సాక్షి, హైదరాబాద్: జీవో 111పై దాఖలైన పిటిషన్‌లో రెండు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని, ఇదే చివరి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. 2007లో పిటిషన్ దాఖలు చేస్తే.. ఇప్పటివరకు స్పందించకపోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ పరీవాహక ప్రాంత పరిరక్షణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదంటూ ఫోరం ఫర్ ఏ బెటర్ హైదరా బాద్(ఎన్‌జీవో), ఒమిమ్ మానెక్షా డెబారా పిటిషన్ దాఖలు చేశారు.
జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు రక్షణ కల్పించాల్సి ఉండగా.. ఆక్రమణలు, నిర్మాణాలు చోటుచేసుకున్నాయన్నారు. ఇది జీవో 111ను, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినట్లేనని పేర్కొన్నారు. ఇప్పటివ రకు నిర్మాణాలకు ఇచ్చిన అనుమతులన్నింటినీ రద్దు చేసేలా, కాలుష్యం బారి నుంచి జలాశయాలను రక్షించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరారు.
జీవో 111 వివాదం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఉండగానే ప్రభుత్వం ఆ జీవోను ఎత్తేస్తూ మరో జీవో 69 జారీ చేసిందని, దీనిని కొట్టేయాలని పిటిషనర్ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కేఎస్ మూర్తి వాదనలు వినిపించారు. జీవో 111లోని నిబంధనలు, పరిమితులన్నీ జీవో 69లో పొందిపరిచినట్లు సర్కార్ చెబుతోందని.. అయితే జలాశయాల పరిరక్షణ కోసం నియమించిన కమిటీ సూచనలు అందులో చేర్చలే దన్నారు.
ఈ సూచనలను జీవో 69లో చేర్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా జీవో 111లోని పరిమితులను మార్చవద్దని చెప్పిందని గుర్తు చేశారు. జీవో 69 తేవడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమేనని వెల్లడించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ, కౌంటర్ వేసేందుకు 3 వారాల గడువు కావాలన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. 15 ఏళ్లుగా కౌంటర్ దాఖలు చేయక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్టు ఖర్చుల కింద రూ.25,000 చెల్లిస్తేనే వాయిదాకు అనుమతిస్తామంది. ఈ క్రమంలో హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది రామారావు కలుగజేసుకుని.. జీవో 111ను సవాల్ చేసిన రిట్లతో పాటు ఆ జీవోను రద్దు చేయాలని కోరుతూ కూడా రిట్లు దాఖలయ్యాయని చెప్పా రు. జీవో 69 విషయంలో దాఖలైన ఇంప్లీడ్ పిటిషన్ కూడా ఉందన్నారు. కౌంటర్ వేసేందుకు గడువు ఇవ్వాలని కోరారు. దీంతో 2 వారాల గడువు ఇస్తూ విచారణను సెప్టెంబర్ 14కు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment