పార్లమెంట్ భవనం ఎదుట ఫౌంటెయిన్
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: గంభీరంగా కనిపించే పార్లమెంటు భవన సముదాయం ముందు రాచఠీవీ ఒలకబోస్తూ నీటిని విరజిమ్మే 50 అడుగుల ఎత్తున్న ఫౌంటెయిన్ నమూనా తెలంగాణ కొత్త సచివాలయం ముందు సాక్షాత్కారం కానుంది. ఆ ఫౌంటెయిన్ నమూనాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఆసక్తి చూపటంతో అదే డిజైన్‌తో కొత్త సచివాలయ ప్రాంగణంలో ఫౌంటెయిన్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే పార్లమెంటు భవనం ఎదుట పచ్చిక మైదానంలో ఒకటే ఫౌంటెయిన్ ఉండగా, సచివాలయ ప్రాంగణంలో ఒకే తరహావి రెండు ఏర్పాటు కానున్నాయి. అక్కడ 50 అడుగుల ఎత్తుంటే ఇక్కడ మాత్రం 16 అడుగుల ఎత్తుతో రూపుదిద్దుకోనున్నాయి. ఈ మేరకు ఢిల్లీ పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్ నిర్మాణాలను రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆ శాఖ ఈఎన్‌సీ గణపతిరెడ్డి, ఈఈ శశిధర్, ఆర్కిటెక్ట్ ఆస్కార్, నిర్మాణ సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ ప్రతినిధి లక్ష్మణ్‌లతో కలసి పరిశీలించారు.
ధోల్పూర్ ఎర్ర రాయి వినియోగం..
పార్లమెంటు భవనం ముందున్న ఫౌంటెయిన్‌కు రాజస్తాన్‌లోని ప్రఖ్యాత ధోల్పూర్ ఎర్ర ఇసుక రాతిని వినియోగించారు. అదే రాయిని తెలంగాణ సచివాలయ ఫౌంటెయిన్‌కు కూడా వాడనున్నారు. ఈ రాతితో ఇటీవల పట్నాలో అదే నమూనా ఫౌంటెయిన్‌ను రూపొందించిన శిల్పిని కూడా అధికారులు పిలిపించి దీనిపై మాట్లాడారు. సచివాలయ ఫౌంటెయిన్ తయారీ బాధ్యత కూడా అతనికే అప్పగించాలని భావిస్తున్నారు.
పార్లమెంట్ భవనం వద్ద మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఇతర అధికారులు
‘రీజనల్ రింగ్ రోడ్డు’మంజూరు చేయండి..
ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సెక్రటరీ గిరిధర్‌ను మంత్రి ప్రశాంత్‌రెడ్డి కలిశారు. తెలంగాణకు నూతన జాతీ య రహదారులు, రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు మంజూరు చేయాలని ఆయనను మంత్రి కోరారు. హైదరాబాద్‌కు ఉత్తరాన ఉన్న బోయిన్‌పల్లి–మేడ్చల్ మధ్య, దక్షిణాన ఉన్న శంషాబాద్–కొత్తూరు మధ్య రహదారులను మెరుగుపర్చే అంశం ప్రస్తుతం జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ వద్ద పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. కల్వకుర్తి–నంద్యాల మధ్య నూతన జాతీయ రహదారి ప్రాజెక్టుకు ఆమోదం తెలిపినందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి గడ్కరీ, శాఖ సెక్రటరీ గిరిధర్‌కు ప్రశాంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
నేరుగా ధోల్పూర్ క్వారీ నుంచి రాయి..
సచివాలయ భవనం దిగువ భాగానికి ధోల్పూర్ ఎర్రరాతి ఫలకాలనే ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. ఈ భవన ఆకృతిపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలోనే ఈమేరకు నిర్ణయించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు రాజస్తాన్‌లోని ధోల్పూర్‌లో ఉన్న క్వారీల నుంచి నేరుగా ఆ రాయికి ఆర్డర్ ఇవ్వనున్నారు. ఈమేరకు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు ధోల్పూర్ వెళ్లారు. సచివాలయ భవనానికి 2 వేల క్యూబిక్ మీటర్ల మేర ధోల్పూర్ ఎర్ర రాతి ఫలకాలను, గోడలు, ఫుట్‌పాత్‌లకు ధోల్పూర్ క్వారీలో లభిం చే లేత గోధుమ రంగు రాయిని వినియోగించనున్నారు. దాదాపు లక్ష చదరపు అడుగుల మేర ఆ రాతిని వినియోగించనున్నారు. కావాల్సిన రాతిని నేరుగా క్వారీలకే ఆర్డర్ ఇచ్చి తెప్పించనున్నారు. దీనివల్ల నాణ్యమైన రాయి వస్తుందని అధికారులు చెబుతున్నారు. అంతకుముందు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, అధికారులు.. ఢిల్లీలోని పార్లమెంటు, నార్త్‌బ్లాక్, సౌత్‌బ్లాక్, రాష్ట్రపతి భవనం, అశోకా హాల్‌లను సందర్శించారు. ఈ భవనాలకు ఆ ఎర్ర రాయినే వినియోగించటంతో వాటి నిర్మాణ ప్రత్యేకతలను పరిశీలించారు. శని, ఆదివారాల్లో ఆగ్రా ఎర్రకోట, తాజ్‌మహల్, ధో ల్పూర్, కరోలీ క్వారీలను పరిశీలించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment