
రాష్ట్రంలో పాదయాత్రల సీజన్ నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కానీ.. రాజకీయ పార్టీల పాదయాత్రలు మాత్రం జోరందుకుంటున్నాయి. అధికార టీఆర్‌ఎస్ మినహా కొత్తగా ఏర్పాటైన పార్టీలు, చిన్నాచితకా పార్టీలతోపాటు ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, బీజేపీ కూడా పాదయాత్రల ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాయి.
వైఎస్సార్‌టీపీ, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)ల నేతృత్వంలో ఇప్పటికే యాత్రలు ప్రారంభమయ్యాయి. ఆ పార్టీల అగ్రనేతలు వైఎస్ షర్మిల, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌లు తమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. కొత్తగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా పాదయాత్రకు సై అంటోంది.
– సాక్షి, హైదరాబాద్
కమలం.. హస్తం ఇలా..
వచ్చే నెల 14 నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో రెండో విడత పాదయాత్ర ప్రారంభం కానుంది. బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఈ యాత్రలో భాగంగానే పలు ప్రధాన పార్టీల నేతలు బీజేపీలో చేరతారని, అన్ని పక్షాల నేతలు తమతో టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేయాలనే యోచనలో ఉంది. ఇందుకోసం అధిష్టానం అనుమతి కూడా కోరింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో, ఇతర ముఖ్య నేతల ఆధ్వర్యంలో హైదరాబాద్ మినహా దక్షిణ తెలంగాణలో పాదయాత్ర ఉంటుందని తెలుస్తోంది. ఇక, హైదరాబాద్‌లో పార్టీ అగ్ర నాయకత్వం అంతా మరో రూపంలో యాత్ర చేయాలనే యోచనలో ఉన్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
షర్మిల.. తలపెట్టారిలా..
రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను అందరికంటే ముందుగా వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రారంభించారు. గత అక్టోబర్ 20న ఆమె రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ప్రజాప్రస్థానం యాత్రను ప్రారంభించారు. 21 రోజులపాటు యాత్ర సాగింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా తాత్కాలికంగా నిలిపివేయగా కోవిడ్ ఉధృతితో నవంబర్ 9న యాత్రకు బ్రేక్ పడింది. షర్మిల 21 రోజుల యాత్రలో 15 మండలాలు, 5 మున్సిపాలిటీలు, 122 గ్రామాల్లో పర్యటించారు. షర్మిల రెండో విడత పాదయాత్ర ఈనెల 11న నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో ప్రారంభమైంది.
భట్టి... మధిర చుట్టుముట్టి
కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) నేత మల్లు భట్టి విక్రమార్క ‘పీపుల్స్ మార్చ్’ పేరుతో మధిర నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గత నెల 27న ముదిగొండ మండలం ఎడవెల్లి నుంచి ప్రారంభించిన ఈ యాత్ర 50 రోజులపాటు 506 కి.మీ. సాగేలా షెడ్యూల్ రూపొందించారు. అయితే, అసెంబ్లీ సమావేశాలతో ఈనెల 5న ఈ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అప్పటికే భట్టి 102 కి.మీ. తిరిగారు. ఈనెల 25 నుంచి పీపుల్స్ మార్చ్‌ను కొనసాగించేందుకు భట్టి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఆర్‌ఎస్పీ.. ఫర్ బీఎస్పీ
మాజీ ఐపీఎస్ అధికారి, బీఎస్పీ ఇంచార్జి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ కూడా రాష్ట్రవ్యాప్త రాజ్యాధికార యాత్రలో ఉన్నారు. ఈ నెల 6న జనగామ జిల్లా నుంచి ‘బహుజన రాజ్యాధికార యాత్ర’ పేరుతో ప్రారంభమైన ఈ యాత్ర 300 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది.
ఆమ్ ఆద్మీ ‘క్రేజ్’
పంజాబ్ ఎన్నికల్లో విజయంతో ఊపు మీదున్న ఆప్ కూడా తెలంగాణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఆ పార్టీ తెలంగాణలో రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు శ్రీకారం చుడుతోంది. పార్టీ రాష్ట్ర నాయకురాలు ఇందిరాశోభన్ ఈ పాదయాత్ర చేస్తారని సమాచారం. వచ్చే 14 నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని, ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెప్పాయి.
సర్వోదయ... వార్ధా వరకు
భూదానోద్యమ స్ఫూర్తితో రాష్ట్రంలో మరో పాదయాత్ర జరుగుతోంది. రాజీవ్‌గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్ చైర్‌పర్సన్, కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌తోపాటు పలు జాతీయ సం స్థల ఆధ్వర్యంలో ఈ నెల 14న యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలో సర్వోదయ యాత్ర ప్రారంభమైంది. రాష్ట్రంలో 26 రోజులపాటు సాగిన అనంతరం మహారాష్ట్రలోని వార్ధా వద్ద యాత్ర ముగియనుంది.
భూదానోద్యమం ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సం దర్భంగా చేపట్టిన ఈ యాత్రకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా హాజరుకానున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్ పర్యవేక్షణలో సాగుతున్న యాత్ర ప్రస్తుతం సిద్దిపేట జిల్లాకు చేరుకుంది. శనివారం యాత్ర లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment