సాక్షి, : రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటింది. వానాకాలం సీజన్లో ఇప్పటివరకు 1.02 కోట్ల ఎకరాల్లో పంటల సాగయ్యాయి. దాదాపు నెల రోజుల పాటు కురిసిన భారీ వర్షాలు ఇటీవల తగ్గుముఖం పట్టడంతో రైతులు పంటల సాగును ముమ్మరం చేశారు. దీంతో ఎక్కడికక్కడ విస్తీర్ణం పెరుగుతోంది. సెప్టెంబర్ చివరి వరకు వానాకాలం సీజన్ కొనసాగనున్నందున రైతులు ఇప్పుడు వరి తదితర పంటలపై దృష్టి సారించారు.
ఈ ఏడాది 1.43 కోట్ల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. పత్తి సాగు లక్ష్యం 70 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 48.29 లక్షల ఎకరాల్లో సాగైంది. కంది 15 లక్షల ఎకరాలకు గాను 5.47 లక్షల ఎకరాల్లో, సోయాబీన్ 3.88 లక్షల ఎకరాలకు గాను 3.85 లక్షల ఎకరాల్లో, మొక్కజొన్న 8.18 లక్షల ఎకరాలకు గాను 5.04 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక వరి ప్రతిపాదిత లక్ష్యం 45 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 34.95 లక్షల ఎకరాల్లో సాగు చేసినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
8 జిల్లాల్లో 100%, అంతకు మించి సాగు
రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో వంద శాతానికి మించి పంటలు సాగయ్యాయి. సాధారణ సాగుతో పోలిస్తే మెదక్ జిల్లాలో అత్యధికంగా 116%, మహబూబాబాద్ జిల్లాలో 115% పంటలు సాగయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 109%, కొమురంభీం జిల్లాలో 108%, ఆదిలాబాద్ జిల్లాలో 107%, పెద్దపల్లి జిల్లాలో 104%, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో 100% చొప్పున పంటలు సాగయ్యాయి. అత్యంత తక్కువగా వనపర్తి జిల్లాలో కేవలం 30% విస్తీర్ణంలోనే పంటలు సాగయ్యాయి. ములుగులో 40%, భద్రాద్రి కొత్తగూడెంలో 45%, సూర్యాపేటలో 47% మేరకే పంటలు సాగయ్యాయి. 28 జిల్లాల్లో 50 శాతానికి మించి పంటలు సాగైనట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
పత్తిపై వర్షాల పెను ప్రభావం
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురిసిన వానలు పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. లక్షలాది ఎకరాల్లో నీట మునిగిన పత్తి పంట భారీగా దెబ్బతినగా, మిగిలిన చేన్లు కూడా ఎర్రబారి తెగుళ్లతో సమస్యగా మారుతున్నాయి. గతేడాది పత్తికి మంచి ధర పలకడంతో ఈసారి చాలామంది రైతులు పత్తి సాగుకు మొగ్గు చూపారు. వ్యవసాయశాఖ కూడా సమావేశాలు నిర్వహించి పత్తి సాగు పెంచాలని రైతులను కోరింది.
ఈ మేరకు పత్తి సాగు పెరిగింది అయితే జూలై ప్రారంభం నుంచి మొన్నటివరకు కురిసిన భారీ వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాంతాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల ఎకరాల్లో పత్తి పంట నీట మునిగి దెబ్బతిన్నది. వరుసగా కురిసిన భారీ వర్షాలతో మొదట్లో వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తలేదు. దీంతో రైతులు రెండోసారి వేశారు. అయితే మొక్క ఎదుగుతున్న దశలోనే మళ్లీ వర్షాలు పడడంతో జాలు పట్టిపోయాయి.
ఇక దెబ్బతిన్న పంట పోగా మిగిలిన పత్తి చేన్లలో మొక్క ఎదుగుదల నిలిచిపోయింది. వానలకు చేలలో నీరు నిలిచి పంట ఎదగడం లేదని, కలుపు తీయడం ఇబ్బందికరంగా మారిందని రైతులు వాపోతున్నారు. ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే అవకాశం లేక పత్తి చేన్లను కొందరు రైతులు వదిలేశారు. మరికొందరు పత్తి చేన్లను పూర్తిగా దున్ని మొక్కజొన్న, వరి పంటలను సాగు చేసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment