కీరవాణి వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్‌ | Telangana CM Revanth Reddy Reacts On Keeravani Controversy for State song | Sakshi
Sakshi News home page

జయ జయహే తెలంగాణ: కీరవాణి వివాదంపై సీఎం రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

Published Tue, May 28 2024 1:37 PM | Last Updated on Tue, May 28 2024 4:16 PM

Telangana CM Revanth Reddy Reacts On Keeravani Controversy for State song

ఢిల్లీ, సాక్షి: స్వల్ప మార్పులతో ‘జయ జయహే తెలంగాణ..’ గేయాన్ని రూపకల్పన చేసే ప్రయత్నాల్లో ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఇందుకు సంగీత స్వరకల్పన కోసం ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని ఎంచుకోవడంపై వివాదం రాజుకుంది. ఈ వివాదంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్పందించారు. 

హస్తిన పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.  ఈ సందర్భంగా కీరవాణిని ఎంపిక చేసిన వివాదంపై స్పందించారు. ‘‘కీరవాణి వ్యవహారంతో నాకు సంబంధం లేదు. జయజయహే తెలంగాణ పాట రాసిన అందెశ్రీకే రూపకల్పన బాధ్యతలు ఇచ్చాం. తెలంగాణ గేయానికి సంగీతం సమకూర్చడం సహా మొత్తం వ్యవహారాన్ని ఆయనకే అప్పగించాం. కీరవాణిని అందెశ్రీయే ఎంపిక చేశారు. సంగీత దర్శకుడి ఎంపికలో నా పాత్రేమీ లేదు. ఎవరితో సంగీతం చేయించుకోవలనేది అందే శ్రీ నిర్ణయనికే వదిలేశా’’ అని వివరణ ఇచ్చారు. 

👉::అత్యంత పారదర్శకంగా నా పాలన సాగుతోంది. ప్రత్యర్థి పార్టీలు విమర్శించే అవకాశం కూడా ఇవ్వలేదు. రాష్ట్రంలో విద్యుత్  సమస్యలేదు,కోతలు లేవు.. కొన్ని చోట్ల వర్షాల కారణంగా సదుపాయాలలో అవాంతరాలు మాత్రం నెలకొన్నాయి. పక్క రాష్ట్రంలో పోలీసు అధికారులందరినీ కూడా ఎన్నికల సమయంలో ట్రాన్స్ఫర్ చేశారు. తెలంగాణలో ఎలాంటి ట్రాన్స్ఫర్ లేకుండా ఎన్నికల జరిగాయి. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు ఎలాంటి ఆరోపణలు చేయలేదు. పూర్తి స్వేచ్ఛాయుత వాతావరణం లో రాష్ట్రంలో ఎన్నికల నిర్వహించాం. ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేశామని ఆరోపణలు ప్రతిపక్షాలు సైతం చేయలేదు.

👉::కాళేశ్వరం విషయంలో నిపుణులు తేల్చిందే పరిగణలోకి తీసుకుంటా. దాని ఆధారంగానే ముందుకు వెళతాం. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ నివేదిక తర్వాత నిర్ణయం తీసుకుంటాం. మేడిగడ్డ ప్రాజెక్టు వెన్నుముక్క విరిగిందని నేను ముందే చెప్పాను. గత ప్రభుత్వం ఎత్తిన నీళ్లను సముద్రంలోకి విడిచారు. సముద్రంలో పోసిన నీళ్లకు కరెంట్ బిల్లు కట్టాం.

👉::ఫోన్ ట్యాపింగ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు, హార్డ్ డిస్క్ లను ధ్వంసం చేశారు. ప్రభుత్వం ఇంకా రివ్యూ చెయ్యలేదు. ఎన్నికల కోడ్ రాష్ట్రంలో ఉన్నందున ఫోన్ టాపింగ్ పై సమీక్ష జరపలేదు. ప్రస్తుతం ఈ అంశాన్ని అధికారులే చూసుకుంటున్నారు. బ్యాకప్ డేటాకు సంబంధించిన హార్డ్ డిస్కులు ఫామ్ హౌస్ లో ఉందో ఎక్కడ ఉందో విచారణ అధికారులు తేల్చాల్సి ఉంది. ఫోన్‌ట్యాపింగ్‌ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయించడం లేదు. అలాంటి పనులు కూడా చేయను నేను. అన్నింటికీ సీబీఐ విచారణ కోరే హరీష్ రావు కేటీఆర్, ఫోన్ ట్యాపింగ్‌ అంశాన్ని మాత్రం సీబీఐకి ఇవ్వాలని  ఎందుకు అడగడం లేదు. కేసీఆర్ అసెంబ్లీ కి వస్తే చాలా విషయాలు ఆయనతో చర్చించేది ఉంది. 

👉::తెలంగాణ అంటేనే రాచరికనికి వ్యతిరేకం. త్యాగాలు, పొరటాలు గుర్తొస్తాయి. అవే గుర్తుకు వచ్చేలా చిహ్నం, గేయం రూపొందిస్తున్నాం. రాజముద్ర రూపకల్పన బాధ్యత  ఫైన్ ఆర్ట్ కాలేజ్ ప్రిన్సిపల్ కు ఇచ్చాం, ఆయన తెలంగాణ నిజామాబాద్ బిడ్డ. అధికారిక చిహ్నం లో కాకతీయ తోరణం ఉండదు. సమ్మక్క, సారక్క - నాగోబా జాతర స్ఫూర్తి  ప్రతీకలకి అద్దం పట్టేలా చిహ్నం ఉండనుంది. పోరాటాలు, త్యాగాలకు ప్రతిబింబంగా అధికారిక చిహ్నం ఉంటుంది. 

తెలంగాణ అధికారిక చిహ్నంలో కాకతీయ తోరణం ఉండదు..

కీరవాణి వివాదం
అందెశ్రీ రాసిన పాట‌ని తెలంగాణ రాష్ట్ర గీతంగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. అయితే సాహిత్యంలో స్వల్ప మార్పుల అనంతరం.. ఈ పాట‌ని స్వ‌ర ప‌రిచే అవ‌కాశం కీర‌వాణికి అప్ప‌గించారు. ఆ తర్వాత రాయదుర్గంలోని ఎంఎం కీరవాణి స్టూడియోను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఆ ఫొటోలు బయటకు రావడంతో.. అసలు రచ్చ మొదలైంది. 

 

 

ఆంధ్రాకు చెందిన కీరవాణి వద్దంటూ.. తెలంగాణ సినీ సంగీత సంఘం ఏకంగా సీఎం రేవంత్‌కు ఓ లేఖ రాసింది.  ఒకవైపు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లాంటి వాళ్లు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే ఉన్నట్లు తాజాగా సీఎం రేవంత్‌ వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement