సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లుగా పొంచి ఉన్న విద్యుత్ చార్జీల బాంబు ఒక్కసారిగా పేలనుంది. పేద, మధ్య తరగతి, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాలపై బాదుడుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరగనుండగా, మే నుంచి కరెంటు బిల్లులు షాక్ కొట్టబోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా రూ.6,831 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు ప్రతిపాదించాయి.
ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీలు పెంచుకో వడానికి అనుమతి కోరా యి. ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఏటా.. ఎల్టీ విభాగంలోని 1.10 కోట్ల గృహాలు, 44 లక్షల గృహేతర కేటగిరీల వినియోగదారులపై 2,110 కోట్లు, హెచ్‌టీ విభాగంలోని అన్ని కేటగిరీలు కలిపి 13,717 మంది వినియోగదారులపై రూ.4,721 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ మేరకు 2022–23కు సంబంధించిన విద్యుత్ చార్జీల పెంపు (టారిఫ్ సవరణ) ప్రతిపాదనలను దక్షిణ/ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల (టీఎస్‌ఎస్పీ డీసీఎల్/టీఎస్‌ఎన్పీడీసీఎల్)
సీఎండీలు జి.రఘుమారెడ్డి, ఎ.గోపాల్‌రావు సోమవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి సమర్పించారు. ఈఆర్సీ చైర్మన్ టి.శ్రీరంగారావు, సభ్యులు ఎండీ.మనోహర్‌రాజు, బండారు కృష్ణయ్యకు ప్రతిపాదనలు అందజేసిన అనంతరం విలేకరులకు వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో వినియోగం తర్వాత మేలో జారీ చేసే బిల్లుల్లో చార్జీల పెంపు ప్రభావం వినియోగదారులకు కనిపించనుంది.
ఆర్థిక లోటు రూ.16,580 కోట్లు
రాష్ట్రంలోని అన్ని వర్గాల వినియోగదారులకు 2022–23లో నిరంతర విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.53,054 కోట్ల వ్యయం కానుందని, ఆమేరకు వార్షిక ఆదాయ అవసరాలుండనున్నట్టు డిస్కంలు అంచనా వేశాయి. ప్రస్తుత విద్యుత్ చార్జీలను యధాతథంగా అమలు చేస్తే రూ.36,474 కోట్ల ఆదాయం మాత్రమే రానుందని, దీంతో రూ.16,580 కోట్ల ఆదాయ లోటు ఉంటుందని నివేదించాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.5,652 కోట్ల మేర సబ్సిడీ సొమ్ము ఇవ్వనుందని, దీంతో మొత్తం ఆదాయం రూ.42,126 కోట్లకు పెరిగి, ఆదాయ లోటు రూ.10,928 కోట్లకు తగ్గుతుందని అంచనా వేశాయి. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా రూ.6,831 కోట్ల అదనపు ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, ఇంకా మిగిలే రూ.4,097 కోట్ల ఆదాయ లోటును అంతర్గత సమర్థత చర్యలు/ ప్రభుత్వ అదనపు మద్దతుతో పూడ్చుకుంటామని ఈఆర్సీకి నివేదించాయి.
ఉచితం, సబ్సిడీ పథకాలు యధాతథం
వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తో పాటు ఎస్సీ, ఎస్టీల గృహాలకు నెలకు ఉచితంగా 101 యూనిట్లు వంటివి యధాతథంగా కొనసాగనున్నాయి. నాయి బ్రాహ్మణుల హెయిర్ సెలూన్లు, రజకుల లాండ్రీ షాపులు, దోభీ ఘాట్లకు నెలకు ఉచితంగా 250 యూనిట్లు, పవర్ లూమ్స్, పౌల్ట్రీలు, స్పిన్నింగ్ మిల్లులకు యూనిట్‌పై రూ.2 చొప్పున సబ్సిడీ వంటి పథకాలు కూడా కొనసాగుతాయని రఘుమారెడ్డి వెల్లడించారు.
ఐదేళ్ల గ్యాప్ తర్వాత 18.72 శాతం పెంపు
తెలంగాణ వచ్చాక తొలిసారిగా 2015–16లో, తర్వాత 2016–17లో విద్యుత్ చార్జీలు పెంచారు. ఆ తర్వాత ఐదేళ్లుగా ఎలాంటి చార్జీలు పెంచలేదు. ప్రస్తుత చార్జీలతో 2022–23లో రూ.36,474 కోట్ల ఆదాయం రానుండగా, రూ.6,831 కోట్ల మేర విద్యుత్ చార్జీలు పెంచాలని డిస్కంలు ప్రతిపాదించాయి. అంటే వినియోగదారులపై 18.72 శాతం అదనపు భారం పడనుందన్నమాట. విద్యుత్ టారిఫ్‌లోని ఎనర్జీ చార్జీల పెంపును మాత్రమే సోమవారం బహిర్గతం చేయగా, ఫిక్స్‌డ్ చార్జీలు ఎంత పెంచబోతున్నారన్న అంశాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఫిక్స్‌డ్ చార్జీలతో సహా మొత్తం రిటైల్ టారిఫ్ షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాతే వినియోగదారులకు సంబంధించిన బిల్లులు ఏ మేరకు పెరగబోతున్నాయన్న అంశంపై స్పష్టత రానుంది.
కొత్తగా లోడ్ చార్జీలు! కిలోవాట్‌కు రూ.15
ఎనర్జీ చార్జీలు, ఫిక్స్‌డ్/డిమాండ్ చార్జీలు కలిపి వినియోగదారులకు బిల్లులను జారీ చేస్తారు. ఇప్పటివరకు గృహ వినియోగదారులపై ఎనర్జీ చార్జీలే విధిస్తుండగా, కొత్తగా వారి లోడ్ సామర్థ్యం ఆధారంగా కిలోవాట్‌కు రూ.15 చొప్పున ఫిక్స్‌డ్/ డిమాండ్ చార్జీలను వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. వాణి జ్య, పరిశ్రమల కేటగిరీలో ఫిక్స్‌డ్ చార్జీల పెంపు నకు కూడా అనుమతి కోరినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment