
హిమాయత్‌నగర్ (హైదరాబాద్): త్వరలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే జాతీయ సాంస్కృతిక ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ఈ ఉత్సవాల ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేందుకు ప్రతి ఒక్క రూ సిద్ధపడాలన్నారు. ఈ ఉత్సవాల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో పాటు సీనీ ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు.
ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే జాతీయ సాంస్కృతిక ఉత్సవాల ఏర్పాట్లపై హైదరాబాద్‌లో ఆదివారం ఆయన బీజేపీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. తొలుత ఈనెల 26, 27 తేదీల్లో ఏపీలోని రాజమహేంద్రవరంలో ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అక్కడ జరిగే ఉత్సవాల ప్రారంభానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి హాజరవుతారన్నారు. తర్వాత వరంగల్‌లో ఈనెల 29, 30 తేదీల్లో, ఏప్రిల్ 1,2,3 తేదీల్లో హైదరాబాద్‌లో ఉత్సవాలను నిర్వహించనున్న ట్లు వెల్లడించారు. ఇక్కడి ఉత్సవాలకు కూ డా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలతో పాటు సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించామన్నారు.