సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ
సాక్షి, సిటీబ్యూరో: క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా నిరుపేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకగా నూతన వస్త్రాలు పంపిణీ చేసి విందు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. నగర పరిధిలోని చర్చిల వారిగా నిరుపేద క్రైస్తవులకు గిఫ్ట్ ప్యాక్ పంపిణీకి ఏర్పాట్లు, విందు నిర్వహణ కోసం నియోజకవర్గానికి లక్ష రూపాయల చొప్పున కేటాయించింది. ఒక్కో నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. మరోవైపు ప్రభుత్వం పక్షాన ఎల్‌బీ స్టేడియంలో పెద్ద ఎత్తున విందు ఇవ్వనుంది. గ్రేటర్ పరిధిలో సుమారు లక్ష క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకల ల«బ్ధి చేకూరనుంది.
ఘనంగా ఏర్పాట్లు చేయాలి : తలసాని
క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి క్రిస్మస్ వేడుకల నిర్వహణ పై నగరంలోని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించారు.
క్రిస్మస్‌ను పేదలు కూడా సంతోషంగా జరుపుకోవాలనే ఆలోచనతో పేదలకు ప్రభుత్వం గిఫ్ట్ ప్యాక్ లు (దుస్తులు) పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. సమావేశంలోమంత్రి మహమూద్ అలీ, మండలి ప్రభుత్వ విప్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్సీలు స్టీఫెన్ సన్, సురభి వాణి దేవి, హసన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, కౌసర్ మొహినోద్దిన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment