మాట్లాడుతున్న ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్. పక్కన ఎంపీ బినోయ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రజా క్షేత్రంలో దోషిగా నిలబెడతామని ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్ చెప్పారు. ప్రణాళికా సంఘాన్ని పాతరపెట్టి నీతి ఆయోగ్ ఏర్పాటు చేసి అందులో కార్పొరేట్ శక్తులను సభ్యులుగా నియమించారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శ్రామిక తిరోగమన విధానాలను తిప్పికొట్టేందుకు కార్మిక హక్కులను పరిరక్షించేందుకు చైతన్యవంతమైన పోరాటాలు సాగించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఆదివారం ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ)జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన ఆన్‌లైన్ బహిరంగ సభలో ఆమె ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. జాతి వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించితేనే కార్మికవర్గం, ప్రజలు విముక్తి అవుతారని చెప్పారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మోదీ పాలనలో నిరుద్యోగుల శాతం 8.1కి చేరుకుందని, వివిధ ప్రభుత్వరంగ శాఖల్లో 9 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని వివరించారు. దేశంలో 40 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన జీవనం సాగిస్తున్నారని కౌర్ ఆవేదన వ్యక్తం చేశారు.
అంతా ప్రైవేట్‌పరమే: ఎంపీ బినోయ్
ఎయిర్ ఇస్రో, రక్షణ, బీమా, బ్యాంకులు ఇలా ప్రతి రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించటం ఎంతవరకు సమంజసమని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సీపీఐ పక్ష నాయకుడు బినోయ్ విశ్వం నిలదీశారు. ఫాసిస్టు భావజాలం కలిగిన ఆర్‌ఎస్‌ఎస్ బాటలోనే బీజేపీ పయనిస్తోందని ఆరోపించారు. వచ్చే మార్చి 29, 30 తేదీల్లో జరుగుతున్న సమ్మెలో కార్మికవర్గం పాల్గొని మోదీకి తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు. సభలో సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ అజీజ్ పాషా, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.బాల్, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు యం.డి.యూసుఫ్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి మొట్టె నర్సింహ, ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, జాతీయ నాయకులు మోహన్, ఓబులేసు, రాజేంద్రన్, విద్యాసాగర్, పీఎం మూర్తి, ప్రేంపావని పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment