
సాక్షి, హైదరాబాద్: భారత్‌ను కుల, మత, ప్రాంత, భాష, వర్ణ, జాతి ఆధారంగా విడదీయాలని చూస్తున్న విభజన శక్తులతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మనదేశం 75వ స్వాతంత్య్ర సంబరాలు జరుపుకుంటున్న తరుణంలో ఆ జాతివ్యతిరేక శక్తులను తుదముట్టించడం ద్వారా దేశ ఐకమత్యాన్ని ప్రతిఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు.
శ్రీ అరబిందో 150వ జయంత్యుత్సవాల ప్రారంభ సూచకంగా శనివారం హైదరాబాద్‌లో అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ప్రదర్శనను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా అరబిందోకు ఆయన నివాళులర్పించారు. భిన్నత్వంలో ఏకత్వమే భారత్ ప్రత్యేకత అని ఉపరాష్ట్రపతి గుర్తుచేస్తూ, యువత దేశంలో శాంతి, సామరస్యాలను కాపాడాలని పిలుపునిచ్చారు. భారత సంస్కృతికి మన ఆధ్యాత్మికతే మూలమని, దీని ద్వారా ప్రపంచానికి వెలుగులు పంచేందుకు శ్రీ అరబిందో విశేషమైన కృషిచేశారన్నారు.
పాశ్చాత్య పద్ధతులను అనుసరించేకంటే మనవైన ఆలోచనలతో ముందుకెళ్లడమే మన అస్తిత్వాన్ని ఘనంగా ప్రపంచానికి చాటిచెబుతుందన్నారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీరామచంద్రుడు తేజావత్, మణిపూర్ వర్సిటీ వీసీ ఆచార్య తిరుపతిరావు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment