కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో ఉమ్మడిజిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులతో ముచ్చటిస్తున్న సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన గోదావరి పరీవాహక ప్రాంతంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆది, సోమవారాలు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడెం నుంచి భద్రాచలం వరకు ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతాలను ఆయన హెలికాప్టర్ ద్వారా పరిశీలించనున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న సహాయ కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షించనున్నారు. వరదలతో ప్రజలకు జరిగిన కష్టనష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకొని వారికి సాంత్వన కలిగించడానికి పునరావాస, ఇతర ఆర్థిక సాయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. సీఎంతోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సైతం ఏరియల్ సర్వేలో పాల్గొననున్నారు. సీఎం ఆదేశాలతో ఏరియల్ సర్వేకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
భద్రాచలంలో సీఎం సమీక్ష..
సీఎం కేసీఆర్ శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వరంగల్‌కు చేరుకొని అక్కడ వరద పరిస్థితులపై స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆదివారం ఉదయం ఆయన వరంగల్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి భద్రాచలం వరకు ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఈ క్రమంలో ఆయన పలుచోట్ల హెలికాప్టర్ నుంచి కిందికి దిగి వరద బాధితులను పరామర్శించి వారికి భరోసా ఇవ్వనున్నారు. ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించి అక్కడ జరిగిన నష్టం, చేపడుతున్న సహాయక చర్యలపై స్థానిక మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయనున్నారు. అక్కడి నుంచి ఏటూరునాగారం ప్రాంతంలో ఏరియల్ సర్వే చేపట్టి అక్కడ కూడా వరద సహాయక చర్యలపై సమీక్షించనున్నారు. సోమవారం ఎస్సారెస్పీ, కడెం, కాళేశ్వరం తదితర ముంపు ప్రాంతాల మీదుగా ఏరియల్ సర్వే చేపట్టనున్నారు.
ముంపు గ్రామాల్లో వైద్య శిబిరాలు..
గోదావరి పరీవాహకంలోని వరద ముంపు ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ముంపు ప్రాంత ఆస్పత్రుల వైద్యులు, ఉన్నతాధికారులతో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షించారు. నేటి పర్యటనకు సంబంధించిన కార్యాచరణపై సమీక్షలో చర్చించారు. ముంపు గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని హరీశ్‌రావు ఆదేశించారు. వైద్యులంతా తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపుల్లో వైద్య పరీక్షల సదుపాయంతోపాటు మందులను అందుబాటులో ఉంచాలన్నారు. కొత్తగూడెం కేంద్రంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, మంచిర్యాల కేంద్రంగా మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ రమేశ్‌రెడ్డి వైద్య శిబిరాలతోపాటు ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పర్యవేక్షించాలని మంత్రి ఆదేశించారు.
వరదలపై శాశ్వత ప్రణాళిక: సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఏటా గోదావరి భారీ వరదల నుంచి పరీవాహక ప్రాంత ప్రజలను శాశ్వతంగా రక్షించడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వర్షాలు, వరదలు రావడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని, భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇరిగేషన్ శాఖలో పనిచేసి రిటైరైన ఇంజనీర్ల సలహాలు తీసుకుంటామన్నారు. గోదావరి వరద పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించడంలో భాగంగా శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగంతో కలిసి రోడ్డు మార్గంలో హనుమకొండకు చేరుకున్నారు.
మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఇంట్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి, ఇతర ఉపనదుల వరద ప్రవాహం, కాంటూర్ లెవల్స్, కరకట్టల నాణ్యత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు అత్యవసర సహాయం కోసం కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, నిర్మల్, జిల్లాల కలెక్టర్లకు రూ. కోటి చొప్పున వెంటనే నిధులు విడుదల చేయాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావును ఆదేశించారు. మందులు, ఆహారం అందిస్తూ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్, ఎంపీలు పసునూరి దయాకర్, జోగినిపల్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment