సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమంలో తెలంగాణ ప్రభుత్వం దూసుకెళ్తోంది. ప్రజలతో మమేకమయ్యేందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలను ఎంచుకుంటోంది. ఇందుకు ఐటీ శాఖకు అనుబంధంగా డిజిటల్ మీడియా విభాగాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఇన్‌ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసీటీ) విప్లవాన్ని ఉపయోగించుకుని ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)తో పాటు మంత్రులు, ప్రభుత్వ విభాగాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల వివరాలను ప్రజలకు చేరవేస్తోంది. సీఎం కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొనే కార్యక్రమాలను ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ద్వారా రాష్ట్ర డిజిటల్ మీడియా విభాగం ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. ఇప్పటివరకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు సంబంధించి సుమారు 120 కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
డిజిటల్ మీడియాతో చేరువ..
దేశ జనాభాలో సుమారు 60 కోట్ల మంది ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తుండగా, 45 కోట్ల మంది చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. సంప్రదాయ ప్రచార, ప్రసార సాధనాలు పత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాలతో పోలిస్తే సామాజిక మాధ్యమాల్లో సమాచారం విభిన్నంగా ఉంటోంది. దీంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వైపు మొగ్గు చూపేవారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పౌర సమాజంతో పాటు సంస్థలు, సంఘాలు, వ్యక్తులకు మరింత చేరువయ్యేందుకు తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం ప్రయత్నం చేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చే ఆధునిక ప్లాట్‌ఫామ్స్, సాంకేతికత, ప్రభుత్వ పథకాలు, ఇతర అంశాల మీద వలంటీర్లకు శిక్షణ కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్‌లో సీఎంవో, ఐటీ మంత్రి ఖాతాలను డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తోంది. (చదవండి: నగరం నలువైపులా ఐటీ!)
ఫేస్‌బుక్‌లో సీఎంవో టాప్!
దేశంలో ఫేస్‌బుక్ వినియోగిస్తున్న సీఎంవోల జాబితాలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, ఫేస్‌బుక్ ’లైక్స్’లో మాత్రం అగ్రస్థానంలో ఉంది. ట్విట్టర్‌లో తెలంగాణ సీఎంవో ఫాలోవర్స్ సంఖ్య 2015–16లో 2,60,673 మంది ఉండగా, ఈ ఏడాది సెప్టెంబర్ 23 నాటికి 10,06,682కు చేరింది. అదే సమయంలో ఫేస్‌బుక్‌లోనూ 4,20,360 నుంచి 8,37,008కి చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment