సైతం మహిళలు, వృద్ధులు, యువకులు అంతా కలిసి ఆదరించినందుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నన్నారు. కేసీర్ కృషి వల్ల కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసుకున్నామని, వివిధ సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడమే సీఎం ధ్యేయమన్నారు.
(చదవండి: రూ.10,095 కోట్లకేంద్ర నిధులు పెండింగ్)
4 గంటలే ఉచితంగా కరెంట్ ఇస్తూ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేద్దామని, వ్యవసాయానికి మీటరు పెట్టి బిల్లులు వసూలు చేసే బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుదామని మంత్రి పిలుపునిచ్చారు. రైతులకు రైతుబందు ద్వారా ఎకరాకు 5 వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించి, రైతు భీమా ద్వారా అకాల మరణం చెందిన కూడా 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. కరోనా కష్ట కాలంలో కూడా రైతు పండించిన ప్రతి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల బ్యాంకు ఖాతాలలో డబ్బులు జమ చేసిందన్నారు. వితంతువులకు, వృద్దులకు, బీడీ కార్మికులకు, వివిధ రకాల కుల వృత్తుల వారికి కూడా పెన్షన్లు కలిపిస్తున్న ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment