సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో నాలుగు బిల్లులపై మంగళవారం చర్చ జరిగింది. స్టాంపుల రిజిస్ట్రేషన్ చట్టాలకు సంబంధించిన బిల్లు, అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు, జీహెచ్‌ఎంసీ చట్ట సవరణ బిల్లు, క్రిమినల్ ప్రొసీజర్ సవరణ బిల్లును మంత్రులు ప్రవేశపెట్టారు. జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. జీహెచ్ఎంసీ చట్టానికి ప్రభుత్వం పలు సవరణలు చేసింది. ఎన్నికయ్యే ప్రజాప్రతినిధులు పూర్తి బాధ్యతతో ఉండాలని తెలిపింది.. విధులు సక్రమంగా నిర్వర్తించని ప్రజాప్రతినిధులు, అధికారులను తొలగించాలన్నది. పచ్చదనం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలానే హరితహారానికి 10శాతం బడ్జెట్ కేటాయింపుకు సభ ఆమోదం తెలిపింది. వార్డు కమిటీలు ఏర్పాటు, వాటి పని విధానంలో మార్పులును ఆమోదించింది. ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్పుల అభివృద్ధి గురించి చర్చించింది.
ఈ సందర్భంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘గత పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని పట్టించుకోలేదు.150 డివిజన్లలో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని 2015లోనే నిర్ణయించాం. దానికి ఇప్పుడు చట్టసవరణ చేస్తున్నాం. పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకున్నాం. హరితహారానికి 10 శాతం బడ్జెట్ కేటాయించాం. గ్రేటర్ పరిధిలో మొక్కలను పరిరక్షించాలి. ఆ బాధ్యతలు ప్రజాప్రతినిధులు, అధికారులకే కేటాయించాం. నాలుగు రకాల వార్డు కమిటీలను ఏర్పాటు చేయబోతున్నాం. యూత్, సీనియర్ సిటిజన్, మహిళలు, నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేస్తాం. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 వేల మందితో కమిటీలు వేస్తాం. ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. మాట మాటకీ రిజర్వేషన్లు మార్చడం వల్ల సమస్యలొస్తున్నాయి. అందుకోసమే రిజర్వేషన్లను పదేళ్లపాటు ఉంచాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వ సూచనలు తీసుకునే ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించాలి. ఈ మేరకు చట్ట సవరణ చేశాం’ అన్నారు. (చదవండి: అసెంబ్లీ ముట్టడికి యత్నం, ఉద్రిక్తత)
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 33శాతం రిజర్వేషన్లు బలహీనవర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. తెలంగాణలో బీసీలు అధికంగా ఉన్న నేపథ్యంలో...వారికి సమాన ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment