రెండేళ్లుగా రోడ్డెక్కలేదు.. మరి బడి బస్సు భద్రమేనా? | Telangana: Is School Bus Safety For Traveling With Students | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా రోడ్డెక్కలేదు.. మరి బడి బస్సు భద్రమేనా?

Published Mon, Jun 6 2022 10:48 AM | Last Updated on Mon, Jun 6 2022 3:57 PM

Telangana: Is School Bus Safety For Traveling With Students - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌టౌన్‌: జిల్లాలోని ప్రైవేట్‌ పాఠశాలల బస్సులు కొంతకాలంగా ఉన్నచోటు నుంచి కదలకుండా ఉండడంతో మూలనపడ్డాయి. గత విద్యా సంవత్సరంలో సెప్టెంబర్‌ నెలలో బడులు ప్రారంభమైనప్పటికీ పెద్ద స్కూల్‌లకు సంబంధించిన బడి బస్సులు రోడ్డెక్కాయి. మిగితా పాఠశాలల బస్సులు ఇంకా కదలకుండానే ఉన్నాయి. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుతున్న చాలా మంది విద్యార్థులు స్కూల్‌ బస్సుల్లోనే పాఠశాలకు రాకపోకలు కొనసాగిస్తారు. ఈ నేపథ్యంలో బడి బస్సు భద్రమెంత అనే అనుమానం తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్‌ గడువు ముగిసింది. ఫిట్‌నెస్‌ లేకుండా బస్సులు తిప్పితే ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు లేకపోలేదు. రవాణ శాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఉమ్మడి జిల్లాలో.. 
ఉమ్మడి జిల్లాలోని ఆదిలాబాద్‌ పరిధిలో 192 స్కూ ల్‌ బస్సులు, ఆసిఫాబాద్‌ జిల్లాలో 102 బస్సులు ఉండగా ఒక్కదానికి కూడా ఫిట్‌నెస్‌ లేదు. మంచిర్యాల జిల్లాలో 400 బస్సులకు గానూ నాలుగింటికి, నిర్మల్‌ జిల్లాలో 270 స్కూల్‌ బస్సులకు గానూ 20 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్‌ ఉందని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 1,430 పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 987 ప్రాథమిక, 186 ప్రాథమికోన్నత, 257 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 1,32,031 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాలోని 146 ప్రైవేట్‌ పాఠశాలల్లో 26,039 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సగానికిపైగా విద్యార్థులు స్కూల్‌ బస్సుల్లోనే ఇంటికి రాకపోకలకు కొనసాగిస్తుంటారు. 146 ప్రైవేట్‌ పాఠశాలలకు 192 స్కూల్‌ బస్సులు ఉన్నాయి. వీటిన్నింటికీ ప్రస్తుతం ఫిట్‌నెస్‌ గడువు ముగిసింది. దాదాపు అన్ని బస్సులకు ఇన్సూరెన్స్‌ కూడా ముగిసింది.

రోజుకు రూ.50 జరిమానా..
స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధించనున్నట్లు రవాణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇన్సూరెన్స్, పొల్యూషన్‌ చేయించుకోవాలని సూచిస్తున్నారు. దీంతో ప్రైవేట్‌ స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నారు. కరోనా కారణంగా ఒకవైపు ఇబ్బందులు పడుతుంటే మరోవైపు జరిమానా పేరిట ఇబ్బందులకు గురవుతున్నామని వాపోతున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం కరోనా సమయంలో ఫిట్‌నెస్‌ సామర్థ్య పరీక్షలకు ఏడాదిన్నర పాటు వెసులుబాటు కల్పించింది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి వాహనాల సామర్థ్య పరీక్షలు చేయించుకోని వాటికి రోజుకు రూ.50 చొప్పున జరిమానా కట్టించాలన్న నిబంధన విధించింది. 

బస్సు భద్రమెంత.?
కరోనా నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలు ఆర్థికంగా చతికిలపడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే తరగతులు కొనసాగాయి. కోవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో నేరుగా విద్యాబోధన జరుగుతోంది. చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ నెల 13 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో తప్పనిసరి బస్సు భద్రత అవసరమేనని విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు రవాణా శాఖ అధికారులు చెబుతున్నారు. బస్సులో సీట్లు, అద్దాలు, టైర్లు, తదితర బస్సు సామగ్రి అన్నీ సక్రమంగా ఉన్నాయా? లేదా? అనేది చూసుకోవాలని రవాణా శాఖ అధికారులు సూచిస్తున్నారు. స్కూల్‌ బస్సులకు సంబంధించి 32 అంశాలతో కూడిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. డ్రైవర్‌ వయసు 60 ఏళ్లకు మించొద్దు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్‌ తప్పనిసరి. బస్సులో విద్యార్థుల వివరాల పట్టిక నమోదు చేసి ఉంచాలి. గతంలో చిన్నచిన్న ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు యాజమాన్యాలపై ఉంది.

ఈ నిబంధనలు తప్పనిసరి..
► స్కూల్‌æబస్సుకు పాఠశాల పేరు, సెల్‌ఫోన్‌ నంబర్, పూర్తి చిరునామా బస్సు ఎడమ వైపు పూర్తిగా కనిపించేలా ఉండాలి
►  డ్రైవర్‌ వయస్సు 60 సంవత్సరాలకు మించరాదు. తప్పనిసరిగా లైసెన్స్‌ ఉండాలి.
►   డ్రైవర్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి షుగర్, బీపీ పరీక్షలు చేయించుకోవాలి.
►   ప్రతీ బస్సుకు ఒక అటెండర్‌ ఉండాలి.
►   బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల వివరాలు తప్పనిసరిగా తెలిసి ఉండాలి.
►   బస్సులో అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అందుబాటులో ఉంచాలి.
►   బస్సులకు తలుపులు అమర్చబడి ఉండాలి.
►   కిటికీలకు మధ్య రెండు లోహపు కడ్డీలు అమర్చబడి ఉండాలి.
►    విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అటెండెన్స్‌ తీసుకోవాలి.

భద్రత విషయంలో రాజీపడం
పాఠశాల బస్సుల భద్రత విషయంలో రాజీపడేది లేదు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. సేఫ్టీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తాం. డ్రైవర్లు లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయించుకోవాలి. బస్సు కండీషన్‌ ఉంటేనే నడపాలి. నిబంధనలు అతిక్రమించి బస్సు నడిపితే సీజ్‌ చేయడంతో పాటు చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. ఆదిలా బాద్, కుమురంభీం జిల్లాల పరిధిలో ఒక్క ప్రైవేట్‌ స్కూల్‌ బస్సుకు కూడా ఫిట్‌నెస్‌ లేదు. గడువు ముగిసిన తర్వాత రోజుకు రూ.50 చొప్పున జరిమానా విధిస్తాం. 
– పుప్పాల శ్రీనివాస్, డీటీసీ, ఆదిలాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement