Telangana Check Post: మేమేమన్నా పాకిస్తాన్‌ నుంచి వస్తున్నామా? | Telangana Stops Ambulances With COVID Patients At Borders | Sakshi
Sakshi News home page

Telangana Check Post: సరిహద్దుల్లో ఆపేశారు..

Published Sat, May 15 2021 1:50 AM | Last Updated on Sat, May 15 2021 9:41 AM

Telangana Stops Ambulances With COVID Patients At Borders - Sakshi

రామాపురం చెక్‌పోస్టు వద్ద తెలంగాణ పోలీసులతో మాట్లాడుతున్న జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను

తిరుపతికి చెందిన అబ్దుల్లా (38) కరోనా బారిన పడడంతో స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆయన భార్య హుటాహుటిన అంబులెన్స్‌ మాట్లాడుకుని హైదరాబాద్‌కు బయల్దేరారు. కానీ తెల్లవారుజామున 5.30 గంటలకు గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపేశారు. దాంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడా బెడ్స్‌ ఖాళీలేవన్నారు. తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ ఆమె వేడుకున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. విష యం తెలుసుకున్న ఇన్‌చార్జి కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి అబ్దుల్లాను ఆస్పత్రిలో చేర్పించారు.  
 
పేరు లత. స్వస్థలం విజయనగరం జిల్లా. కరోనా బాధితురాలు. పరిస్థితి విషమించిందని వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌కు బయలుదేరారు. దాదాపు 500 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన వారిని.. కోదాడ మండలం రాంపురం చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆపేశారు. అనుమతి లేదని చెప్పడంతో విధిలేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. 
 
సాక్షి, హైదరాబాద్, నెట్‌వర్క్‌: ఇతర రాష్ట్రాల నుంచి కరోనా పేషెంట్లతో వచ్చిన అంబులెన్సులను పోలీసులు రాష్ట్ర సరిహద్దుల్లోనే నిలిపేశారు. హైదరాబాద్‌లో ఆస్పత్రి బెడ్‌ అలాట్‌మెంట్, కోవిడ్‌ కంట్రోల్‌ రూం పాస్‌ ఉంటేనే పంపిస్తామంటూ ఆపేశారు. ఆరోగ్య పరిస్థితి విషమించి, ఆక్సిజన్‌ పెట్టుకుని వచ్చిన పేషెంట్లను కూడా వదిలిపెట్టలేదు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఒక్కొక్కటిగా వరుసగా వచ్చిన అంబులెన్సులు సరిహద్దుల వద్ద బారులు తీరాయి. కంట్రోల్‌ రూం పాస్‌ లేని ఖాళీ అంబులెన్స్‌లు, ఇతర ప్రైవేట్‌ వాహనాలను కూడా పోలీసులు తిప్పి పంపించేశారు.

గద్వాల పోలీసులు 20కిపైగా అంబులెన్సులను నిలిపివేశారు. కోదాడలోని రామాపురం చెక్‌పోస్టు వద్ద ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతం నుంచి వందల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చిన అంబులెన్సులు బారులు తీరాయి. అంతదూరం వచ్చిన అంబులెన్సులను వెనక్కి పంపడంతో రోగుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నల్లగొండ జిల్లాలోని నాగార్జునసాగర్, దామరచర్ల, ఖమ్మం జిల్లా అశ్వారావుపేట చెక్‌పోస్టు, భద్రాచలం చెక్‌పోస్టుల వద్దా ఇదే పరిస్థితి కనిపించింది. ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చేవారు, కర్ణాటక ప్రాంత వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 


సర్కారు ఆదేశాలతో.. 
పొరుగు రాష్ట్రాల కోవిడ్‌ పేషెంట్లు చికిత్స కోసం తెలంగాణలోని ఆస్పత్రులకు వస్తే.. ఆస్పత్రి అంగీకార పత్రం ఉండాలని, కోవిడ్‌ కంట్రోల్‌ రూంకు వివరాలు సమర్పించి అనుమతి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ మార్గదర్శకాలు జారీ చేశారు. దీంతో గురువారం వరకు ఆస్పత్రి కన్ఫర్మేషన్‌  ఉంటే అంబులెన్సులను అనుమతించిన పోలీసులు.. కంట్రోల్‌ రూం నుంచి లెటర్‌ లేదంటూ శుక్రవారం తెల్లవారుజాము నుంచే నిలిపివేశారు. 


పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్తత 
ఏపీ వైపు నుంచి వస్తున్న కోవిడ్‌ అంబులెన్సులను ఆపేయడంతో జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు చెక్‌పోస్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సుమారు 23 అంబులెన్సులను సరిహద్దుల నుంచే వెనక్కి పంపించారు. రెండు అంబులెన్స్‌లకు కంట్రోల్‌ రూం లేఖలు ఉండటంతో అనుమతించారు. మరికొందరు పేషెంట్ల బంధువులు అంబులెన్సులతో సరిహద్దుల వద్దే వేచి చూశారు. అంబులెన్సులను అడ్డుకుంటున్న విషయం తెలిసి ఏపీకి చెందిన కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్‌ ఖాన్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌లు చెక్‌పోస్టు వద్దకు వచ్చారు. అంబులెన్స్‌లకు అనుమతి ఇవ్వాలంటూ గద్వాల ఎస్పీ, స్థానిక అధికారులకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని పోలీసులు స్పష్టం చేయడంతో ఎమ్మెల్యేలు వెనుదిరిగారు.

ఈ క్రమంలో కోవిడ్‌ రోగుల బంధువులు, ఏపీ బీజేపీ కార్యకర్తలు పుల్లూరు చెక్‌పోస్టు ఆందోళనకు దిగారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఒక సందర్భంలో తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలు, పెద్ద సంఖ్యలో కానిస్టేబుళ్లు చెక్‌పోస్టు వద్ద మోహరించి బందోబస్తు నిర్వహించారు. హైకోర్టు ఆదేశాల మేరకు సాయంత్రం ఆరు గంటల తర్వాత అంబులెన్స్‌లకు అనుమతి ఇచ్చారు. రాత్రి 10 గంటల వరకు 12 అంబులెన్స్‌లకు హైదరాబాద్‌కు వెళ్లినట్టు అధికారులు తెలిపారు.


మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లోనూ.. 
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వస్తున్న కోవిడ్‌ అంబులెన్సులను కూడా సరిహద్దుల్లో అడ్డుకున్నారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం మాడ్గి వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద అంబులెన్సులను తిప్పి పంపేశారు. బాధితులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని కుటుంబ సభ్యులు వేడుకున్నా.. తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేశారు.

కాళ్లుపట్టుకుంటాం.. వదలండి.. 
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్‌ వద్ద శుక్రవారం తెల్లవారుజాము నుంచే కోవిడ్‌ అంబులెన్సులను అడ్డుకున్నారు. మధ్యాహ్నం వరకే సుమారు 14 అంబులెన్స్‌లు తిప్పిపంపారు. హైదరాబాద్‌లోని ఆస్ప త్రుల్లో బెడ్‌ మంజూరు చేసిన పత్రం, కోవిడ్‌ కంట్రోల్‌ రూం అనుమతి ఉన్న కొద్దిమందిని మాత్రమే అనుమతించారు. బెడ్‌ ఉన్నా కంట్రోల్‌ రూం లేఖ లేకుంటే అనుమతి ఇవ్వలేదు. దీంతో కోవిడ్‌ పేషెంట్లు, వారి బంధువులు తీవ్ర ఆందో ళన వ్యక్తం చేశారు. పరిస్థితి విషమంగా ఉందని కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామంటూ బతిమాలారు. విజయనగరం నుంచి వచ్చిన లత, ఏలూరు నుంచి వచ్చిన రాజేశ్వరి, తిరుపతి నుంచి వచ్చిన అబ్దుల్లాల బంధువులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మాది భారతదేశం కాదా.. మేమేమన్నా పాకిస్తాన్‌ నుంచి వస్తున్నామా? ప్రాణపాయ స్థితిలో ఉన్నవారిని అడ్డుకోవడం ఏమిటి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం వరకైనా వదులుతారేమోనన్న ఆశతో కొందరు చెక్‌పోస్టు వద్దే ఎదురుచూశారు. కొందరి అంబులెన్సులలో ఆక్సిజన్‌ సిలిండర్లు అయిపోవడంతో.. జగ్గయ్యపేట, నందిగామ నుంచి తెప్పించుకున్నారు. తిరిగి వెళ్తున్న క్రమంలో ఇద్దరు పేషెంట్లు చనిపోయినట్లు తెలిసింది. కాగా.. అంబులెన్సులను ఆపేశారన్న విషయం తెలిసిన ఏపీ ప్రభుత్వ విప్, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రామాపురం క్రాస్‌రోడ్డుకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌ మానవతా దృక్పథంతో ఆలోచించాలన్నారు. కరోనాతో ప్రాణాలు పోతుంటే.. ఎక్కడా లేనట్టు తెలంగాణ ప్రభుత్వం అంబులెన్స్‌లు నిలిపివేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రాణాలు పోతుంటే.. ఆపేస్తారా? 
కరోనాతో ఒక్కసారిగా ఆరోగ్య పరిస్థితి సీరియస్‌ అవుతోందని.. అన్నీ సమకూర్చుకుని, కంట్రోల్‌ రూం లెటర్‌ తీసుకుని బయల్దేరే సమయం ఎక్కడ ఉందని కరోనా రోగులు, వారి బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమవారి ప్రాణాలు కాపాడుకునేందుకు అంత దూరం నుంచి వస్తే.. ఆంక్షల పేరుతో వెనక్కి పంపడమేంటని మండిపడ్డారు. తమను అనుమతించాలని కోరారు. కన్నీళ్లు పెట్టుకుంటూ.. కాళ్లు పట్టుకుంటామని బతిమాలారు. అయినా తామేమీ చేయలేమని.. ప్రభుత్వ ఆదేశాల మేరకే వ్యవహరిస్తున్నామని పోలీసులు చేతులెత్తేశారు. చివరికి చేసేదేమీ లేక కరోనా పేషెంట్ల బంధువులు ఆవేదనతోనే తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం అనుమతి ఇవ్వకపోతారా అన్న ఆశతో చెక్‌పోస్టుల వద్ద వేచి ఉన్నారు. చివరికి హైకోర్టు ఆదేశాలు రావడంతో పోలీసులు సాయంత్రం ఆరేడు గంటల సమయం నుంచి అంబులెన్సులను వదిలిపెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement