సాక్షి, నిజామాబాద్: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయన్నది పెద్దల మాట. కానీ, మనసులు కలిస్తే చాలు.. అనేది ఇప్పటి జనరేషన్‌లో కొంతమంది చెప్తున్న మాట. అందుకే తమ వైవాహిక బంధాలకు కులం, మతం, ప్రాంతం లాంటి పట్టింపులు లేకుండా చూసుకుంటున్నాయి. తాజాగా.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో జరిగిన ఓ వివాహం.. స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. అందుకు కారణం.. అబ్బాయి లోకల్ అయితే.. అమ్మాయి అమెరికా దేశస్థురాలు కావడం!.
విధినిర్వహణలో ఆ ఇద్దరూ పరిచయం అయ్యారు. ఇష్టపడ్డారు. ప్రేమించుకున్నారు. పెళ్లితో ఒక్కటవ్వాలని అనుకున్నారు. పెద్దలకు ఎలా చెప్పాలా? అని మధనపడ్డారు. చివరికి ఎలాగోలా ఒప్పించగలిగారు ఖండాలు, సప్త సముద్రాలు దాటిన ఆ ప్రేమకథ.. చివరకు పెళ్లితో సుఖాంతం అయ్యింది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని గోవిందుపేట్ గ్రామానికి చెందిన మూగ ఆకాష్.. చర్చిఫాదర్లకు క్లాసులు నిర్వహిస్తూ సేవాలందిస్తున్నాడు. ఐదేళ్ల కిందట.. అమెరికాకు చెందిన అలెక్స్ ఓల్సాతో అతనికి పరిచయం ఏర్పడింది. నర్సింగ్ పూర్తి చేసిన ఓల్సా.. భారత్‌లో క్రైస్తవ మిషనరీల్లో నర్సుగా సేవలందిస్తోంది. అయితే ఈ ఇద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఐదేళ్ల తర్వాత.. ఎట్టకేలకు తల్లిదండ్రులను ఒప్పించలిగారు.
ఇవాళ(మంగళవారం) ఆర్మూర్‌లోని ఒక ఫంక్షన్ హాల్‌లో పద్ధతి ప్రకారం వివాహం చేసుకున్నారు. ఎల్లలు దాటినా ఈప్రేమజంటను ఆశీర్వదించడానికి స్థానికంగా ఉన్న బంధువులతో పాటు.. అమ్మాయి తరుపు విదేశీ బంధువులు కూడా తరలివచ్చారు. ఇష్టపడ్డ తాము పెళ్లితో ఒక్కటి కావడం ఎంతో సంతోషాన్ని పంచిందని చెబుతోంది ఆ జంట. అందుకే ఈ వివాహం స్థానికులను అంతలా ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment