సాక్షి, హైదరాబాద్: వ్యాక్సిన్ల కొరత రాష్ట్రంలో టీకాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటివరకు నిరాటంకంగా కొనసాగిన టీకా ప్రక్రియ ఆదివారం నిలిచిపోవడంతో, తమకు వ్యాక్సిన్ అందుతుందో లేదోనని లబ్ధిదారులు అయోమయంలో ఉన్నారు. తొలుత టీకా అంటే అంతగా ఆసక్తి చూపనివారు.. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కోసం ఎగబడటంతో దేశవ్యాప్తంగా వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది.
ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడంతో అవసరాల మేరకు టీకాలు సరఫరా చేయడం కేంద్రానికి కూడా ఇబ్బందిగానే మారింది. అయితే ఆదివారం కేంద్రం నుంచి రాష్ట్రానికి 2.70 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో సోమవారం టీకా కార్యక్రమం కొనసాగనుంది. కానీ ప్రస్తుతం వచ్చిన టీకాలు ఏమూలకూ సరిపోవని ప్రస్తుత రోజువారీ టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తే అర్థం అవుతుంది. ఈ పరిస్థితుల్లో కొత్త వారికి మొదటి డోస్ నిరాటంకంగా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే రెండో డోస్ వారికి గడువులోగా టీకాలు ఇవ్వాల్సి ఉండటంతో ఏంచేయాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది.
18 లక్షల టీకాలు అవసరం
గత వారం రోజులుగా రోజుకు సరాసరి లక్షన్నర టీకాలు వేస్తున్నారు. ఒకరోజైతే మొదటి, రెండో డోస్ కలిపి దాదాపు 1.67 లక్షల వరకు కూడా వేశారు. జనవరి 16వ తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 29,59,334 కరోనా టీకాలు వేశారు. అందులో 25,90,245 మందికి మొదటి డోస్ వేయగా, 3,69,089 మందికి రెండో డోస్ వేశారు. వైద్య సిబ్బందిలో 2,35,030 మంది మొదటి డోస్ తీసుకోగా, ఇప్పటివరకు 1,75,560 మంది రెండో డోస్ తీసుకున్నారు. మిగిలిన వారికి మొదటి డోస్ వేసి కూడా రెండు నెలలు దాటింది. దీంతో వారిలో చాలామంది రెండో డోస్ తీసుకోవాల్సి వుంది. అలాగే ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 2,08,111 మంది మొదటి డోస్ తీసుకోగా, అందులో ఇప్పటివరకు 74,651 మంది రెండో డోస్ కూడా తీసుకున్నారు. ఇక 45 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 21,55,881 మంది మొదటి డోస్ తీసుకున్నారు. అందులో 1,10,101 మంది రెండో డోస్ కూడా తీసుకున్నారు.
రెండో డోస్ కోసం డిమాండ్
వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో రెండో డోస్ తీసుకునేవారి సమయం ఎప్పుడో గడిచిపోయింది. వారిలో ఇప్పుడు చాలామంది రెండో డోస్ కోసం వస్తున్నారు. ఇక 45 ఏళ్లు పైబడిన వారు కూడా ప్రతీ రోజూ రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే పది రోజుల్లో రోజుకు సరాసరి మొదటి డోస్ తీసుకునేవారు లక్షన్నర మంది, రెండో డోస్ తీసుకునేవారు సరాసరి దాదాపు 30 వేల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం వచ్చే పది రోజుల్లో 18 లక్షల టీకాలు అవసరం అవుతాయని వైద్య ఆరోగ్యశాఖ అంచనా వేసింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన టీకాలు కేవలం 2.70 లక్షలు మాత్రమే.
ఈ పరిస్థితుల్లో వీటిని రెండో డోస్‌కు కేటాయించినా పదిరోజులకు పూర్తిస్థాయిలో సరిపోవని అధికారులు అంటున్నారు. అయితే రెండో డోస్ గడువులోగా ఇవ్వాల్సి ఉండటంతో మొదటి డోస్ టీకా కార్యక్రమం కొంత నెమ్మదించే సూచనలు కన్పిస్తున్నాయి. తాజాగా వచ్చిన టీకాలు, స్వల్ప సంఖ్యలో నిల్వ ఉన్న టీకాలు కలిపితే.. ఎప్పటిలాగే అయితే రెండురోజులకు ఇవి సరిపోతాయి. కానీ నిర్ణీత సమయంలో రెండో డోస్ టీకా వేయకుంటే మొదటి డోస్ వేసుకుని ప్రయోజనం ఉండదు కాబట్టి, రెండో డోస్‌ను నిరంతరాయంగా కొనసాగించేలా దీనికి ప్రాధాన్యమిస్తూ టీకా కార్యక్రమాన్ని కొనసాగించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఒకవేళ కేంద్రం అవసరమైన మేరకు పంపిస్తే మొదటి డోస్ ప్రక్రియ కూడా పూర్తిస్తాయిలో కొనసాగించ వచ్చని భావిస్తోంది.
ఎప్పుడెన్ని వస్తాయో తెలియదు
ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడెన్ని టీకాలు వస్తాయో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు స్పష్టత లేదు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 1,147 చోట్ల, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 225 చోట్ల టీకాలు వేస్తున్నారు. వాటిని ఏకంగా రెండు వేల వరకు పెంచి రోజుకు అవసరమైతే రెండున్నర లక్షల టీకాలు వేసేలా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ గతంలో ప్రణాళిక రచించింది. కానీ ఇప్పుడు ఉన్న సెంటర్లలోనే టీకాల కార్యక్రమం నిరాటంకంగా కొనసాగించే సూచనలు కన్పించడం లేదు. శనివారం ఒక్కరోజు 1,39,994 టీకాలు వేయగా, రెండో డోస్ కింద 10,470 వేశారు. మున్ముందు 45 ఏళ్లు పైబడినవారిలో ఎక్కువ మంది రెండో డోస్ కోసం సిద్ధం అయ్యే అవకాశాలున్నాయి
టీకాలు ఇలా..
- రాష్ట్రంలో ఇప్పటివరకు 24,55,314 కోవిషీల్డ్ టీకాలు వేశారు. అలాగే 5,04,020 కోవాగ్జిన్ టీకాలు వేశారు.
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారిలో పురుషులు 13,58,965 మంది ఉండగా, మహిళలు 12,33,337 మంది ఉన్నారు. ఇతరులు 434 మంది ఉన్నారు.
- అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 4,69,602 మందికి టీకా వేశారు. రంగారెడ్డి జిల్లాలో 2,59,355 మంది, మేడ్చల్ జిల్లాలో 2,55,114 మంది, యాదాద్రి జిల్లాలో 1,02,913 మంది టీకా పొందారు.
వయస్సుల వారీగా టీకా వివరాలు
వయస్సు సంఖ్య
18–25 45,364
25–40 2,59,890
40–60 12,91,555
60 ఏళ్లు పైబడినవారు 9,95,927
రాష్ట్రానికి 2.70 లక్షల టీకాలు రెండో డోస్ వారికే ప్రాధాన్యం
కేంద్రం నుంచి రాష్ట్రానికి ఆదివారం రాత్రి 2.70 లక్షల కరోనా వ్యాక్సిన్లు వచ్చాయి. అందులో దాదాపు 2.20 లక్షల కోవిషీల్డ్, 50 వేల కోవాగ్జిన్ టీకాలు ఉన్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. టీకాలను హైదరాబాద్‌లోని స్టేట్ వ్యాక్సిన్ సెంటర్ నుంచి జిల్లాలకు పంపించినట్లు చెప్పారు. దీంతో సోమవారం యథావిధిగా ప్రభుత్వ, ప్రైవేటు టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రస్తుతం తమ వద్ద 90 వేల వ్యాక్సిన్లు ఉన్నాయని, కొత్త వాటితో కలిపి మొత్తం 3,60,000 టీకాలు అందుబాటులో ఉన్నాయని, అవి రెండ్రోజులకు సరిపోతాయని వివరించారు. అయితే రెండో డోస్ లబ్ధిదారులకే టీకాలిచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. వారికి టీకాలు వేశాకే కొత్త వారికి మొదటి డోస్ వేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment