పవర్‌ కమిషన్‌ కొత్త చైర్మన్‌పై కొనసాగనున్న సస్పెన్స్‌ | Telangana Government Wait Few Days For Power Commission Chairman After SC Orders | Sakshi
Sakshi News home page

పవర్‌ కమిషన్‌ కొత్త చైర్మన్‌పై కొనసాగనున్న సస్పెన్స్‌

Published Tue, Jul 16 2024 2:31 PM | Last Updated on Tue, Jul 16 2024 3:58 PM

Telangana Government Wait Few Days For Power Commission Chairman After SC Orders

ఢిల్లీ, సాక్షి: తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌కు కొత్త  చైర్మన్‌ విషయంలో ఉత్కంఠ కొనసాగనుంది. చైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీం కోర్టు నుంచి ఆదేశాలు వెలువడిన కాసేపటికే కొత్త చైర్మన్‌ పేరును ప్రకటిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ, కాసేపటికే కొత్త పేరును సోమవారం ప్రకటిస్తామని సుప్రీం కోర్టుకు నివేదించింది.

అయితే ప్రస్తుత చైర్మన్‌ జస్టిస్‌ నరసింహారెడ్డి అప్పటిదాకా కొనసాగడానికి కూడా వీల్లేదని, ఆయన కమిటీలోని సభ్యులు కూడా కొనసాగకూడదని సుప్రీం కోర్టు తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఆ సమయంలోనే అనూహ్య పరిణామం చోటు  చేసుకుంది. విచారణ నుంచి తప్పుకొంటున్నట్లు జస్టిస్‌ నర్సింహారెడ్డి  ఆయన రాసిన లేఖ కాపీని సుప్రీంకోర్టుకు ప్రభుత్వ న్యాయవాదులు అందజేశారు. దీంతో కొత్త చైర్మన్‌ను నియమించేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కోర్టు టైమిచ్చింది. అంతేకాదు.. కొత్త జడ్జి, కమిషన్‌ కాలపరిమితి విధానాలను కొత్త నోటిఫికేషన్‌లో వెల్లడించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

అంతకు ముందు.. తెలంగాణలో విద్యుత్‌ ఒప్పందాలపై ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. విచారణ కొనసాగుతున్న టైంలోనే.. కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ నర్సింహారెడ్డి ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది.

సంబంధిత వార్త: పవర్‌ కమిషన్‌కు సుప్రీం షాక్‌

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ నర్సింహారెడ్డితో జ్యుడిషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్‌ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు సైతం విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. 

అయితే ఈ విచారణను సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.  సుప్రీంకోర్టుకు వెళ్లే ముందు హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ అనుకూల ఫలితం రాకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో ఇరుపక్షాల తరఫున సీనియర్‌ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అభిషేక్‌ మనుసింఘ్వీ, సిద్ధార్థ్‌ లూథ్రా.. కేసీఆర్‌ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదించారు. వాదనల అనంతరం విచారణ కమిషన్‌ ఛైర్మన్‌ను మార్చాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది.

పవర్ కమిషన్ కొత్త చైర్మన్ పై కొనసాగుతున్న సస్పెన్స్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement