Telangana TET Notification 2022: TS TET To Be Held On June 12 - Sakshi
Sakshi News home page

TS TET 2022 Hall Tickets: తెలంగాణలో కష్టాల టెట్‌.. అభ్యర్థులకు తిప్పలు, పరీక్ష రాసేదెలా?

Published Fri, Jun 10 2022 12:23 AM | Last Updated on Fri, Jun 10 2022 3:09 PM

Telangana TET Notification 2022: TS TET To Be Held On June 12 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 12న జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)కు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నా, అభ్యర్థులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. పరీక్ష కేంద్రాల్లో తికమక, హాల్‌ టికెట్లలో ఫొటో ఉంటే సంతకం ఉండటం లేదని, సంతకం ఉంటే ఫొటో కనిపించడం లేదని పలువురు అభ్య ర్థులు చెబుతున్నారు. సమస్య పరిష్కారం కోసం జిల్లా విద్యాశాఖాధికారుల చుట్టూ తిరిగినా వాళ్లు అందుబాటులో ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆఖరి నిమిషంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులకు సొంత ప్రాంతంలో కాకుండా, పక్క జిల్లాల్లో పరీక్ష కేంద్రం కేటాయించారు. అయితే, హాల్‌టికెట్లలో ఫలానా కాలేజీ అని మాత్రమే పేర్కొ న్నారు. ఒకే పేరుతో జిల్లా కేంద్రంలో రెండు మూడు కాలేజీలున్నాయి. దీంతో ఏ కాలేజీలో పరీక్ష రాయాలో తెలియని గందరగోళంలో అభ్యర్థులు న్నారు.

పరీక్ష కేంద్రం ఫోన్‌ నంబర్లు అందు బాటులో ఉంచామని అధికారులు చెబుతున్నా, ఆ నంబర్లకు ఫోన్‌ చేస్తే స్పందన ఉండటం లేదని, ఎక్కువ సేపు ఎంగేజ్‌లో ఉంటోందని పలువురు అభ్యర్థులు తెలిపారు. పరీక్షకు ఇంకా రెండు రోజులే సమయం ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగు తోంది. రాష్ట్రవ్యాప్తంగా టెట్‌ కోసం మొత్తం 6,29,352 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,683 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

తప్పుల సవరణకు అవకాశమేది?
టెట్‌ పరీక్ష నిర్వహణపై అధికారులు మొదటినుంచీ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ సమయంలో చాలా రోజులు సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. దరఖాస్తు సమయంలో సంతకం, ఫొటోలు సరిగా అప్‌లోడ్‌ అవలేదని అభ్యర్థులు ఇబ్బంది పడ్డారు. దరఖాస్తులు అప్‌లోడ్‌ చేసిన తర్వాత తప్పుల సవరణకు ప్రత్యేకంగా అవకాశం కల్పించాలనే డిమాండ్‌ వచ్చింది.

అయితే టెట్‌ నిర్వహణ అధికారులు ఇవేవీ పట్టించుకోలేదని అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తంచేశారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌ తర్వాత ఫొటోలు, సంతకాలు లేకపోతే డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లపై ఫొటో అంటించి, సంతకాలు చేసి, గెజిటెడ్‌ ధ్రువీకరణ తీసుకోవాలని అధికారులు తెలిపారు. ఆ తర్వాత స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారిని కలిస్తే పరిశీ లించి న్యాయం చేస్తారని వెసులుబాటు కల్పించారు.

అయితే, డీఈవోలు ఇతర అధికార పనుల్లో ఉండటం, సవరణల కోసం వచ్చే అభ్యర్థులు ఎక్కు వగా ఉండటంతో సవరణలు పరిశీలించే అవకాశం ఉండటం లేదని అభ్యర్థులు అంటున్నారు. కింది స్థాయి అధికారులకు ఈ బాధ్యత అప్పగించినా, రోజుల తరబడి తిరిగితే తప్ప పనిజరగడం లేదని చెబుతున్నారు. 

స్పష్టత లేక గందరగోళం..
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆలస్యంగా దరఖాస్తు చేసిన అభ్యర్థులకు పక్క జిల్లాల్లో పరీక్ష కేం ద్రాలు కేటాయించారు. వరంగల్‌ పట్టణంలో ఒకే పేరుతో 3 కాలేజీలు (బ్రాంచీలు) ఉన్నాయి. కాలేజీ పేరు ఇచ్చి.. వరంగల్‌ అంటూ హాల్‌ టికెట్‌లో పేర్కొన్నారు. అయితే ఏ బ్రాంచ్‌ అనేది స్పష్టం చేయలేదు. హాల్‌ టికెట్‌లో ఇచ్చిన ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేస్తే స్పందన కన్పిం చలేదు.

ఖమ్మంకు చెందిన ఓ అభ్యర్థి హాల్‌ టికెట్‌పై తన సంతకం పడలేదు. మళ్లీ ఫొటో, సంతకం అం టించి, గెజిటెడ్‌ అధికారి చుట్టూ తిరిగి ధ్రువీ కరణ చేయించారు. డీఈవో కార్యాలయంలో అధికారులు రెండు రోజులైనా స్పందించలేదని ఆ అభ్యర్థి తెలిపారు. 

సంతకం కోసం రెండు రోజులా? 
టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టెట్‌) హాల్‌ టికెట్‌ డౌన్‌ లోడ్‌ చేశాక చూసుకుంటే ఫొటో పక్కన ఉండాల్సిన సంతకం లేదు. దీంతో రెండు రోజుల పాటు హనుమకొండలోని డీఈఓ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చింది. చివరికి డీఈఓ కార్యాలయం ఏడీ పర్మిట్‌ చేస్తూ హాల్‌ టికెట్‌పై సంతకం చేశారు. 
–ఎండీ ఖరీముల్లా, టెట్‌ అభ్యర్థి, హనుమకొండ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement